క్రికెట్ అంటే ఇండియా.. ఇండియా అంటే వరల్డ్ క్లాస్ బ్యాటర్స్, స్పిన్నర్స్.. క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఈ నానుడుతో ఏకీభవించాల్సిందే. ఈ నానుడు ఎంత సత్యమో, మ్యాచ్‌లు గెలవాలంటే బ్యాటర్లు, స్సిన్నర్లు మాత్రమే రాణిస్తే సరిపోదన్నది కూడా అంతే కాదనలేని సత్యం. భారత క్రికెట్ చరిత్రలో బ్యాటర్లు, స్పిన్నర్లు రాణించడం మనం చూశాం. అయితే నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, నిఖార్సైన ఆల్‌రౌండర్లు కనీసం ఓ దశకం పాటు రాణించడం మనమెప్పుడు కనీవినీ ఎరుగం.
80వ దశకంలో కపిల్ దేవ్ (ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్), 90ల్లో జవగల్ శ్రీనాథ్, ఆతర్వాత జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, ఇటీవలి కాలంలో బుమ్రా, షమీ, హార్ధిక్ పాండ్యా (ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్) లాంటి వారు అడపాదడపా మెరుపులు మెరిపించినా.. నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, నిఖార్సైన ఆల్‌రౌండర్లు అన్న ట్యాగ్‌లకు వీరు న్యాయం చేశారంటే సగటు భారత క్రికెట్ అభిమాని మనసు ఒప్పుకోదు.
గతంతో పోలిస్తే, ఇటీవలి కాలంలో దేశవాలీ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల సంఖ్య కాస్త పెరిగినా.. జాతీయ జట్టుకు వచ్చే సరికి వారు వన్ మ్యాచ్ వండర్లుగా మిగిలిపోతున్నారు. బుమ్రా, షమీ, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా మినహాయించి, ఈ మధ్యకాలంలో వచ్చిన ఫాస్ట్ బౌలర్లు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు నిలకడగా రాణించింది లేదు.
ఉమేశ్ యాదవ్, నటరాజన్, అవేశ్ ఖాన్, నవ్‌దీప్ సైనీ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ఫాస్ట్ బౌలర్లు.. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఒక్క మ్యాచ్ ఆడితే రెండో మ్యాచ్‌లో గాయమో లేక తేలిపోవడమో జరుగుతుంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
టీ20 వరల్డ్‌కప్‌లో, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించి, భవిష్యత్ ఆశాకిరణంలా కనిపించిన అర్షదీప్ సింగ్ ఇవాల్టి మ్యాచ్‌లో పూర్తి తేలిపోయాడు. లార్డ్‌గా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా చెప్పుకునే శార్దూల్ ఠాకూర్ అయితే మరీ అధ్వానంగా తయారయ్యాడు. అతను ఆల్‌రౌండర్ పాత్రకు ఎన్నడూ న్యాయం చేసింది లేదు. అయినా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో స్థానం సంపాదిస్తున్నాడు. ఈ కేటగిరికి చెందిన మరో ఆటగాడు దీపక్ చాహర్ విషయానికొస్తే.. అతను ఆడేది తక్కువ, గాయాలపాలై నేషనల్ క్రికెట్ అకాడమీలో గడిపేది ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి వారిని నమ్ముకుని టీమిండియా మేనేజ్‌మెంట్ మెగా టోర్నీల బరిలోకి దిగితే.. ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్‌లలో ఎదురైన పరాభవాలే మున్ముందు పలకరిస్తాయి. భారత దేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నా, వేల సంఖ్యలో ప్రొఫెషనల్ ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్ ఆడుతున్నా.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, నిఖార్సైన ఆల్‌రౌండర్లు కరువయ్యారంటే సగటు భారత క్రికెట్ అభిమాని సిగ్గుతో తల దించుకోవాల్సిందే. పరిస్థితి ఇలా తయారవ్వడానికి కారణాలేంటి.. లోపం ఎక్కడుంది..? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకోకపోతే, సమీప భవిష్యత్తులో వెస్టిండీస్‌కు పట్టిన గతే టీమిండియాకు కూడా పట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment