last one day
-
24 గంటల్లో ఒక్కరు కూడా మరణించలేదు..
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా సంభవించలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత వారం రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, త్రిపుర, దాదర్ మరియు నాగర్ హవేలీ, నాగాలాండ్, మిజోరం, లక్ష్య ద్వీప్‌లలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఆ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోందని, గడిచిన ఐదు వారాల్లో రోజు వారీ మరణాలు 55 శాతం మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం శుభసూచకమని, గడిచిన 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం ఆనందదాయకమని నీతి ఆయోగ్ అధికారి వీకే పాల్ అన్నారు. -
ఎవరి గాలి వీస్తుందో!
దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ నెగ్గేందుకు అతి చేరువగా వచ్చిన భారత్ గత మ్యాచ్‌లో ఆ అవకాశాన్ని కోల్పోయింది. వర్షం కారణంగా లక్ష్యం తగ్గిపోవడం, మరి కాస్త అదృష్టం కూడా కలిసొచ్చి సఫారీ జట్టు నాలుగో వన్డేలో గట్టెక్కింది. అయితే టీమిండియా ఇంకా సిరీస్ ఫలితాన్ని శాసించే స్థితిలోనే ఉంది. తొలి మూడు వన్డేల్లో చూపిన ఫామ్‌ను మరోసారి ప్రదర్శిస్తే ఈసారి గెలుపు అసాధ్యం కాబోదు. మరోవైపు వరుస పరాజయాలకు వాండరర్స్‌లో అడ్డుకట్ట వేయడంలో సఫలమైన సఫారీ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ మరో మ్యాచ్‌కు ముందే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా లేక దక్షిణాఫ్రికా ఫలితాన్ని చివరి మ్యాచ్ వరకు తీసుకెళుతుందా అనేది చూడాలి. పోర్ట్ ఎలిజబెత్: టెస్టు సిరీస్‌లో పరాజయం తర్వాత వన్డే సిరీస్‌ను ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ ఆ దిశగా మరొక్క విజయాన్ని ఆశిస్తోంది. తమ జోరుకు నాలుగో వన్డేలో బ్రేక్ పడినా అది తాత్కాలికమేనని, సిరీస్ గెలవగల సత్తా తమలో ఉందని నిరూపించేందుకు కోహ్లి సేన సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు ఇక్కడి సెయింట్ జార్జెస్ పార్క్‌లో ఐదో వన్డే జరగనుంది. ప్రస్తుతం 3–1తో ముందంజలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతం కావడంతో పాటు నంబర్‌వన్ ర్యాంక్ కూడా సుస్థిరమవుతుంది. సొంతగడ్డపై సిరీస్ కాపాడుకునే ప్రయత్నంలో గత మ్యాచ్‌లో రాణించిన సఫారీ జట్టు అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. కేదార్ జాదవ్ ఉంటాడా! జొహన్నెస్‌బర్గ్ వన్డేలో భారత్‌కు ప్రతికూల ఫలితం రావడంతో పాటు కొన్ని అంశాలు కొత్త పాఠాన్ని నేర్పాయి. తొలి మూడు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన ఇద్దరు లెగ్ స్పిన్నర్లపైనే కోహ్లి అమితంగా ఆధారపడటం సరైంది కాదని తేలింది. డెత్ బౌలింగ్‌లో భువనేశ్వర్, బుమ్రాలను సరైన విధంగా వాడుకోవాలని కూడా అర్థమైంది. ఈ నేపథ్యంలో భారత్ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో జాదవ్ ఉండి ఉంటే ‘లో ఆర్మ్’ బౌలింగ్ జట్టుకు ఉపయోగపడేదేమో. అతను అనారోగ్యం నుంచి కోలుకుంటే తుది జట్టులోకి రావచ్చు. పైగా స్పిన్‌కు పిచ్ అనుకూలంగా ఉంది కాబట్టి అది బలంగా మారవచ్చు కూడా. మరోవైపు దైవాధీనంలా ఉన్న రోహిత్ శర్మ బ్యాటింగ్ మెరుగుపడాలని జట్టు కోరుకుంటోంది. అదే విధంగా నాలుగో స్థానంలో పాతుకుపోయే అవకాశం దక్కినా రహానే ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండటం నిరాశ కలిగించే అంశం. తొలి వన్డేలో అర్ధ సెంచరీ తర్వాత అతను రెండు సార్లు పేలవంగా 11, 8 పరుగులకే వెనుదిరిగాడు. రహానే స్థానంలో మనీశ్ పాండేను ప్రయత్నించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రాక్టీస్ సెషన్‌ను బట్టి చూస్తే ఇద్దరు స్పిన్నర్లలో ఒకరి స్థానంలో లేదా పాండ్యాకు బదులుగా అక్షర్ పటేల్‌ను ఎంచుకోవచ్చని కూడా ఒక అంచనా. అయితే బౌలింగ్ మార్పులు ఎలా ఉన్నా మరోసారి మన బలమైన బ్యాటింగ్‌పైనే భారమంతా ఉంది. ముఖ్యంగా కోహ్లి, ధావన్ సూపర్ ఫామ్ మరోసారి జట్టుకు భారీ స్కోరు అందిస్తే ఇక తిరుగుండదు. చివరి వన్డే దాకా ఒత్తిడి పెంచుకోకుండా ఉండాలంటే సిరీస్‌ను ఇక్కడే ముగించాల్సి ఉంది. ఈసారి హీరో ఎవరు? దక్షిణాఫ్రికా ఎట్టకేలకు విజయాన్ని అందుకున్న నాలుగో వన్డేలో ఓవరాల్‌గా చూస్తే అందరూ తలా ఓ చేయి వేసి జట్టును గెలిపించారు. ఆమ్లా, డివిలియర్స్, మిల్లర్ చేసినవీ భారీ స్కోర్లేమీ కావు. అదే విధంగా చివర్లో టి20 తరహాలో ఆడటం వల్ల క్లాసెన్, ఫెలుక్వాయో కొన్ని మెరుపులు మెరిపించగలిగారు. ఇది చాలు దక్షిణాఫ్రికా జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసేందుకు. మూడు మ్యాచ్‌ల వరకు కనీసం స్పిన్ బంతిని కూడా అర్థం చేసుకోలేని స్థితినుంచి ఎదురుదాడితో మ్యాచ్ గెలవవచ్చని వారు నిరూపించగలిగారు. ఇదే ఆటను మళ్లీ చూపిస్తే సఫారీల పని సులువవుతుంది. బౌలింగ్‌లో రబడ ముందుండి నడిపిస్తున్నాడు. అతడిని ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు. అయితే మరో ఇద్దరు పేసర్లు మోర్కెల్, ఇన్గిడిలలో ఒకరు ఈ సారి పెవిలియన్‌కే పరిమితం కావచ్చు. గత మ్యాచ్‌కు దూరమైన తాహిర్ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. నాలుగో వన్డేలో కేవలం డుమిని పార్ట్‌టైమ్ స్పిన్నే దక్షిణాఫ్రికా నమ్ముకొని బరిలోకి దిగింది. కానీ ఇక్కడి పిచ్‌పై ఆ జట్టుకు ప్రధాన స్పిన్నర్ అవసరం ఉంది. మొత్తంగా డివిలియర్స్ రావడమే ఆ జట్టులో కొత్త స్ఫూర్తి నింపినట్లుంది. అయితే ఈ మైదానంలో సఫారీల రికార్డూ గొప్పగా లేకపోవడం ప్రతికూలాంశం. 32 మ్యాచ్‌లలో 11 ఓడిన ఆ జట్టు... గత పది మ్యాచ్‌లలో ఆరు ఓడింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, జాదవ్/అయ్యర్, పాండ్యా, ధోని, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, మిల్లర్, క్లాసెన్, ఫెలుక్వాయో, మోరిస్, రబడ, మోర్కెల్, ఇన్‌గిడి/తాహిర్. దక్షిణాఫ్రికాలో భారత్‌కు పేలవ రికార్డు ఉన్న మైదానాల్లో ఇక్కడి సెయింట్ జార్జెస్ పార్క్ ఒకటి. 