
బెంగళూరు: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇక్కడ జరుగనున్న నాలుగో వన్డేకు పెను వాన ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం నగరంలో భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ అధికారులు గడిచిన 24 గంటల్లో 54 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని తేల్చారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది. షెడ్యూలు ప్రకారం గురువారం (28న) ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో నాలుగో వన్డే జరుగనుంది.
అయితే వర్షం తెరిపినివ్వగానే స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తామని పిచ్ క్యురేటర్ తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సాయంతో మైదానం ఔట్ ఫీల్డ్‌ను తడిలేకుండా చేయగలమని అన్నారు. చెన్నైలో వర్షం వల్ల తొలి వన్డేను 21 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3–0తో కైవసం చేసుకుంది.