ఎవరి గాలి వీస్తుందో! | Wristspin in focus again as South Africa return to green | Sakshi
Sakshi News home page

ఎవరి గాలి వీస్తుందో!

Feb 13 2018 3:37 AM | Updated on Feb 13 2018 9:08 AM

Wristspin in focus again as South Africa return to green - Sakshi

కోహ్లి

దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ నెగ్గేందుకు అతి చేరువగా వచ్చిన భారత్‌ గత మ్యాచ్‌లో ఆ అవకాశాన్ని కోల్పోయింది. వర్షం కారణంగా లక్ష్యం తగ్గిపోవడం, మరి కాస్త అదృష్టం కూడా కలిసొచ్చి సఫారీ జట్టు నాలుగో వన్డేలో గట్టెక్కింది. అయితే టీమిండియా ఇంకా సిరీస్‌ ఫలితాన్ని శాసించే స్థితిలోనే ఉంది. తొలి మూడు వన్డేల్లో చూపిన ఫామ్‌ను మరోసారి ప్రదర్శిస్తే ఈసారి గెలుపు అసాధ్యం కాబోదు. మరోవైపు వరుస పరాజయాలకు వాండరర్స్‌లో అడ్డుకట్ట వేయడంలో సఫలమైన సఫారీ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌   మరో మ్యాచ్‌కు ముందే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా లేక  దక్షిణాఫ్రికా ఫలితాన్ని చివరి మ్యాచ్‌ వరకు తీసుకెళుతుందా అనేది చూడాలి.

పోర్ట్‌ ఎలిజబెత్‌: టెస్టు సిరీస్‌లో పరాజయం తర్వాత వన్డే సిరీస్‌ను ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్‌ ఆ దిశగా మరొక్క విజయాన్ని ఆశిస్తోంది. తమ జోరుకు నాలుగో వన్డేలో బ్రేక్‌ పడినా అది తాత్కాలికమేనని, సిరీస్‌ గెలవగల సత్తా తమలో ఉందని నిరూపించేందుకు కోహ్లి సేన సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు ఇక్కడి సెయింట్‌ జార్జెస్‌ పార్క్‌లో ఐదో వన్డే జరగనుంది. ప్రస్తుతం 3–1తో ముందంజలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ సొంతం కావడంతో పాటు నంబర్‌వన్‌ ర్యాంక్‌ కూడా సుస్థిరమవుతుంది. సొంతగడ్డపై సిరీస్‌ కాపాడుకునే ప్రయత్నంలో గత మ్యాచ్‌లో రాణించిన సఫారీ జట్టు అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది.  

కేదార్‌ జాదవ్‌ ఉంటాడా!
జొహన్నెస్‌బర్గ్‌ వన్డేలో భారత్‌కు ప్రతికూల ఫలితం రావడంతో పాటు కొన్ని అంశాలు కొత్త పాఠాన్ని నేర్పాయి. తొలి మూడు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లపైనే కోహ్లి అమితంగా ఆధారపడటం సరైంది కాదని తేలింది. డెత్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్, బుమ్రాలను సరైన విధంగా వాడుకోవాలని కూడా అర్థమైంది. ఈ నేపథ్యంలో భారత్‌ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో జాదవ్‌ ఉండి ఉంటే ‘లో ఆర్మ్‌’ బౌలింగ్‌ జట్టుకు ఉపయోగపడేదేమో. అతను అనారోగ్యం నుంచి కోలుకుంటే తుది జట్టులోకి రావచ్చు. పైగా స్పిన్‌కు పిచ్‌ అనుకూలంగా ఉంది కాబట్టి అది బలంగా మారవచ్చు కూడా.

మరోవైపు దైవాధీనంలా ఉన్న రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ మెరుగుపడాలని జట్టు కోరుకుంటోంది. అదే విధంగా నాలుగో స్థానంలో పాతుకుపోయే అవకాశం దక్కినా రహానే ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండటం నిరాశ కలిగించే అంశం. తొలి వన్డేలో అర్ధ సెంచరీ తర్వాత అతను రెండు సార్లు పేలవంగా 11, 8 పరుగులకే వెనుదిరిగాడు. రహానే స్థానంలో మనీశ్‌ పాండేను ప్రయత్నించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రాక్టీస్‌ సెషన్‌ను బట్టి చూస్తే ఇద్దరు స్పిన్నర్లలో ఒకరి స్థానంలో లేదా పాండ్యాకు బదులుగా అక్షర్‌ పటేల్‌ను ఎంచుకోవచ్చని కూడా ఒక అంచనా. అయితే బౌలింగ్‌ మార్పులు ఎలా ఉన్నా మరోసారి మన బలమైన బ్యాటింగ్‌పైనే భారమంతా ఉంది. ముఖ్యంగా కోహ్లి, ధావన్‌ సూపర్‌ ఫామ్‌ మరోసారి జట్టుకు భారీ స్కోరు అందిస్తే ఇక తిరుగుండదు. చివరి వన్డే దాకా ఒత్తిడి పెంచుకోకుండా ఉండాలంటే సిరీస్‌ను ఇక్కడే ముగించాల్సి ఉంది.  

ఈసారి హీరో ఎవరు?
దక్షిణాఫ్రికా ఎట్టకేలకు విజయాన్ని అందుకున్న నాలుగో వన్డేలో ఓవరాల్‌గా చూస్తే అందరూ తలా ఓ చేయి వేసి జట్టును గెలిపించారు. ఆమ్లా, డివిలియర్స్, మిల్లర్‌ చేసినవీ భారీ స్కోర్లేమీ కావు. అదే విధంగా చివర్లో టి20 తరహాలో ఆడటం వల్ల క్లాసెన్, ఫెలుక్‌వాయో కొన్ని మెరుపులు మెరిపించగలిగారు.  ఇది చాలు దక్షిణాఫ్రికా జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసేందుకు. మూడు మ్యాచ్‌ల వరకు కనీసం స్పిన్‌ బంతిని కూడా అర్థం చేసుకోలేని స్థితినుంచి ఎదురుదాడితో మ్యాచ్‌ గెలవవచ్చని వారు నిరూపించగలిగారు. ఇదే ఆటను మళ్లీ చూపిస్తే సఫారీల పని సులువవుతుంది.

బౌలింగ్‌లో రబడ ముందుండి నడిపిస్తున్నాడు. అతడిని ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడుతున్నారు. అయితే మరో ఇద్దరు పేసర్లు మోర్కెల్, ఇన్‌గిడిలలో ఒకరు ఈ సారి పెవిలియన్‌కే పరిమితం కావచ్చు. గత మ్యాచ్‌కు దూరమైన తాహిర్‌ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. నాలుగో వన్డేలో కేవలం డుమిని పార్ట్‌టైమ్‌ స్పిన్‌నే దక్షిణాఫ్రికా నమ్ముకొని బరిలోకి దిగింది. కానీ ఇక్కడి పిచ్‌పై ఆ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌ అవసరం ఉంది. మొత్తంగా డివిలియర్స్‌ రావడమే ఆ జట్టులో కొత్త స్ఫూర్తి నింపినట్లుంది. అయితే ఈ మైదానంలో సఫారీల రికార్డూ గొప్పగా లేకపోవడం ప్రతికూలాంశం. 32 మ్యాచ్‌లలో 11 ఓడిన ఆ జట్టు... గత పది మ్యాచ్‌లలో ఆరు ఓడింది.  

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రహానే, జాదవ్‌/అయ్యర్, పాండ్యా, ధోని, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్‌.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, మిల్లర్, క్లాసెన్, ఫెలుక్‌వాయో, మోరిస్, రబడ, మోర్కెల్, ఇన్‌గిడి/తాహిర్‌.

దక్షిణాఫ్రికాలో భారత్‌కు పేలవ రికార్డు ఉన్న మైదానాల్లో ఇక్కడి సెయింట్‌ జార్జెస్‌ పార్క్‌ ఒకటి. 1992 నుంచి ఈ స్టేడియంలో ఐదు వన్డేలు ఆడిన భారత్‌ అన్నీ ఓడిపోయింది. నాలుగు సార్లు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలు కాగా, ఒకసారి కెన్యా చేతిలోనూ ఓడింది. పైగా టీమ్‌ అత్యధిక స్కోరు కూడా 176 మాత్రమే. ‘విండీ సిటీ’గా పేరున్న పోర్ట్‌ ఎలిజబెత్‌లో విపరీతమైన వేగంతో గాలులు వీస్తాయి. దానిని దృష్టిలో ఉంచుకొని కూడా తుది జట్టును ఎంపిక చేస్తామని భారత్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ వెల్లడించారు.  

పిచ్, వాతావరణం
దక్షిణాఫ్రికాలోని నెమ్మదైన పిచ్‌లలో ఇది ఒకటి. అయితే ఆరంభంలో మంచి బ్యాటింగ్‌ వికెట్‌. ఆపై స్పిన్నర్లు  ప్రభావం చూపించగలరు. మ్యాచ్‌ సమయంలో వర్ష సూచన ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement