310 కేజీలు ఎత్తిన ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్
రెండేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ మరోసారి మెరిశాడు. ఆటల్లో అగ్రగామిగా ఉన్న చైనా నేలపై ఈ యువ తార పసిడి కాంతులు విరజిమ్మాడు. తన అద్భుత ప్రదర్శనతో ఆసియా యూత్ క్రీడల్లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకాన్ని చేర్చాడు.
నాన్‌జింగ్ (చైనా): అంచనాలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ ఆసియా యూత్ క్రీడల్లో అదరగొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల 77 కేజీల విభాగంలో రాహుల్ మొత్తం 310 కేజీలు బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం కొనసాగుతున్న కారణంగా ఈ క్రీడల్లో భారత క్రీడాకారులు ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్స్ (ఐఓఏ) పేరుతో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన 16 ఏళ్ల రాహుల్ స్నాచ్‌లో 142 కేజీలు... క్లీన్ అండ్ జెర్క్‌లో 168 కేజీల బరువెత్తాడు. మొత్తం 310 కేజీలతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మూడు అంశాల్లోనూ రాహుల్ ‘టాప్’లో ఉండటం విశేషం. లూ జింగ్యూ (చైనా, 285 కేజీలు) రజతం సాధించగా... పిచెట్ మనీశ్రీ (థాయ్‌లాండ్, 280 కేజీలు) కాంస్య పతకం దక్కించుకున్నాడు.
ఆద్యంతం ఆధిపత్యం...
పురుషుల 77 కేజీల విభాగంలో మొత్తం 11 మంది వెయిట్‌లిఫ్టర్లు బరిలోకి దిగారు. స్నాచ్‌లోని తొలి ప్రయత్నంలో రాహుల్ 132 కేజీలు.... రెండోసారి 137 కేజీలు... మూడోసారి 142 కేజీలు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్‌ఎస్) విద్యార్థి తొలుత 158 కేజీలు... రెండోసారి 164 కేజీలు... మూడోసారి 168 కేజీలు ఎత్తాడు. అన్ని ప్రయత్నాల్లోనూ మిగతా 10 మంది వెయిట్‌లిఫ్టర్లు రాహుల్ ఎత్తిన బరువుకు సమీపంలోకి రాకపోవడం గమనార్హం.
షూటర్ షైంకీ నాగర్‌కు రజతం
మరోవైపు ఈ క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో షైంకీ నాగర్ రజతం పతకం సాధించాడు. అతను .2 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయాడు. షైంకీ 195.3 పాయింట్లు స్కోరు చేయగా... ‘పసిడి’ నెగ్గిన చైనా షూటర్ వూ జియావు 195.5 పాయింట్లు స్కోరు చేశాడు. రిఫత్ గిర్ఫనోవ్ (ఉజ్బెకిస్థాన్-174.7 పాయింట్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈనెల 24న ముగియనున్న ఆసియా యూత్ క్రీడల్లో ఇప్పటివరకు భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.