Sports Ministry
-
‘ధ్యాన్‌చంద్’ ఇకపై అర్జున లైఫ్‌టైమ్ అవార్డుగా...
క్రీడాకారులకు దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ పేరిట ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మార్చింది. ఆటగాళ్లు తమ కెరీర్లో కనబరిచిన విశేష సేవలకు గుర్తింపుగా 2002 నుంచి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డును ప్రదానం చేయడం మొదలు పెట్టారు. దీన్ని ఇకపై ‘అర్జున లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డుగా అందజేయనున్నారు.ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2023లో మంజూష కన్వర్ (షట్లర్), వినీత్ కుమార్ (హాకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ)లకు ఈ జీవితసాఫల్య పురస్కారాన్ని అందజేశారు.ఈ ఏడాది అవార్డుల కోసం నామినేషన్లను దాఖలు చేసేందుకు వచ్చే నెల 14వ తేదీ వరకు గడువు ఉంది. ‘ఖేలో ఇండియా’ భాగంగా యూనివర్సిటీ స్థాయిలో జరిగే పోటీల్లో ఓవరాల్ విజేతకు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీని అందజేస్తారు. వీటితో పాటు ఎప్పట్లాగే ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులు కూడా ఉంటాయి. -
Interim Budget 2024: బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442 కోట్లు
Interim Budget 2024- న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో క్రీడల కోసం రూ. 3,442.32 కోట్లు కేటాయించారు. 2023–24 వార్షిక బడ్జెట్లో రూ. 3,396.96 కోట్లు క్రీడలకు వెచ్చిస్తే ఈసారి రూ.45.36 కోట్లు పెంచారు. కేంద్ర క్రీడాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 900 కోట్లు (రూ.20 కోట్లు పెరుగుదల), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రూ. 822.60 కోట్లు (రూ.26.83 కోట్లు పెంపు) కేటాయించారు. మౌలిక వసతుల కల్పన, అథ్లెట్లకు అధునిక క్రీడాసామాగ్రి, కోచ్‌ల నియామకం కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ 340 కోట్లు (రూ.15 కోట్లు పెంచారు) ఇవ్వనున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బలోపేతానికి రూ. 22.30 కోట్లు కేటాయించారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూ. 91.90 కోట్లు (రూ.8.69 కోట్లు హెచ్చింపు) కేటాయించారు. చదవండి: భారత్‌తో డేవిస్‌కప్ మ్యాచ్‌పై పాకిస్తాన్లో అనాసక్తి -
రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలు ఐఓఏకు అప్పగింత..
నూతనంగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటనల వల్ల కేంద్ర క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్(ఐఓఏ)కు కేంద్రం అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఐఓఏకు క్రీడా శాఖ లేఖ రాసింది. రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలని ఐఓఏను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఏంజరిగిందంటే? అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం సంజయ్ సింగ్.. అండర్-16, అండర్-20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఈ నెలాఖరులోపు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గల నందినగర్‌లో జరుగుతాయని ప్రకటించాడు. పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా ప్రకటించడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో నిబంధనలకు విరుద్దంగా ప్రకటన చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. ప్యానెల్ మొత్తంపై వేటు వేసింది. అదే విధంగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడింట్‌గా ఎంపిక కావడంపై రెజ్లర్ల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆట నుంచి తప్పుకోగా.. బజరంగ్ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో క్రీడా శాఖ నిర్ణయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: Govt Suspends WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌పై వేటు -
క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌పై వేటు
భారత క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య పాలక వర్గాన్ని సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటన వల్ల ఈ మేరకు వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్‌భూషణ్ తన పట్టు నిరూపించుకున్నాడు. బరిలో లేకపోయినా పట్టు నిరూపించుకున్న బ్రిజ్ భూషణ్ నేరుగా బరిలో నిలకపోయినా... 15 పదవుల్లో తన వర్గానికి చెందిన 13 మందిని గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన, ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్‌పై 40–7 ఓట్ల తేడాతో గెలిచి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే, డబ్ల్యూఎఫ్ఐలో బ్రిజ్ భూషణ్ వర్గం ఎన్నికకావడాన్ని నిరసిస్తూ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి చెప్పగా.. బజరంగ్ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన మరోవైపు.. సాక్షికి మద్దతుగా బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ సైతం పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై చర్చ నడుస్తుండగా.. తాజాగా క్రీడా శాఖ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అండర్-16, అండర్-20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గల నందినగర్‌లో జరుగుతాయని ప్రకటించాడు. అయితే, ఈ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్లకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ప్రకటన చేయడం డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖా నిర్ణయం తీసుకుంది. అందుకే వేటు ‘‘డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని క్లాజ్ 3(e) ప్రకారం.. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్స్ ఎక్కడ నిర్వహించాలన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయిస్తుంది. అంతకంటే ముందు సమావేశంలోని ఎజెండాలను పరిశీలిస్తుంది. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం.. మీటింగ్‌కు సంబంధించి కోరం కోసం ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఇందుకు కనీసం 15 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుంది. మొత్తం ప్రతినిధుల్లో మూడొంతుల ఒకటి మేర కోరం ఉండాలి. అత్యవసరంగా సమావేశం నిర్వహించాలనుకుంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి’’ . అయితే, ఈ నిబంధనలను సంజయ్ సింగ్ అతిక్రమించిన కారణంగా క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: అక్కడున్నది కోహ్లి.. రాత్రికిరాత్రే వెళ్లలేదు.. పక్కా ప్లాన్‌తోనే! -
స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ.. క్రీడాకారిణికి అసభ్య మెసేజ్‌లు..
