ఆ క్రెడిట్ టీమిండియాదే: ఏబీ
టీమిండియా - దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం ఇండోర్లో జరిగిన వన్డే మ్యాచ్ చివరి ఓవర్లు చూసిన వాళ్లెవరూ ఆ గేమ్ను మర్చిపోలేరు. ఒక బ్యాట్స్మన్ విధ్వంసం సృష్టిస్తుంటే.. కాసేపటికల్లా ఓ బౌలర్ రెచ్చిపోయి వికెట్లు తీస్తాడు. మళ్లీ కాసేపటికే రబడా లాంటి టెయిలెండర్లు కూడా బౌండరీలు బాదేస్తుంటారు. అంతలోనే మళ్లీ భువనేశ్వర్ కుమార్ జూలు విదిల్చి టపటపా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతే, మ్యాచ్ టీమిండియా వశమైపోయింది. కళ్లెదుటే కనపడుతున్న ఈ అద్భుతం చూసి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివీలియర్స్ నోట మాట రాలేదు. తమ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ని ఇండియా లాగేసుకుందని, వాళ్లు అద్భుతంగా ఆడటంతో పాటు తమవాళ్ల బ్యాటింగ్ కూడా ఏమాత్రం కుదురుగా లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, కేవలం 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదికూడా సారథి ధోనీ 92 పరుగులు చేసి నాటౌట్గా మిగలడం వల్లే.
ఈ క్రెడిట్ చాలావరకు ఇండియాకే దక్కాలని మ్యాచ్ తర్వాత ఏబీ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి తమ ఎదుట ఉన్న లక్ష్యం చిన్నదేనని, అయితే ఓపెనింగ్ భాగస్వామ్యం బాగున్నా దాన్ని నిలబెట్టుకోవడం తమవాళ్లకు చేతకాలేదని ఒప్పుకొన్నాడు. ఛేజింగ్ చేసేటప్పుడు కాస్త పాజిటివ్గా ఉండాలని, కానీ తాము మాత్రం అలా ఉండలేకపోయామని చెప్పాడు. తమ బౌలర్లు చాలా బాగా పెర్ఫామ్ చేయడం వల్లే టీమిండియాను కట్టడి చేయగలిగామని, అయితే బ్యాట్స్మన్ వైఫల్యం విజయాన్ని తమకు అందకుండా చేసిందని అన్నాడు. ఇక తన వెన్నెముక గాయం పెద్దదేమీ కాదని, తదుపరి మ్యాచ్ నాటికి పూర్తి సిద్ధంగా ఉంటానని తెలిపాడు.