ఇంకా నేర్చుకుంటున్నారా..! | Dhoni climbs two places in latest ODI rankings | Sakshi
Sakshi News home page

ఇంకా నేర్చుకుంటున్నారా..!

Published Tue, Oct 27 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

ఇంకా నేర్చుకుంటున్నారా..!

ఇంకా నేర్చుకుంటున్నారా..!

చివరి వన్డేలో భారత జట్టు ఓటమికి కారణమేంటి? కెప్టెన్ ధోనికి ఎదురైన సూటి ప్రశ్న ఇది. ‘ఈ ప్రశ్న ఇవాళ మాత్రం అడగొద్దు. వాళ్లు దాదాపు 450 పరుగులు చేశారు. మీరేమో తప్పు ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అన్ని వ్యూహాలూ ప్రయత్నించాం’... సుడి గాలి వేగంతో ధోని ఇచ్చిన జవాబు! ఛలోక్తులు విసరడంలో ముందుండే ధోని, కాస్త హాస్యం జోడించే ప్రయత్నం చేసినా అది అతనిలోని ఒక రకమైన అసహనాన్ని బయట పెట్టింది.

ఒక దశలో ఎవరితో బౌలింగ్ చేయించాలో, ఎక్కడ ఫీల్డర్‌ని పెట్టాలో అర్థం కాని స్థితిలో నిలిచిన కెప్టెన్.... తన బౌలర్లలో ఒక్కరూ నమ్మకాన్ని నిలబెట్టలేని సమయంలో పూర్తిగా చేతులెత్తేశాడు.
 
ఈ పేసర్లతోనా...
మన దగ్గర ఉన్నది ఫాస్ట్ బౌలర్లు కాదు, మీడియం పేసర్లేననేది జగమెరిగిన సత్యం. కానీ 135 కిలోమీటర్ల వేగం దాటని తమ బౌలింగ్‌తో భువీ, మోహిత్ విపరీతంగా షార్ట్ పిచ్ బంతులు విసిరిన వ్యూహం బెడిసికొట్టింది. దాంతో ఈ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న సఫారీ బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు.  కనీసం 145 కిలోమీటర్ల వేగంతో వేస్తే కానీ ముంబైలాంటి వికెట్‌పై బౌన్స్ రాబట్టడం కష్టం.

మన బలహీనతను గుర్తించి ధోని... లైన్ అండ్ లెంగ్త్‌కే కట్టుబడే విధంగా మరో వ్యూహాన్ని ఎంచుకోవాల్సింది. కానీ అతను దానిని అమలు చేయలేకపోయాడు. ‘మనం ఎంతో మంది పేసర్లను పరీక్షించాం. ఉన్నంతలో వీరే మెరుగు. దేశవాళీలోబాగా ఆడి వచ్చినవారు అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారు’ అని ధోని చెప్పడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
 
ఆల్‌రౌండర్ లేడు
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం భారత్‌లో బిన్నీ, అక్షర్, జడేజా మాత్రమే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలిగే బౌలింగ్ ఆల్‌రౌండర్లు అని ధోని వ్యాఖ్యానించడం అర్థం లేనిది. వన్డేల కోసమంటూ జట్టులోకి తీసుకున్న గుర్‌కీరత్ సింగ్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇలాంటి వ్యాఖ్య చేయడం అతని స్థాయికి తగింది కాదు. ఫలితాలు ముఖ్యం కాదని ప్రక్రియ మాత్రమే ప్రధానమని తాను ఎప్పుడూ చెప్పే డైలాగే మరో సారి ఉచ్ఛరించిన ధోని... బ్యాటింగ్ ఆర్డర్‌ను అడ్డగోలుగా మార్చడం మినహా తాను కొత్తగా చేసిన ప్రయోగం ఏమీ ఈ సిరీస్‌లో కనిపించలేదు.
 
ఇది సరిపోదా...
గత నాలుగేళ్లుగా వన్డేల్లో వరుస విజయాలు... ఇటీవల ప్రపంచకప్‌లోనూ మెరుగైన ప్రదర్శన... ఆటగాళ్లందరికీ కావాల్సినంత అనుభవం. అయితే భారత కెప్టెన్ ధోని మాత్రం జట్టు ఇంకా ‘కుదురుకునే’ దశలోనే ఉందంటున్నాడు. జట్టులో అందరికంటే జూనియర్ అయిన అక్షర్ పటేల్ కూడా ఇప్పటికే 22 వన్డేలు ఆడేశాడు. వరల్డ్ కప్ వరకు బాగా ఆడిన జట్టు ఒక్కసారిగా బంగ్లాదేశ్‌లో, ఆ తర్వాత స్వదేశంలో ఇలా భంగపడటం అందరినీ నిరాశపర్చింది.

పిచ్ బాగా లేదనో, స్పిన్నర్లకు అనుకూలించలేదనో చెప్పుకోవడం అర్థం లేనిది. ‘దీన్ని చెత్త ప్రదర్శన అనే మాట కూడా తక్కువే. అంతకంటే పెద్ద పదం ఏదైనా కావాలి’ అని ధోని స్వయంగా అంగీకరించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. వచ్చే జనవరిలో భారత జట్టు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లే వరకు ధోని సీన్‌లో ఉండకపోవచ్చు. కానీ అతనికి తగినంత సమయం ఉంది. అన్ని స్థానాల్లో సరిపోయే ఆటగాళ్లను సిద్ధం చేయాల్సి ఉందంటూ స్వయంగా తానే చెప్పిన మహి... అలాంటి ప్రణాళికలతో ఏమైనా ముందుకొస్తేనే ఇకపై ఇలాంటి పరాభవాలకు బ్రేక్ పడుతుంది.  సాక్షి క్రీడావిభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement