మన చేతుల్లోకి.... | 2nd Test: Ajinkya Rahane shines at Basin Reserve with maiden ton | Sakshi
Sakshi News home page

మన చేతుల్లోకి....

Published Sun, Feb 16 2014 1:50 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

మన చేతుల్లోకి.... - Sakshi

మన చేతుల్లోకి....

పట్టుబిగించిన భారత్
 అజింక్యా రహానే సెంచరీ
  ధావన్ శతకం మిస్
 భారత్ 438 ఆలౌట్
 న్యూజిలాండ్‌తో రెండో టెస్టు
 
 న్యూజిలాండ్ పర్యటన చివర్లో గాడిలో పడ్డ కుర్రాళ్లు... రెండో టెస్టును భారత్ చేతుల్లోకి తెచ్చారు. రహానే సూపర్ సెంచరీ, ధావన్, ధోని వీరోచిత ప్రదర్శనతో టీమిండియా మ్యాచ్ ఫలితాన్ని శాసించే స్థితికి చేరుకుంది. మరోవైపు ఇప్పటికే ఓ వికెట్ కోల్పోయిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఎదురీదుతోంది. భారత బౌలర్లు మరోసారి విజృంభిస్తే మ్యాచ్ గెలవడం లాంఛనమే. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట కీలకం కానుంది.
 
 వెల్లింగ్టన్: బౌలర్లు ఇచ్చిన శుభారంభాన్ని భారత బ్యాట్స్‌మెన్ అందిపుచ్చుకున్నారు. అజింక్యా రహానే (158 బంతుల్లో 118; 17 ఫోర్లు, 1 సిక్సర్), శిఖర్ ధావన్ (127 బంతుల్లో 98; 14 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (86 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్సర్)ల సమయోచిత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ధోనిసేన పట్టు బిగించింది.
 
 బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... శనివారం రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 102.4 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 246 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ (18 బ్యాటింగ్), విలియమ్సన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఫుల్టన్ (1) విఫలమయ్యాడు. ప్రస్తుతం కివీస్ ఇంకా 222 పరుగులు వెనుకబడి ఉంది.
 
 ఠ  ధావన్ సెంచరీ మిస్
 ఓవర్‌నైట్ స్కోరు 100/2తో ఇన్నింగ్ కొనసాగించిన శిఖర్ ధావన్, ఇషాంత్ (50 బంతుల్లో 26; 3 ఫోర్లు) కాసేపు ఆచితూచి ఆడారు. అయితే బౌల్ట్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టిన ‘లంబూ’ 37వ ఓవర్ చివరి బంతికి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు ఈ జోడి నెలకొల్పిన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ధావన్, కోహ్లి (93 బంతుల్లో 38; 4 ఫోర్లు)లు అప్రమత్తంగా వ్యవహరించలేకపోయారు. పదేపదే వైడ్ బంతులను టచ్ చేసేందుకు ప్రయత్నించిన ధావన్ మూల్యం చెల్లించుకున్నాడు.
 
 వికెట్లకు దూరంగా సౌతీ వేసిన బంతిని ఆడబోయి కీపర్ చేతికి చిక్కాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వరుసగా రెండో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరో మూడు పరుగుల తర్వాత రోహిత్ (0) ఓ పేలవమైన షాట్‌కు అవుట్ కావడంతో భారత్ 165 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లితో జత కలిసిన రహానే జరిగిన నష్టాన్ని పూరించే బాధ్యతను తీసుకున్నాడు. ఈ ఇద్దరు సమయోచితంగా ఆడటంతో మరో వికెట్ పడకుండా భారత్ 201/5 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.
 
  రహానే నిలకడ
 లంచ్ తర్వాత రహానే, కోహ్లి జాగ్రత్తగా ఆడారు. అడపాదడపా బౌండరీలు కొట్టినా ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడిని విడదీసేందుకు మెకల్లమ్.... బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించాడు. చివరకు ఈ ప్రయోగం 69వ ఓవర్‌లో ఫలించింది. వాగ్నేర్ వేసిన పుల్ లెంగ్త్ అవుట్‌సైడ్ బంతిని అనవసరంగా ఆడిన కోహ్లి కవర్స్‌లో రూథర్‌ఫోర్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అత్యంత కీలక సమయంలో అడుగుపెట్టిన ధోని మెరుగ్గా ఆడాడు. వాగ్నేర్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టి అటాకింగ్ గేమ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రహానే కూడా 93 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
 
  టపటపా...
 టీ తర్వాత ధోని... సౌతీ బౌలింగ్‌లో భారీ సిక్సర్, రెండు ఫోర్లు కొట్టాడు. రహానే కూడా వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ఈ దశలో బౌల్ట్ వేసిన లెగ్‌సైడ్ బంతి ధోని గ్లౌవ్స్‌కు తాకి కీపర్ చేతిలోకి వెళ్లింది. ఈ జోడి ఏడో వికెట్‌కు 120 పరుగులు జోడించడంతో భారత్‌కు మంచి ఆధిక్యం దక్కింది. జడేజా (16 బంతుల్లో 26; 6 ఫోర్లు) వచ్చీ రావడంతో బౌండరీలతో విరుచుకుపడినా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేపోయాడు. 99 పరుగుల వద్ద అండర్సన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన రహానే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ కొట్టి సౌతీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే జహీర్ అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
 
  స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 192 ఆలౌట్
 భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 98; విజయ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 2; పుజారా ఎల్బీడబ్ల్యు (బి) బౌల్ట్ 19; ఇషాంత్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 26; కోహ్లి (సి) రూథర్‌ఫోర్డ్ (బి) వాగ్నేర్ 38; రోహిత్ (బి) నీషమ్ 0; రహానే (సి) బౌల్ట్ (బి) సౌతీ 118; ధోని (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 68; జడేజా (సి) ఫుల్టన్ (బి) వాగ్నేర్ 26; జహీర్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 22; షమీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం: (102.4 ఓవర్లలో ఆలౌట్) 438
 వికెట్ల పతనం: 1-2; 2-89; 3-141; 4-162; 5-165; 6-228; 7-348; 8-385; 9-423; 10-438
 బౌలింగ్: బౌల్ట్ 26-7-99-3; సౌతీ 20-0-93-3; వాగ్నేర్ 22.4-3-106-3; అండర్సన్ 16-2-66-0; నీషమ్ 18-2-62-1.
 
 న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 1; రూథర్‌ఫోర్డ్ బ్యాటింగ్ 18; విలియమ్సన్ బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (9 ఓవర్లలో వికెట్ నష్టానికి) 24
 వికెట్ పతనం: 1-1
 బౌలింగ్: ఇషాంత్ 3-0-9-0; జహీర్ 3-2-7-1; షమీ 3-0-8-0.
 
 సెషన్-1 ఓవర్లు : 28;పరుగులు: 101; వికెట్లు : 3
 
 సెషన్-2 ఓవర్లు: 28;పరుగులు: 100; వికెట్లు: 1
 
 సెషన్-3 ఓవర్లు: 18.4;పరుగులు: 137;వికెట్లు: 4 (భారత్) ఓవర్లు: 9; పరుగులు: 24; వికెట్లు: 1 (కివీస్)
 
 ఆ ఇద్దరికీ కృతజ్ఞతలు...
 టెస్టుల్లో తొలి సెంచరీ సాధించినందుకు సంతోషంగా ఉంది.  ఇందుకు రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారి ప్రోత్సాహమే నాలో ఆత్మస్థయిర్యాన్ని పెంచింది. ద్రావిడ్ నా రోల్‌మోడల్. చిన్నప్పటి నుంచి అతని ఆటనే ఆరాధిస్తూ, అతనిలాగే ఆడాలని కలలు కనేవాడిని. భారత జట్టుకు ఆడినప్పడు, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కలిసి ఆడినప్పుడు ద్రావిడ్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇక సచిన్‌తో కలిసి ఆడిన రెండు టెస్టుల్లోనే అమూల్యమైన సలహాలిచ్చాడు. మూడో రోజు ఆట కీలకం. మా బౌలర్లు విజృంభించి ప్రత్యర్థి పని ముగిస్తారని ఆశిస్తున్నాను.
 - అజింక్య రహానే
 
 పోరాటమే మిగిలింది
 ఇంకా మూడు రోజుల ఆట మిగిలే ఉన్నందున మ్యాచ్‌ను కాపాడుకునే అవకాశం మాకుంది. పిచ్ కూడా బ్యాటింగ్‌కు చక్కగా అనుకూలిస్తోంది. మిగిలిందల్లా మేం తీవ్రంగా పోరాడడమే.
 -వాట్లింగ్, న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్
 
 1 15 ఏళ్ల తర్వాత ఉపఖండం వెలుపల ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్ రహానే.
 
 4 న్యూజిలాండ్ గడ్డపై 90 పరుగుల్లో అవుటైన నాలుగో భారత క్రికెటర్ శిఖర్ ధావన్.
 
 6 ఉపఖండం బయట 200కు పైగా ఆధిక్యంలో నిలవడం భారత్‌కు ఇది ఆరోసారి.
 
 6 విదేశీ గడ్డపై ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రహానే చేసిన సెంచరీ ఆరోది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement