
మూడోరోజు పూర్తిగా నిరాశ
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు పూర్తిగా నిరాశే ఎదురైంది. ఆర్చరీ, ట్రాప్ షూటింగ్‌లో కనీస పోరాటం లేకుండానే భారత క్రీడాకారులు చెతులెత్తేయగా.. హాకీలో పోరాడినా ఓటమి తప్పలేదు.
హాకీ: ఆఖరి క్షణాల్లో వదిలేశారు
భారత్, జర్మనీ మధ్య జరిగిన ఒలింపిక్స్ పురుషుల గ్రూప్-బి హాకీ మ్యాచ్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. మ్యాచ్ చివర్లో భారత్ చేసిన తప్పిదంతో జర్మనీ 2-1తో గెలుపొందింది. ఆట ప్రారంభం నుంచి బలమైన డిఫెన్స్‌తో భారత్ జట్టు జర్మనీని అడ్డుకున్నా.. కీలక సమయాల్లో అవకాశాలను గోల్స్‌గా మార్చటంలో విఫలమైంది. 11వ నిమిషంలో గోల్ అవకాశం వచ్చినా ఆకాశ్‌దీప్ సింగ్ గురి తప్పింది. 18వ నిమిషంలో నిక్లాస్ గోల్‌తో జర్మనీ ఆధిక్యం సాధించగా... 23 నిమిషంలో రూపీందర్‌పాల్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. జర్మన్ గోల్ కీపర్ జాకోబీ అద్భుత ప్రతిభతో భారత్‌కు వచ్చిన నాలుగు అవకాశాలను అడ్డుకున్నాడు. అయితే మరో మూడు సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా... జర్మనీకి క్రిస్టోఫర్ రూర్ గోల్ అందించి జట్టును గెలిపించాడు.
షూటింగ్: ట్రాప్‌లో మరో‘సారీ’
పురుషుల ట్రాప్ ఈవెంట్లో వరుసగా భారత షూటర్లు క్వాలిఫయింగ్‌లోనే విఫలమయ్యారు. మానవ్‌జీత్ సింగ్ సంధూ, కైనాన్ షెనాయ్ మరోసారి దారుణంగా విఫలమై వరుసగా 16, 19 స్థానాల్లో నిలిచారు.
ఆర్చరీ: లక్ష్మీరాణికి నిరాశ
ఆర్చరీ విభాగంలో మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల వ్యక్తిగత ఈవెంట్ ఎలిమినేషన్‌లో భారత ఆర్చర్ మాఝీ లక్ష్మీరాణి కనీస ప్రతిఘటన కూడా లేకుండానే ఇంటిబాట పట్టింది. స్లోవేకియన్ ఆర్చర్ అలెగ్జాండ్రా జోరుకు లక్ష్మీరాణి బేజారైంది. నాలుగు సెట్లలో కేవలం ఒకపాయింట్ మాత్రమే సాధించింది.
స్విమ్మింగ్: సాజన్, శివానీ ఓటమి
సోమవారం జరిగిన 200 మీటర్ల ఫ్రీ స్టయిల్ హీట్స్‌లో భారత స్విమ్మర్లు సాజన్ ప్రకాశ్, శివానీ కటారియాలు చెత్త ప్రదర్శనతో నిష్ర్కమించారు. పురుషుల విభాగంలో 43 మంది పోటీపడగా సాజన్ 41వ స్థానంలో.. మహిళల్లో 29 మంది పోటీ పడగా శివానీ 28వ స్థానంలో నిలిచారు.