మూడో వన్ డేలో 330 కొడతాం: ధోనీ
బ్రిస్బేన్: ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్ డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో 300 పైచిలుకు పరుగులు సాధించినప్పటికీ ఓటమిని చవిచూడటం బాధాకరమేనని, దీన్ని బట్టి ప్రత్యర్థి జట్టుకు 300 పరుగుల లక్ష్యం సరిపోవట్లేదని టీమిండియా సారధి ఎంఎస్ ధోనీ అన్నారు. బ్రిస్బేన్ లో రెండో వన్ డే అనంతరం మీడియాతో మాట్లాడిన ధోనీ.. మూడో వన్ డేలో 330 పైచిలుకు పరుగులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
'మా ముందున్నవి రెండే లక్ష్యాలు ఒకటి ప్రత్యర్థి బ్యాట్స్ మన్ కు కట్టడి చేయడం లేదా 330 పరుగులు సాధించడం. తర్వాతి మ్యాచ్ లో రెండో పని చేస్తాం' అని టీమిండియా కెప్టెన్ అన్నారు. భారత తురుపుముక్క ఇషాంత శర్మ వైఫల్యంపై స్పందిస్తూ మైదానంలో గాలి అనుకూలంగా వీయలేదని, ఒకవైపు కాకుండా అన్ని వైపుల నుంచి గాలి వీయడం వల్లే ఇషాంత్ స్వింగ్ రాబట్టలేకపోయాడని ధోనీ చెప్పారు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 0-2తో వెనుకబడిపోయిన దృష్ట్యా మిగిలిన మూడు మ్యాచ్ ల్లో కఠోరంగా శ్రమిస్తామన్నారు.
శుక్రవారం బ్రిస్బేన్ లో జరిగిన రెండో వన్ డేలో టీమిండియాపై ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బుధవారం పెర్త్ లో రిగిన తొలి మ్యాచ్ లో ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. మూడో వన్ డే ఆదివారం (జనవరి 17) మెల్ బోర్న్ లో జరగనుంది.