సాక్షి, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటన మరువక ముందే మరో కీచకుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో కీచక ఉద్యోగి వేధింపుల బండారం బట్టబయలైంది. ఓ జాతీయ క్రీడాకారిణిపై మంత్రి పేషీ ఉద్యోగి వేధింపుల ఘటన సంచలనం రేకెత్తించింది. మంత్రి సిఫార్సుతో వచ్చినా వేధింపులు తప్పలేదని ఆ క్రీడాకారిణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, కెరీర్‌కు భయపడి ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘స్పోర్ట్స్ మినిస్టర్ పీఏనంటూ వేధించాడు. అసభ్యకర మెసేజ్‌లతో వేధింపులకు పాల్పడ్డాడు. స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫీసుకు వెళ్లినా నన్ను కలవనివ్వలేదు. గతంలో వేధింపులకు గురైనా బయటకు రాలేకపోయామంటూ బాధితురాలు వాపోయింది. -
బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ కీలక నిర్ణయం.. క్రీడా శాఖ ఆమోదం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ సెలెక్షన్ ట్రయల్స్‌కు సమాయత్తమయ్యేందుకు భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ విదేశాల్లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించగా వాటికి ఆమోదం లభించింది. బజరంగ్ 36 రోజుల శిక్షణ కోసం కిర్గిస్తాన్‌ను... వినేశ్ 18 రోజుల శిక్షణకు హంగేరిని ఎంచుకున్నారు. ఆగస్టు రెండో వారంలో ట్రయల్స్ జరగనుండగా... వచ్చే వారంలో వీరు విదేశాలకు బయలుదేరుతారు. వినేశ్ వెంట ఫిజియోథెరపిస్ట్ అశ్విని జీవన్ పాటిల్, కోచ్ సుదేశ్, ప్రాక్టీస్ భాగస్వామిగా సంగీత ఫొగాట్... బజరంగ్ వెంట కోచ్ సుజీత్ మాన్, ఫిజియోథెర పిస్ట్ అనూజ్, ప్రాక్టీస్ భాగస్వామి జితేందర్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ నిపుణుడు కాజీ హసన్ వెళతారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణల కేసును కోర్టులోనే తేల్చుకుంటామని బజరంగ్, వినేశ్ ప్రకటించారు. చదవండి: Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్ -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. క్రీడాశాఖ కీలక నిర్ణయం
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేసింది. రెజర్లతో చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వినోద్ తోమర్ అత్యంత సన్నిహితుడు. రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను ఆయనే చూసుకునేవారు. ఈ నేపథ్యంలో వినోద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక శనివారం కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు సఫలం కావడంతో రెజ్లర్లు ఆందోళన విరమించారు. సమస్యపై కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ.. సమాఖ్య అధ్యక్షుడు, కార్యదర్శిని తాత్కాలికంగా తప్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంతో రెజ్లర్లు కాస్త శాంతించారు. కాగా ఇప్పటికే దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఐవోఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! రెజ్లర్ల మీటూ ఉద్యమం.. కీలక పరిణామం -
జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులకు గడువు పెంపు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులు సమర్పించేందుకు కేంద్ర క్రీడాశాఖ తుది గడువును మూడు రోజులు పెంచింది. ఇంతకుముందు ప్రకటించినట్లు ఈ నెల 27తో గడువు ముగియగా... తాజాగా వచ్చే నెల 1వ తేదీ (శనివారం) వరకు అర్హత గల క్రీడాకారులు, కోచ్‌లు, సంఘాలు, యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నుంచి క్రీడాశాఖకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్‌లో ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ‘భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్యలు, స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ నామినేషన్లను అక్టోబర్ 1లోపు ఆన్లైన్లో పంపాలి’ అని కేంద్ర క్రీడాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
మన్‌ప్రీత్ సింగ్‌కూ ‘ఖేల్ రత్న’
ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అందుకోనున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల 11 మందికి ‘ఖేల్ రత్న’ ప్రకటించగా... తాజాగా ఈ జాబితాలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును కూడా చేర్చారు. ఈ ఏడాది 35 మందికి ‘అర్జున’... పది మందికి ‘ద్రోణాచార్య’ అవార్డు... ఐదుగురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డు ఇవ్వనున్నారు. ఈనెల 13న రాష్ట్రపతి భవన్లో 2021 జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. -
రేపు జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: గత ఏడాదికి సంబంధించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం రేపు జరగనుంది. 2020లో అవార్డుకు ఎంపికైన ఆటగాళ్లకు నగదు బహుమతి లభించినా కోవిడ్ కారణంగా ప్రభుత్వం అవార్డు జ్ఞాపికలను అందించలేకపోయింది. దాంతో ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఓ హోటల్లో రేపు నిర్వహించి వారికి ప్రత్యక్షంగా అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏటా క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అవార్డులు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే కరోనా ఆంక్షలతో అది సాధ్యం కాలేదు. చదవండి: బంగారంలాంటి బాక్సర్.. తజముల్ -
టోక్యో ఒలింపిక్స్ విజేతలకు క్రీడాశాఖ సత్కారం
-
భారత అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వోల్కర్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వోల్కర్ హెర్మన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని వోల్కర్ స్వయంగా తన ఫేస్బుక్ పేజీ ద్వారా పంచుకున్నారు. అత్యున్నతమైన ఈ పదవి కోసం విధించుకున్న స్వీయ అంచనాలను ఇక అందుకోలేనని పేర్కొంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2019లో వోల్కర్ ఈ బాధ్యతను స్వీకరించారు. టోక్యో ఒలింపిక్స్‌తో ఆయన పదవీకాలం ముగియనుండగా... సెప్టెంబర్‌లో భారత క్రీడా మంత్రిత్వ శాఖ 2024 వరకు ఆయనకు పొడిగింపునిచ్చింది. అయితే దీన్ని తిరస్కరించిన వోల్కర్ కొన్ని వారాల కిందటే రాజీనామా పత్రాన్ని సమర్పించారని ఏఎఫ్ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఏఎఫ్ఐ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన జర్మనీకి వెళ్లేందుకే సిద్ధపడ్డారని సమాఖ్య అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపారు. -
‘అర్జున’ ఒక్కరికే వస్తుందనుకున్నా...
హైదరాబాద్: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసిన జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున అవార్డు’ కోసం తనతోపాటు తన భాగస్వామి చిరాగ్ శెట్టి పేరు కూడా ఉండటంపై ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. 2019లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో అద్భుత ఫలితాలు సాధించింది. థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన ఈ ద్వయం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో పురుషుల డబుల్స్ ప్రపంచ చాంపియన్ జోడీని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న జంటను సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది. ‘చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరిలో ఒక్కరికే అవార్డు వచ్చే అవకాశముందని, ఇద్దరికీ రాకపోవచ్చని ఎవరో చెప్పారు. అయితే అవార్డుల సెలక్షన్ కమిటీ మా ఇద్దరి పేర్లను కేంద్ర క్రీడా శాఖకు పంపించడంతో ఊరట చెందాను’ అని సాత్విక్ అన్నాడు. ప్రస్తుతం అమలాపురంలోనే ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపిన సాత్విక్... రెండు వారాలలోపు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న జాతీయ శిక్షణ శిబిరానికి హాజరవుతానన్నాడు. . తన అర్జున అవార్డును తల్లిదండ్రులకు, కోచ్‌లకు, తానీ స్థాయికి చేరుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ అంకితం ఇస్తున్నానని ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ తెలిపాడు. 20 ఏళ్ల ప్రాయంలోనే ‘అర్జున’ అవార్డు వస్తుందని ఊహించలేదని... ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సాత్విక్ పేర్కొన్నాడు. ‘టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తీవ్రంగా నిరాశ చెందాను. కొంతకాలంగా మేమిద్దరం మంచి ఫామ్‌లో ఉన్నాం. మరో రెండు నెలల వరకు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేవు. టోర్నీలు లేని సమయంలో ఏ క్రీడాకారుడికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ప్రాక్టీస్ మొదలుపెట్టిన రెండు వారాల్లో మేము ఫామ్‌లోకి వస్తామని ఆశిస్తున్నాను’ అని సాత్విక్ వివరించాడు. -
రూ. 2 లక్షల పరిమితి తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి ఖ్యాతితెచ్చే క్రీడాకారులను తయారుచేసే భారత కోచ్‌లకు కేంద్ర క్రీడా శాఖ శుభ వార్త చెప్పింది. భారతీయ కోచ్‌ల జీతాలను గరిష్టంగా రూ. 2 లక్షలకే పరిమితం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. స్వదేశీ కోచ్‌లు మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేలా ఈ చర్య వారిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. కోచింగ్ వైపు భారత మాజీ ఆటగాళ్లను కూడా ఆకర్షించడమే తమ లక్ష్యమని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘చాలా మంది భారత కోచ్‌లు గొప్ప ఫలితాలను అందిస్తున్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాల్సిందే. మేటి అథ్లెట్లను తయారు చేసేందుకు అత్యుత్తమ కోచ్‌లు కావాలనే మేం కోరుకుంటాం. అలాంటప్పుడు వారికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై పరిమితి విధించకూడదని భావిస్తున్నాం. ఇకనుంచి నాలుగేళ్లకుగానూ కోచ్‌లతో కాంట్రాక్టు చేసుకుంటాం’ అని రిజిజు వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ అథ్లెట్లు కోచింగ్ వైపు మొగ్గుచూపితే దేశంలో క్రీడల అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. -
‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రంగా స్పోర్ట్స్ స్కూల్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఫలవంతం చేసేందుకు క్రీడా శాఖ పటిష్ట కార్యాచరణతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌ను ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు రాగా మెరుగైన క్రీడా వసతులున్న ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర క్రీడా శాఖ ఆమోదముద్ర దక్కింది. అందులో తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి. దీనితో పాటు కర్ణాటక, ఒడిశా, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా కేఐఎస్‌సీఈలను ఏర్పాటు చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, శిక్షణ, వసతుల ఆధారంగానే వీటిని ఆమోదించినట్లు క్రీడాశాఖ వెల్లడించింది. వీటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్ లభించనుంది. కేఐఎస్‌సీఈ హోదాకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. -
బీసీసీఐ ‘ఆటలు’ ఇక చెల్లవు!
మా క్రికెటర్లు మా ఇష్టం... ప్రభుత్వం మాకేమైనా నిధులిస్తోందా? మాది స్వతంత్ర సంఘం... నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు... ఏ పరీక్షలైనా మేం సొంతంగానే చేసుకుంటాం తప్ప మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు... గత 13 ఏళ్లుగా డోపింగ్‌కు సంబంధించిన అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైఖరి ఇది. కానీ ఇకపై అలాంటిది కుదరదని తేలిపోయింది. సుదీర్ఘ కాలంగా బీసీసీఐని భారత ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు తమ అధికారాన్ని చూపించింది. భారత క్రికెట్ బోర్డును ఇతర క్రీడా సమాఖ్యల్లాగే గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా క్రికెటర్లు కూడా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు హాజరు కావాల్సిందే. తాజా నిర్ణయం ఏమిటి? బీసీసీఐకి కూడా ఇకపై ఇతర క్రీడలలాగే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)గా గుర్తింపు లభించింది. ఇన్నేళ్ల పాటు మాది స్వతంత్ర సంస్థ, మాకు ఎవరితో సంబం« దం లేదు అంటూ క్రికెట్ బోర్డు చెబుతూ వచ్చింది. ఏం జరుగుతుంది? సమాచార హక్కు చట్టం (ఆర్టీఏ) సహా ప్రభుత్వ నిబంధనలు అన్నీ బీసీసీఐకీ వర్తిస్తాయి. ఆర్థికపరంగా స్వతంత్రంగా ఉన్నా... అన్ని విషయాల్లో జవాబుదారీతనం ఉంటుంది. అయితే శుక్రవారం సమావేశంలో ‘నాడా’పై మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. సమాచార హక్కు విషయంలో చర్చ జరగలేదు. ‘నాడా’ పరిధిలోకి వస్తే ఏమిటి? శుక్రవారం తీసుకున్న అతి కీలక నిర్ణయం ఇదే. ప్రభుత్వం గుర్తించిన సంఘం కాబట్టి డోపింగ్ విషయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సొంతంగా డోపింగ్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం లేదు. ఇప్పటివరకు భారత క్రికెటర్ల శాంపిల్స్‌ను స్వీడన్‌కు చెందిన ఐడీటీఎం సేకరించి జాతీయ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్)కు పంపించేది. ఇకపై ఐడీటీఎంకు ఆ అధికారం ఉండదు. నేరుగా ‘నాడా’నే పరీక్షలు నిర్వహిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా క్రికెటర్లకు ‘నాడా’ పరీక్షలు నిర్వహించవచ్చు. డోపింగ్ విషయంలో బోర్డు సరిగా వ్యవహరించడం లేదా? ఇటీవల యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యవహారం దీనికి సరైన ఉదాహరణ. షా డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడని తెలిసినా అతడిని ఐపీఎల్ ఆడించడంతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలు వాడుకునేందుకూ బీసీసీఐ అవకాశం కల్పించింది. పైగా పాత తేదీలతో అతని సస్పెన్షన్ కాలాన్ని సాధ్యమైనంత తక్కువగా చేసేందుకు ప్రయత్నించింది. బోర్డు సొంతంగా పరీక్షలు నిర్వహిస్తే ఇలాగే ఉంటుందంటూ చెప్పేందుకు ప్రభుత్వానికి చాన్స్ లభించింది. డోపింగ్ పరీక్షల తీరును ప్రశ్నిస్తూ బీసీసీఐకి ఇటీవలే ఘాటుగా లేఖ కూడా రాసింది. ఇదే అదనుగా బోర్డుపై ఒత్తిడి పెంచి తమ దారికి తెచ్చుకుంది. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందా? భారత్‌లో త్వరలో దక్షిణాఫ్రికా ‘ఎ’, మహిళా జట్ల పర్యటనలు ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం మార్చిలోనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ దానిని నిలిపివేసి తమతో చర్చలకు వచ్చేలా ఒత్తిడి తెచ్చింది. ‘నాడా’కు, దీనికి సంబంధం లేదని జోహ్రి చెప్పినా ఇది కూడా ఒక కారణం. ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే మున్ముందు కీలక సిరీస్‌లకు సందర్భంగా ఇది సమస్యగా మారవచ్చని ఒక రకమైన హెచ్చరిక ఇందులో కనిపించింది. ఇప్పటి వరకు బీసీసీఐ విధానం ఏమిటి? 2002 నుంచి డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2006లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)తో ఒప్పందం చేసుకుంది. ఐసీసీ సభ్య దేశాలన్నీ దీనికి అంగీకరించగా... ఒక్క భారత్ మాత్రం ఇందులో చేరేందుకు నిరాకరించింది. మన దేశంలో ఇతర క్రీడలకు సంబంధించి ‘వాడా’ పరిధిలోనే ‘నాడా’ కూడా పని చేస్తుంది. అయితే ‘వాడా’ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ సౌకర్యాలతో తాము సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే సామర్థ్యం తమకు ఉంది కాబట్టి కొత్తగా ‘నాడా’లో చేరాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘నాడా’లో తరచుగా శాంపిల్స్ విషయంలో వివాదాలు రేగాయి కాబట్టి దానిని తాము నమ్మమని తేల్చేసింది. ఈ విషయంలో స్వతంత్రంగా ఉండటానికే మొగ్గు చూపింది. తాజా పరిణామంపై బోర్డు స్పందన ఏమిటి? బీసీసీఐకి అక్టోబరులో ఎన్నికలున్నాయి. ఈలోగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు కార్యవర్గం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అంగీకరించే హక్కు పరిపాలకుల కమిటీ (సీఓఏ), సీఈఓలకు ఎలా ఉంటు ందని ప్రశ్నిస్తున్నారు. అయితే పదవిలో ఎవరు ఉన్నా చట్టాలు గౌరవించాల్సిందేనని, అది ఎవరి చేతుల్లోనూ ఉండదంటూ జోహ్రి ఈ వాదనను కొట్టిపారేశారు. సమావేశంలో ఏం జరిగింది? శుక్రవారం జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఝులనియా, ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్‌లతో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీమ్ సమావేశమయ్యారు. డోపింగ్‌లో ‘నాడా’ పరిధిలోకి వచ్చేందుకు తమకు ఉన్న సందేహాలను బోర్డు ప్రతినిధులు ముందుంచారు. డోపింగ్ టెస్టింగ్ కిట్ల నాణ్యత, పరీక్షలు జరిపేవారి సామర్థ్యం, శాంపిల్ తీసుకునే అధికారుల అర్హతవంటి అం శాలపై తమకు అభ్యంతరం ఉందంటూ జోహ్రి అన్నా రు. అయితే అన్ని అంశాలపై ప్రభుత్వాధికారులు స్పష్ట తనిచ్చిన తర్వాత బీసీసీఐ తరఫున జోహ్రి సంతకం చేశారు. నాణ్యత విషయంలో ఏదైనా అదనపు ఖర్చు చేయాల్సి వస్తే బీసీసీఐ దానిని భరిస్తుంది. ‘ఎవరైనా చట్టాలను గౌరవించాల్సిందే. బీసీసీఐ కూడా అందుకు సిద్ధం. ప్రభుత్వ నిబంధనలను అంగీకరిస్తున్నట్లు మేం సంతకం చేశాం’ అని జోహ్రి వెల్లడించారు. భారత క్రికెటర్ల అభ్యంతరం ఏమిటి? ‘వాడా’లో ఉన్న ఒక ప్రధాన నిబంధన ఇప్పటి వరకు బీసీసీఐ ‘నాడా’ పరిధిలోకి రాకుండా కారణమైంది. ఆటగాళ్లు ఏడాదిలో నాలుగు సార్లు రాబోయే మూడు నెలల్లో మ్యాచ్‌లు లేని సమయంలో తాము ఎక్కడ ఉండబోతున్నామో, ఏ సమయంలో డోపింగ్ పరీక్షకు సిద్ధమవుతారో ముందే వెల్లడించాల్సి ఉంటుంది. దీనిని తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరంగా మన క్రికెటర్లు భావించారు. డోపింగ్ అధికారులకు సమయం ఇచ్చి మూడు సార్లు అందుబాటులో లేకపోతే తీవ్ర చర్యలు ఉంటాయి. విండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఇదే చేసి నిషేధానికి గురయ్యాడు. అయితే భారత్‌లాంటి దేశంలో క్రికెటర్ల కదలికలు అందరికీ తెలియడం మంచి కాదని... సచిన్, ధోనిలాంటి క్రికెటర్లు తమకు ఉగ్రవాదుల బెదిరింపులు కూడా వచ్చాయి కాబట్టి ఇది సాధ్యం కాదని చెప్పేశారు. దాంతో తమ స్టార్ క్రికెటర్ల మాటపై బీసీసీఐ ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ... ఖాళీ సమయంలో కాకుండా మ్యాచ్‌లు జరిగేటప్పుడే డోపింగ్ పరీక్షలు చేస్తామని, ఎవరో ఒకరు కాకుండా ప్రత్యేకంగా నియమించిన అధికారికే ఆటగాళ్ల సమాచారం ఇస్తామని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే మన ఆటగాళ్ల నిర్ణయం మాత్రం మారలేదు. రాహుల్ జోహ్రి, రాధేశ్యామ్ ఝులనియా -
ఇక నాడా డోప్ టెస్టులకు టీమిండియా ఆటగాళ్లు..!
న్యూఢిల్లీ : భారత క్రికెటర్లు ఇక నాడా (నేషనల్ యాంటి డోపింగ్ ఏజన్సీ) డోపింగ్ టెస్టుల్లో పాల్గొనాల్సిందేనని క్రీడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఆటగాళ్లందరూ సమానమేనని, ఈ విషయంలో క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవని క్రీడాశాఖ కార్యదర్శి ఆర్ఎస్ జులానియా వెల్లడించారు. ఇక ఈ నిర్ణయంతో టీమిండియా ఆటగాళ్లు నాడా పరిధిలోకి రానున్నారు. అయితే, నాడా పనితీరుపై బీసీసీఐకి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకనే బోర్డే తన ఆటగాళ్లకు ఇన్నాళ్లూ డోప్ టెస్టులు నిర్వహిస్తూ వస్తోంది. ఇదిలాఉండగా.. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న టెర్బుటలైన్ ఉత్ప్రేరకాన్ని వాడిన యువ క్రికెటర్ పృథ్వీ షా 8 నెలల నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. అవగాహన లేకే టెర్బుటలైన్ మెడిసిన్ తీసుకున్నట్లు పృథ్వీ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. కావాలని కాకుండా మెడిసిన్‌గా తీసుకోవడంతో బోర్డు కరుణించి అతనికి తక్కువ శిక్ష విధించింది. ఇక డోప్ టెస్ట్‌లు, శిక్షలు ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని కేంద్ర క్రీడల శాఖ ఇటీవల బీసీసీఐకి లేఖ రాసింది. అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్ టెస్ట్‌లు నిర్వహించాలని బోర్డుకు సూచించింది. (చదవండి : డోప్ టెస్టులో పృథ్వీ షా విఫలం) అయితే, బీసీసీఐ మాత్రం తమ డోపింగ్ టెస్టులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయన్న పేర్కొనడం విశేషం. ఇక క్రీడాశాఖ స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు నాడా డోపింగ్ పరీక్షల్లో పాల్గొనాల్సిందే. నాడా పనితీరుపై అనుమానాలు ఉన్నాయని బీసీసీఐ యాంటి డోపింగ్ మేనేజర్ అభిజిత్ సాల్వి అన్నారు. అందుకనే బీసీసీఐ ఆందోళన చెందుతోందని చెప్పారు. ఆ సంస్థ పేలవ పనితీరు ఫలితంగా ఎంతమంది ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. -
కోహ్లికి ఖేల్‌రత్న.. సిక్కి రెడ్డికి అర్జున
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డుని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అందుకోనున్నాడు. 2018 సంవత్సరానికి గానూ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది కోహ్లీతో పాటు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానులకు ఖేల్‌రత్న అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికే అర్జున అవార్డు ఖాయమైంది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ప్లేయర్ సిక్కి రెడ్డి అర్జున అవార్డు పురస్కారం అందుకోనున్నారు. ఇక గతకొంత కాలంగా టేబుల్ టెన్నిస్‌లో ఎంతో మందికి శిక్షణనిస్తూ ఎన్నో పతకాలు సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కోచ్ శ్రీనివాస్ దోణాచార్య అవార్డు అందుకోనున్నారు. ఈ క్రీడా పురస్కారాలను సెప్టెంబర్ 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఓ కార్యక్రమంలో క్రీడాకారులు అందుకోనున్నారు. అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు కేంద్రం ప్రకటించిన క్రీడా పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కోచ్ శ్రీనివాసరావు, బాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. ఇరువురుకి లభించిన అవార్డులు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వ కారణమని పేర్కొన్నారు. ఇక గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా అవార్డులకు ఎంపికైన ఇరు రాష్ట్రాలకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి, కోచ్ శ్రీనివాస్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది క్రీడా పురస్కారాలకు ఎంపికైనది వీరే.. రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న: విరాట్ కోహ్లి (క్రికెట్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్). అర్జున అవార్డు: నేలకుర్తి సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), హిమ దాస్ (అథ్లెటిక్స్), స్మృతి మంధాన (క్రికెట్), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్ (షూటింగ్), శ్రేయసి సింగ్ (షూటింగ్), మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), పూజా కడియాన్ (వుషు), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రోహన్ బోపన్న (టెన్నిస్), జి. సత్యన్ (టేబుల్ టెన్నిస్), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), సతీశ్ కుమార్ (బాక్సింగ్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), అంకుర్ మిట్టల్ (షూటింగ్), సుమీత్ (రెజ్లింగ్), రవి రాథోడ్ (పోలో), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), అంకుర్ ధామ (పారాథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్). ద్రోణాచార్య అవార్డు: జీవన్‌జ్యోత్ తేజ (ఆర్చరీ), ఎస్.ఎస్.పన్ను (అథ్లెటిక్స్), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఎ. శ్రీనివాసరావు (టేబుల్ టెన్నిస్) క్లారెన్స్ లోబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ శర్మ (జూడో), వి.ఆర్.బీడు (అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ అవార్డు: సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్ (అథ్లెటిక్స్), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్). -
'సార్...నన్ను ఆదుకోండి'
న్యూఢిల్లీ: 12 ఏళ్ల వయసులో ఆర్చరీలో అరంగేట్రం చేసి ఔరా అనిపించిన అసోంకు చెందిన గొహెలో బోరో ప్రస్తుతం అరుదైన వ్యాధితో బాధపడుతోంది. కొక్రాఝార్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన బోరో ఇప్పుడు సాయం కోసం దీనంగా క్రీడాశాఖను అర్థిస్తోంది. ఈ మేరకు తనకు తక్షణమే సాయం చేయాలని కోరుతూ కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కు లేఖ రాసింది. ఒకవేళ తనకు సాయం అందకపోతే తన ఆర్చరీ కలలు ఇంతటితో ఆగిపోతాయని 21 ఏళ్ల బోరో ఆ లేఖలో పేర్కొంది. 2008లో ఆర్చరీలోకి ప్రవేశించిన బోరో... 2015 కేరళ జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. కెరీర్లో ఇప్పటివరకూ 77 పతకాలు గెలుచుకుంది. కాకపోతే గతేడాది ఆమె సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటసస్(ఎస్‌ఎల్‌ఈ), యాంటీ న్యూట్రోఫిల్ సైటోప్లాస్మిక్ యాంటీబాడీస్(ఏఎన్సీఏ) అనే వ్యాధి బారిన పడింది. దాంతో తొలుత గుహవాటిలో చికిత్స పొందిన ఆమె.. ఆపై మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. కాగా, సామాజిక మాధ్యమాల ద్వారా బోరో దుస్థితి గురించి తెలుసుకున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎయిమ్స్‌లో చికిత్సకు అయిన మొత్తం చెల్లించింది. మే 21న ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యాక క్రీడా శాఖ ఆమెను పట్టించుకోవడం మానేసింది. అయితే నెల్లో ఒకసారి బోరో ఢిల్లీ వచ్చి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు, ఆమె నెలకు రూ. 3నుంచి 4 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఆ క్రమంలోనే వైద్య ఖర్చుల బిల్లులను రెండు సార్లు క్రీడా శాఖకు సమర్పించినా ఇప్పటిదాకా పట్టించుకోలేదని ఆమె ఆవేదన చెందుతోంది. -
‘క్రీడా షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచండి’
న్యూఢిల్లీ: దేశంలో ఆయా విభాగాల్లో జరిగే క్రీడా ఈవెంట్ల వివరాలను అందివ్వనందుకు క్రీడా మంత్రిత్వ శాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) తప్పుపట్టింది.‘వార్షిక క్రీడా షెడ్యూల్ వివరాలను కూడా అభిమానులు సమాచార హక్కు ద్వారా తెలుసుకోవాలా? ఒకవేళ ఆ వివరాలు మీకు కూడా తెలియకపోతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. క్రీడా శాఖతో పాటు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కూడా తమ వెబ్సైట్లలో ఈ వివరాలను అప్డేట్ చేయండి’ అని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు కోరారు. -
ఆన్లైన్ బెట్టింగ్‌కు చట్టబద్ధత!
