టీ20లపై బౌలింగ్ దిగ్గజం ఆందోళన
తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాల్లో డబ్బులు ఆటగాళ్లకు అందడంతో యువ క్రికెటర్లకు ఆటపై ఆసక్తి తగ్గిపోతుందని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి పీసీఏ స్టేడియంతో ట్రైనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్, టీ20 లాంటి లీగ్ ల వల్ల ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు దెబ్బతింటున్నారని పేర్కొన్నాడు. ఇది ఒక్క భారత్కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే అన్ని దేశాలలో ఇలాంటి ధోరణి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశాడు. టెస్టు క్రికెట్ అయితే పేస్ బౌలర్లకు స్వర్గధామమని, తమ సత్తా నిరూపించుకునేందుకు పొట్టి ఫార్మాట్లో ఇలాంటి చాన్స్ ఉండదన్నాడు.
ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత లీగ్స్ ఆడి తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జిస్తున్నందున మరింత రాటుదేలేందుకు బౌలర్లు కృషి చేయడం లేదన్న అంశాన్ని గుర్తించినట్లు చెప్పారు. మంచి క్రికెట్ ఆడి దేశానికి మరింత గౌరవం తీసుకురావాలని యువ క్రికెటర్లకు పిలుపునిచ్చాడు. 'భారత్ త్వరలో నిర్వహించబోయే దులీప్ ట్రోఫీలో పింక్ బాల్ వాడకం మంచి పరిణామమే. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లలో ఫ్లడ్ లైట్స్ వెలుగులలో పింక్ బాల్ వాడకం విజయమంతమైంది' అని మెక్ గ్రాత్ వివరించాడు.