సస్పెండ్ చేసి మంచి పని చేశారు!
న్యూఢిల్లీ:ఇండియన్ ఒలింపిక్స్ సంఘం(ఐఓఏ)ను సస్పెండ్ చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని భారత షూటర్ అభినవ్ బింద్రా సమర్ధించాడు. క్రీడల్లో పారదర్శకత ఉండాలంటే ఇటువంటి మంచి నిర్ణయాలు ఎంతైనా అవసరమని పేర్కొన్నాడు. ఐఓఏ పట్ల క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయం మంచి పరిణామానికి సంకేతమని బింద్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ వేసిన ముందడుగు కొన్ని విలువల్ని కాపాడటానికి దోహదం చేస్తుందన్నాడు. ఎక్కడైనా అవినీతి కూడిన పరిపాలన ఎంతోకాలం సాగదనడానికి ఇదే ఉదాహరణనని బింద్రా తెలిపాడు.
ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వేల కోట్ల అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఇటీవల ఐఓఏ తమ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్రీడా శాఖ డిమాండ్ చేసినా దాన్ని ఐఓఏ పక్కన పెట్టేసింది. దాంతో తాత్కాలికంగా ఐఓఏపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖ నిర్ణయం తీసుకుంది.