
చాలా ఆనందంగా ఉంది: ఏ ఆర్ రెహ్మాన్
కోల్ కతా: ఫుట్‌బాల్ దిగ్గజం పీలేను సోమవారం రాత్రి కలవనుండటంపై మ్యూజిక్ లెజెండ్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ ఉద్వేగానికి లోనవుతున్నాడు. ఈ మేరకు 'జయ హో'అంటూ ట్వీట్ చేసిన రెహ్మాన్.. ఒక దిగ్గజ ఆటగాడ్ని కలుస్తుండం పట్ల సరికొత్త అనుభూతికి లోనవుతున్నట్లు పేర్కొన్నాడు. పీలేను కలుస్తుండటంపై చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే పీలే జీవిత చరిత్రపై మ్యూజిక్ ఆల్బమ్ ను ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేశాడు. ఈరోజు రాత్రి నేతాజీ ఇండోర్ స్టేడియంలో పీలేను రెహ్మాన్ కలిసే కార్యక్రమానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా హాజరు కానున్నారు.
38 ఏళ్ల అనంతరం ఆదివారం ఉదయం కోల్ కతా నగరానికి పీలే వచ్చిన సంగతి తెలిసిందే. 1977లో మోహన్ బగాన్‌తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడేందుకు తొలిసారి కోల్‌కతాకు వచ్చిన పీలే.. ఆ తరువాత నగరానికి రావడం ఇదే ప్రథమం.