వెయిటర్ సలహాతోనే మెరుగుపడ్డా: సచిన్
న్యూఢిల్లీ:ప్రపంచ దిగ్గజ క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ను శాసించిన సచిన్ ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. తన క్రికెట్ ప్రస్థానంలో చిరస్మణీయమైన రికార్డులతో తనదైన ముద్ర వేశాడు. వంద అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ గుర్తింపు పొందాడు. అయితే తన ఆట తీరు మెరుగుపడ్డానికి ఒక వెయిటర్ ఇచ్చిన సలహానే ప్రధాన కారణమని సచిన్ తాజాగా తెలిపాడు..
' ఒకానొక సమయంలో చెన్నైలో నా వద్దకు వచ్చిన ఒక వెయిటర్ సలహా ఇచ్చాడు. నా ఎల్బో గార్డ్ను మార్చుకుంటే మీ బ్యాటింగ్ మెరుగుపడుతుందని అతను సూచించాడు. అతను చెప్పింది వంద శాతం నిజం. నేను తీసుకునే ఎల్బోగార్డ్ తో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది. ఆ విషయం నాకు చాలాసార్లు అనిపించింది కూడా.అయితే సదరు వెయిటర్ సలహా చెప్పిన పిదప నా ఎల్బోగార్డ్లో మార్పులు చేసుకున్నాను. ఆ సలహాతోనే నా బ్యాటింగ్ మరింత మెరుగపడింది'అని సచిన్ తెలిపాడు. మనకు ఎవ్వరూ సలహా చెప్పినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నాడు. మంచి సలహా అనేది ఆ వ్యక్తి హోదాను బట్టి ఉండదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని సచిన్ పేర్కొన్నాడు. మన దేశంలో పాన్వాలా దగ్గర్నుంచి కంపెనీ సీఈవో వరకూ అంతా సలహాలు ఇస్తారని, వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నాడు.