అతనికి కెప్టెన్సీ చేయడం చాలా కష్టం:పాంటింగ్
పెర్త్:ఆస్ట్రేలియా క్రికెట్లో రికీ పాంటింగ్, మెక్ గ్రాత్ల హవా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టుకు అనేక చిరస్మరణీయమైన విజయాలను అందించారు. అదే క్రమంలో టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున పాంటింగ్(13,378) అత్యధిక పరుగులను నమోదు చేస్తే.. మెక్ గ్రాత్(563) అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్గా ఘనత సాధించాడు. మరోవైపు రెండు వరుస వన్డే వరల్డ్ కప్లు పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా సాధిస్తే, వరుస మూడు వరల్డ్ కప్లను సాధించిన జట్టులో మెక్ గ్రాత్ సభ్యుడిగా ఉన్నాడు.
అయితే మెక్ గ్రాత్కు కెప్టెన్సీ చేయడం చాలా కష్టమని అంటున్నాడు రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల తొలి టెస్టు ఆరంభంలో భాగంగా రికీ పలు విషయాలను వెల్లడించాడు. మీ కెప్టెన్సీలో మీరు చూసిన అత్యంత కఠినమైన ఆటగాడు ఎవరు?అన్న దానికి రికీ తనదైన శైలిలో స్పందించాడు. 'మెక్ గ్రాత్కు కెప్టెన్సీ చేయడం చాలా కష్టంగా అనిపించేది. ప్రతీ ఒక్కరూ మెక్ గ్రాత్ ను నడిపించడం చాలా సులువని అనుకుంటారు. అది కొంతవరకూ నిజమే. అతనికి బంతినిచ్చిన మరుక్షణంలో మెక్ గ్రాత్ తన పని సమర్ధవంతంగా నిర్వర్తించేవాడు. అంతవరకూ ఓకే. కాకపోతే కొన్ని సందర్భాల్లో మెక్ గ్రాత్ కు బంతి ఇవ్వన్నప్పుడు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేవి. బంతి ఇవ్వడానికి వేరే క్రికెటర్ ని పిలిచినా, అతన్నే పిలుస్తున్నట్లు భావించేవాడు. అతన్ని ప్రత్యేకంగా సముదాయించాల్సి వచ్చింది. మిత్రమా.. పది నుంచి పది హేను నిమిషాలు విశ్రాంతి తీసుకో అని చెప్పాల్సివచ్చిది. నా నాయకత్వంలో అతనే నాకు ఎదురైన అత్యంత కఠినమైన ఆటగాడు' అని పాంటింగ్ సరదాగా తన పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు.