న్యూఢిల్లీ: ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతిపాదనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విముఖత వ్యక్తం చేశాడు. అసలు టెస్టు క్రికెట్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలను కోవడం సరైన కాదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భాగంగా ఎప్పుట్నుంచో టెస్టుల్లో ఐదు రోజుల విధానం కొనసాగుతుందని, దాన్ని అలాగే కొనసాగించాలన్నాడు. ఏదో మార్పు చేయాలనే యోచనతో నాలుగు రోజులకు కుదించడం ఆమోద యోగ్యం కాదన్నాడు. ఒకవేళ టెస్టు క్రికెట్‌లో మార్పులు ఏమైనా చేయాలనుకుంటే డే అండ్ నైట్ టెస్టుకు సంబంధించి ఆలోచన చేయాలన్నాడు.
డే అండ్ నైట్ టెస్టులో ఏమైనా మార్పు తీసుకొచ్చి మరింత ఆసక్తికరంగా మార్చడానికి యత్నిస్తే బాగుంటుందన్నాడు. డే అండ్ నైట్ టెస్టు సక్సెస్ అయిన క్రమంలో దానిపై కసరత్తు చేస్తే బాగుంటుందని హితవు పలికాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను ఒక రోజుకు తగ్గించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నాడు. ఇప్పుడు మనం నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుడితే, మరికొన్ని రోజులకు మూడు రోజుల టెస్టు క్రికెట్‌ను ప్రవేశ పెడితే బాగుంటుందనే వాదన కూడా తెరపైకి వస్తుందన్నాడు.
ఇదిలా ఉంచితే, టెస్టు క్రికెట్‌ను నాలుగు రోజులకు మార్చాలనే ప్రతిపాదనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వద్ద ప్రస్తావించగా.. అసలు ఆ ప్రపోజల్ ఏమిటో ముందు చూడాలన్నాడు. ఆ నివేదిక వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాదామని పేర్కొన్నాడు. ముందుగానే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందన్నాడు. ఇక నాలుగు రోజుల టెస్టు క్రికెట్ ప్రతిపాదనను ఆసీస్ దిగ్గజ ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్ సైతం వ్యతిరేకించాడు. ఇది సరైన నిర్ణయం కాదన్నాడు. తానొక సంప్రదాయ క్రికెటర్‌నని, నాలుగు రోజుల టెస్టు క్రికెట్ అనేది సరైనది కాదన్నాడు.ఒకవేళ నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ను ప్రవేశపెడితే దాన్ని ద్వేషిస్తా అని తెలిపాడు. (ఇక్కడ చదవండి: భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment