నేను చూసిన గ్రేటెస్ట్ బౌలర్ అతనే: ద్రవిడ్
ముంబై:తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో అత్యంత కఠినమైన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక గ్లెన్ మెక్ గ్రాత్ అని భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. అతను కేవలం ఆస్ట్రేలియన్ గ్రేటెస్ట్ బౌలరే కాదు.. గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ అంటూ ద వాల్ కొనియాడాడు. ఆస్ట్రేలియాతో తాను ఆడిన మ్యాచ్ల్లో సెంచరీలు నమోదు చేసినా, మెక్ గ్రాత్ను ఎదుర్కోవడం కత్తిమీద సాములా ఉండేదన్నాడు.
'నా క్రికెట్ జనరేషనల్లో ఆస్ట్రేలియా అత్యుత్తమ క్రికెట్ జట్టు. అప్పటి జట్టు చాలా బలంగా ఉండేది. ఆ సమయంలోనే ఒక గ్రేటెస్ట్ బౌలర్ నాకు తారస పడ్డాడు. అతనే మెక్ గ్రాత్. అతనొక ఆస్ట్రేలియా గ్రేటెస్ట్ బౌలరే కాదు.. నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో మెక్ గ్రాత్ అసాధారణ నైపుణ్యమున్న బౌలర్ అని ద్రవిడ్ ప్రశంసించాడు. ఏ బౌలర్ కూడా తనకు ఆఫ్ స్టంప్ బంతులను వేసే సాహసం చేయకపోయినా, మెక్ గ్రాత్ మాత్రం ఆఫ్ స్టంప్ బంతులు వేసి బోల్తా కొట్టించేవాడని ద్రవిడ్ గుర్తు చేసుకున్నాడు. అతని చేతికి బంతి ఇచ్చిన మరుక్షణం ఎటువంటి నిర్దయ లేకుండా ప్రత్యర్థి ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించేవాడన్నాడు. అది ఉదయం పూట కానీ, సాయంత్ర వేళ కానీ మెక్ గ్రాత్ రిథమ్లో ఎటువంటి తేడా ఉండేది కాదని ఆనాటి జ్ఞాపకాలను ద్రవిడ్ నెమరువేసుకున్నాడు.