పేస్ పటాస్!
ఉపఖండంలో జరిగిన గత ప్రపంచ కప్‌తో పోలిస్తే ఈసారి బంతికి, బ్యాట్‌కు మధ్య సమానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఏకపక్షంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూల మ్యాచ్‌లే జరగకుండా... బౌలర్లు కూడా తమ సత్తా చాటేందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పిచ్‌లు ఉపకరిస్తాయి. ముఖ్యంగా పేస్ బౌలర్లు తమ పదును ప్రదర్శించేందుకు ఈ వరల్డ్ కప్ సరైన వేదిక. పెర్త్, బ్రిస్బేన్‌లాంటి బౌన్సీ వికెట్లతో పాటు కివీస్‌లో స్వింగ్‌కు అనుకూలించే మైదానాలు సీమర్లకు అనుకూల వాతావరణం సృష్టిస్తాయి.
ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు, వారిపై చెలరేగేం దుకు అన్ని జట్ల ఫాస్ట్ బౌలర్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ జట్టులోని ప్రధాన పేసర్లపై అందిస్తున్న కథనమిది. -సాక్షి క్రీడావిభాగం
మిషెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా)
సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీ, అనుకూల మైదానాలు, కనీసం 150 కిలోమీటర్లు తాకుతున్న వేగం. ఈ ప్రపంచ కప్‌లో మిషెల్ జాన్సన్‌ను ఆపడం సులువు కాకపోవచ్చు.స్ట్రయిక్ బౌలర్ గా ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలడు. అతని వేగమే అతని బలంగా చెప్పవచ్చు. కొంత విశ్రాంతి తర్వాత ముక్కోణపు సిరీస్ ఫైనల్ ఆడిన జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశా డు. అతనిపై ఆసీస్ భారీగా ఆశలు పెట్టుకుంది.
లసిత్ మలింగ (శ్రీలంక)
‘చివరి ఓవర్లలో బౌలర్‌పై ఒత్తిడా! అది ఎలా ఉంటుందో నాకు తెలీదు’ ఈ మాట చెప్పగలిగిన ఒకే ఒక పేసర్ లసిత్ మలింగ. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తమ వైపుతిప్పగలడు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో యార్కర్లతో చెలరేగి బ్యాట్స్‌మన్ పరుగులు చేయకుండా నిరోధించగలడు. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో అతని డెత్ బౌలింగ్ ఏమిటో భారత్ రుచి చూసింది. గత ప్రపంచ కప్ పరాజయాన్ని మరిచే ప్రదర్శన ఇవ్వాలని మలింగ పట్టుదలగా ఉన్నాడు.
కీమర్ రోచ్ (వెస్టిండీస్)
వెస్టిండీస్ ఇప్పుడు ఒక్క అసలు సిసలు పేసర్‌ను తయారు చేయలేకపోతోంది. ఈసారి ప్రపంచ కప్‌లో కీమర్ రోచ్, జెరోమీ టేలర్‌లకే కాస్తో, కూస్తో అనుభవం ఉంది. వీరిలో రోచ్ ఆ జట్టుకు ప్రధాన బౌలింగ్ వనరుగా చెప్పవచ్చు. 27లోపు సగటుతో కెరీర్‌లో 98 వికెట్లు తీసిన రోచ్, ఒకప్పుడు విండీస్ మార్క్ పదునైన వేగానికి చిరునామా. గాయాలతో కాస్త వేగం తగ్గినా ఇప్పటికి అతనే ఆ జట్టు ఫాస్టెస్ట్ బౌలర్‌గా చెప్పవచ్చు.
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్)
వన్డే క్రికెట్‌లో ఎక్కువ అనుభవం ఉన్న అసలైన పేస్ బౌలర్లలో అండర్సన్‌దే అగ్రభాగం. ఇరువైపులా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం గల అతను ఆసీస్ గడ్డపై చెలరేగిపోగలడు. ఇక్కడి వికెట్లు అతని శైలికి అచ్చి వస్తాయి. తన శైలికి సరిపడే బ్రిస్బేన్, పెర్త్ వికెట్లపై అతడిని ఎదుర్కోవడం సులువు కాదు.
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)
25 ఏళ్ల ఈ ఎడంచేతి వాటం పేసర్ ఇటీవల ఒక్కసారిగా న్యూజిలాండ్ జట్టుకు కీలక బౌలర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా కివీస్ పిచ్‌లపై అతను చాలా ప్రమాదకారి. ఏ దశలోనూ 140 కిలో మీటర్ల వేగానికి తగ్గకుండా వైవిధ్యంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇటీవల షేన్ బాండ్ శిక్షణలో మరింత రాటుదేలాడు.
డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
సుదీర్ఘ కాలంగా ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతున్న స్టెయిన్ దక్షిణాఫ్రికాకు అతి పెద్ద బలం. ఆసీస్ పిచ్‌లపై అతడిని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ప్రధాన వికెట్లు తీసి జట్టుకు శుభారంభం ఇవ్వడంలో స్టెయిన్ ఎప్పుడూ ముం దుంటాడు. చివరి ఓవర్లలో కూడా దక్షిణాఫ్రికా అతడిని సమర్థంగా ఉపయోగించుకుంటోంది. పదేళ్ల కెరీర్‌లో వందలోపు మ్యాచ్‌లే ఆడినా... కేవలం 25 సగటుతో 150కి పైగా వికెట్లు తీసిన స్టెయిన్‌కిది రెండో ప్రపంచ కప్. ఈసారైనా టైటిల్ అందుకోవాలని కలలు కంటున్న సఫారీల బౌలింగ్ బృందాన్ని నడిపించాల్సిన బాధ్యత స్టెయిన్‌దే.
మన సంగతేంటి...
భారత జట్టులో ఇప్పుడు నలుగురు ప్రధాన పేస్ బౌలర్లు ఉన్నారు. వీరిలో ఉమేశ్ యాదవ్, మొహమ్మద్ షమీ ప్రధానంగా వేగంపై ఆధారపడే బౌలర్లు కాగా... భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మలు స్వింగ్ బౌలర్లు. మంచి ప్రతిభ ఉన్న బౌలర్లుగా గుర్తింపు ఉన్నా... జాన్సన్, స్టెయిన్‌లాంటి వాళ్లతో పోలిస్తే ఎవరూ ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ మాత్రం కాదు. వీరిలో ఏ ఇద్దరైనా ఖచ్చితంగా ప్రతీ మ్యాచ్‌లో నిలకడగా రాణిస్తేనే మనం ప్రపంచ కప్ ఆశలు ఉంచుకోవాలనేది స్పష్టం. ఇటీవల టెస్టు సిరీస్ ఆడిన ఉమేశ్ నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుండటం ఆశలు రేపే అంశం.
మరోవైపు షమీపై కెప్టెన్ ధోని అమిత విశ్వాసం ఉంచుతున్నా... అతను మాత్రం దానిని నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఏ మాత్రం నియంత్రణలేని బౌలింగ్‌తో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఇక కెరీర్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన భువనేశ్వర్ ఇటీవల పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. పైగా ఫిట్‌నెస్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇషాంత్ స్థానంలో వచ్చిన మోహిత్ కొంత వరకు పొదుపైన బౌలర్‌గా చెప్పవచ్చు. ఓవరాల్‌గా ఇతర ప్రధాన జట్లతో పోలిస్తే భారత్ పేస్ అంత పదునుగా లేదనేది వాస్తవం. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ఫాస్ట్ బౌలర్ మన వద్ద లేకపోవడం లోటు.