1992 నుంచి ఈ స్టేడియంలో ఐదు వన్డేలు ఆడిన భారత్ అన్నీ ఓడిపోయింది. నాలుగు సార్లు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలు కాగా, ఒకసారి కెన్యా చేతిలోనూ ఓడింది. పైగా టీమ్ అత్యధిక స్కోరు కూడా 176 మాత్రమే. ‘విండీ సిటీ’గా పేరున్న పోర్ట్ ఎలిజబెత్‌లో విపరీతమైన వేగంతో గాలులు వీస్తాయి. దానిని దృష్టిలో ఉంచుకొని కూడా తుది జట్టును ఎంపిక చేస్తామని భారత్ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించారు. పిచ్, వాతావరణం దక్షిణాఫ్రికాలోని నెమ్మదైన పిచ్‌లలో ఇది ఒకటి. అయితే ఆరంభంలో మంచి బ్యాటింగ్ వికెట్. ఆపై స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. మ్యాచ్ సమయంలో వర్ష సూచన ఉంది. -
ఇంకా నేర్చుకుంటున్నారా..!
చివరి వన్డేలో భారత జట్టు ఓటమికి కారణమేంటి? కెప్టెన్ ధోనికి ఎదురైన సూటి ప్రశ్న ఇది. ‘ఈ ప్రశ్న ఇవాళ మాత్రం అడగొద్దు. వాళ్లు దాదాపు 450 పరుగులు చేశారు. మీరేమో తప్పు ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అన్ని వ్యూహాలూ ప్రయత్నించాం’... సుడి గాలి వేగంతో ధోని ఇచ్చిన జవాబు! ఛలోక్తులు విసరడంలో ముందుండే ధోని, కాస్త హాస్యం జోడించే ప్రయత్నం చేసినా అది అతనిలోని ఒక రకమైన అసహనాన్ని బయట పెట్టింది. ఒక దశలో ఎవరితో బౌలింగ్ చేయించాలో, ఎక్కడ ఫీల్డర్ని పెట్టాలో అర్థం కాని స్థితిలో నిలిచిన కెప్టెన్.... తన బౌలర్లలో ఒక్కరూ నమ్మకాన్ని నిలబెట్టలేని సమయంలో పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ పేసర్లతోనా... మన దగ్గర ఉన్నది ఫాస్ట్ బౌలర్లు కాదు, మీడియం పేసర్లేననేది జగమెరిగిన సత్యం. కానీ 135 కిలోమీటర్ల వేగం దాటని తమ బౌలింగ్‌తో భువీ, మోహిత్ విపరీతంగా షార్ట్ పిచ్ బంతులు విసిరిన వ్యూహం బెడిసికొట్టింది. దాంతో ఈ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న సఫారీ బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు. కనీసం 145 కిలోమీటర్ల వేగంతో వేస్తే కానీ ముంబైలాంటి వికెట్‌పై బౌన్స్ రాబట్టడం కష్టం. మన బలహీనతను గుర్తించి ధోని... లైన్ అండ్ లెంగ్త్‌కే కట్టుబడే విధంగా మరో వ్యూహాన్ని ఎంచుకోవాల్సింది. కానీ అతను దానిని అమలు చేయలేకపోయాడు. ‘మనం ఎంతో మంది పేసర్లను పరీక్షించాం. ఉన్నంతలో వీరే మెరుగు. దేశవాళీలోబాగా ఆడి వచ్చినవారు అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారు’ అని ధోని చెప్పడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఆల్‌రౌండర్ లేడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం భారత్‌లో బిన్నీ, అక్షర్, జడేజా మాత్రమే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలిగే బౌలింగ్ ఆల్‌రౌండర్లు అని ధోని వ్యాఖ్యానించడం అర్థం లేనిది. వన్డేల కోసమంటూ జట్టులోకి తీసుకున్న గుర్కీరత్ సింగ్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇలాంటి వ్యాఖ్య చేయడం అతని స్థాయికి తగింది కాదు. ఫలితాలు ముఖ్యం కాదని ప్రక్రియ మాత్రమే ప్రధానమని తాను ఎప్పుడూ చెప్పే డైలాగే మరో సారి ఉచ్ఛరించిన ధోని... బ్యాటింగ్ ఆర్డర్‌ను అడ్డగోలుగా మార్చడం మినహా తాను కొత్తగా చేసిన ప్రయోగం ఏమీ ఈ సిరీస్‌లో కనిపించలేదు. ఇది సరిపోదా... గత నాలుగేళ్లుగా వన్డేల్లో వరుస విజయాలు... ఇటీవల ప్రపంచకప్‌లోనూ మెరుగైన ప్రదర్శన... ఆటగాళ్లందరికీ కావాల్సినంత అనుభవం. అయితే భారత కెప్టెన్ ధోని మాత్రం జట్టు ఇంకా ‘కుదురుకునే’ దశలోనే ఉందంటున్నాడు. జట్టులో అందరికంటే జూనియర్ అయిన అక్షర్ పటేల్ కూడా ఇప్పటికే 22 వన్డేలు ఆడేశాడు. వరల్డ్ కప్ వరకు బాగా ఆడిన జట్టు ఒక్కసారిగా బంగ్లాదేశ్‌లో, ఆ తర్వాత స్వదేశంలో ఇలా భంగపడటం అందరినీ నిరాశపర్చింది. పిచ్ బాగా లేదనో, స్పిన్నర్లకు అనుకూలించలేదనో చెప్పుకోవడం అర్థం లేనిది. ‘దీన్ని చెత్త ప్రదర్శన అనే మాట కూడా తక్కువే. అంతకంటే పెద్ద పదం ఏదైనా కావాలి’ అని ధోని స్వయంగా అంగీకరించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. వచ్చే జనవరిలో భారత జట్టు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లే వరకు ధోని సీన్లో ఉండకపోవచ్చు. కానీ అతనికి తగినంత సమయం ఉంది. అన్ని స్థానాల్లో సరిపోయే ఆటగాళ్లను సిద్ధం చేయాల్సి ఉందంటూ స్వయంగా తానే చెప్పిన మహి... అలాంటి ప్రణాళికలతో ఏమైనా ముందుకొస్తేనే ఇకపై ఇలాంటి పరాభవాలకు బ్రేక్ పడుతుంది. సాక్షి క్రీడావిభాగం -
ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా: బెంగళూరు వన్డేకు భారీ భద్రత
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం బెంగళూరులో జరుగుతున్న చిట్టచివరి మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ సందర్భంగా కమాండోలు సహా 1200 మంది పోలీసు బలగాలను మోహరించామని, స్టేడియం చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నామని బెంగళూరు అదనపు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. అలాగే, వాహనాల రాకపోకలను నియంత్రించడానికి కూడా 600 మంది కానిస్టేబుళ్లను నియమించారు. కేవలం పోలీసు సిబ్బందినే కాక, కుట్రలు ఛేదించే ప్రత్యేక నిపుణులను, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ మోహరించామని పంత్ చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేడియానికి ఒక కిలోమీటరు పరిధిలోపు ఎక్కడా వాహనాలను పార్కింగ్ చేయకుండా నిషేధించామన్నారు. ముఖ్యమైన పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, క్యారీ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలు స్టేడియంలోకి తేవడానికి అనుమతించబోమని పంత్ చెప్పారు.