బెల్జియంను బోల్తా కొట్టించి...
సెమీస్‌లో భారత్
క్వార్టర్స్‌లో 4-2తో విజయం
రేపు పాకిస్తాన్‌తో ‘ఢీ’
చాంపియన్స్ ట్రోఫీ
భువనేశ్వర్: సరైన సమయంలో సత్తా చాటుకున్న భారత హాకీ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 4-2 గోల్స్ తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకర్ బెల్జియం జట్టును బోల్తా కొట్టించి సంచలనం సృష్టించింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (18వ నిమిషంలో), ఉతప్ప (27వ నిమిషంలో), ఆకాశ్‌దీప్ సింగ్ (41వ నిమిషంలో), ధరమ్‌వీర్ సింగ్ (49వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బెల్జియం జట్టుకు ఫెలిక్స్ (12వ నిమిషంలో),డాకిర్ (18వ నిమిషంలో) ఒక్కో గోల్‌ను అందించారు. శనివారం జరిగే సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో జర్మనీతో ఆస్ట్రేలియా తలపడుతుంది.
ఈ ఏడాది బెల్జియంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భారత్ సొంతగడ్డపై మాత్రం ఆ జట్టును హడలెత్తించింది. ఒకదశలో 0-2 గోల్స్‌తో వెనుకబడిన సర్దార్ సింగ్ బృందం ఆ తర్వాత జూలు విదిల్చింది.
సమన్వయంతో కదులుతూ గోల్ చేసే అవకాశాలను సృష్టించింది. ఇదే జోరులో తొలుత స్కోరును 2-2వద్ద సమం చేయడంతోపాటు ఆ తర్వాత మరో రెండు గోల్స్ చేసి బెల్జియం ఆటను కట్టించింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్ 4-2తో నెదర్లాండ్స్‌ను ఓడించగా... ఆస్ట్రేలియా 4-2తో అర్జెంటీనాపై, జర్మనీ 2-0తో ఇంగ్లండ్‌పై విజయం సాధించాయి.