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడల ప్రోత్సాహానికి నిధుల కొరత ఉండటంతో ఆన్లైన్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు డ్రాఫ్ట్‌ను తయారు చేస్తోంది. వచ్చే రెండెళ్లలో ఆన్లైన్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని ఆ శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే నిధులతో క్రీడలను ప్రోత్సహించాలనుకుంటుంది. ఇప్పటికే భారత్‌లో చట్ట వ్యతిరేకంగా ఏడాదికి రూ 9.6 లక్షల కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. దీంతో దీనిని చట్ట బద్ధం చేస్తే పన్నుల రూపంలో క్రీడాశాఖకు నిధులు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హార్స్ రేసింగ్‌లపై బెట్టింగ్‌లు చట్టబద్ధంగా ఉండగా కేంద్రం వీటిపై 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇటీవల ఈ విషయంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ అధికారులతో సమావేశమై చర్చించారు. క్రీడాశాఖ ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరచడం, ప్రపంచానికి గొప్ప క్రీడాకారులను పరిచయం చేయడం తమ అభిమతం అని క్రీడామంత్రిత్వ శాఖ పేర్కొంది. బెట్టింగ్ అనేది ఓ సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యా అని పేర్కొంది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వివాదాలు చెలరేగే అవకాశం ఉండడతో ఆచుతూచి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలిపింది. గతంలో సుప్రీం కోర్టుకు క్రికెట్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని చాల మంది అభిప్రాయపడినట్లు లోథా కమిటీ తమ నివేదికలో పేర్కొంది. ఇది ఇప్పటికే యూకేలో అమలవుతుందని సూచించింది. -
ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలి
► భారత్న రత్న ప్రకటించాలని క్రీడా మంత్రిత్వ శాఖ పీఎంవో కు లేఖ న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్‌కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని మీడియాతో ఆ శాఖ మంత్రి విజయ్ గోయల్ ధృవికరించారు. హాకీలో దేశానికి ఎన్నో విజయాలందించిన ధ్యాన్ చంద్‌కు భారత రత్న ప్రకటించి నిజమైన నివాళిలు అర్పిస్తామని గోయల్ తెలిపారు. ధ్యాన్ చంద్ హాకీలో భారత్‌కు 1928,1932,1936 లో స్వర్ణపతకాలందించిన విషయం తెలిసిందే. క్రీడాకారులకు భారత అత్యున్నత పురస్కారం ఇవ్వడం సచిన్ టెండూల్కర్‌తో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి క్రీడా శాఖ సచిన్‌తో పాటు ధ్యాన్‌చంద్ పేరును ప్రభుత్వానికి నివేదించింది. కానీ ప్రభుత్వం సచిన్‌ను మాత్రమే ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. దీంతో ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడిగా సచిన్ నిలిచాడు. ధ్యాన్ చంద్ సాధించిన విజయాలను వేటితో పోల్చలేమని, ధ్యాన్ చంద్ మరణించినపుడే క్రీడాకారులకు భారత రత్న ప్రకటించే అవకాశం ఉంటే ధ్యాన్ చంద్ ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడయ్యే వాడని గోయల్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇక ధ్యాన్ చంద్ జయంతి ఆగష్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆరోజే వివిధ క్రీడల్లో రాణించిన అథ్లేట్లకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. ధ్యాన్ చంద్ కుమారుడు అశోక్ కుమార్, మాజీ హాకీ ఆటగాళ్లు ధ్యాన్ చంద్‌కు భారత రత్న అవార్డు ప్రకటించాలని గతి కొద్దికాలంగా డిమాండ్ చేస్తున్నారు. -
కోర్టు వివాదాలు పరిష్కరించుకోవాలి
ప్రభుత్వ విభాగాలకు ప్రధాని మోదీ సూచన న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రభుత్వ విభాగాలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు కలసి మెలసి విశాల ధృక్పథంతో పనిచేయాలన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ప్రభుత్వ విభాగాలు తీవ్ర ఇబ్బందుల మధ్యే పనిచేస్తున్నాయి. శాఖకు.. శాఖకు మధ్య సమన్వయం అనేదే కనిపించదు. అందువల్లే ఒక విభాగం ఒక నిర్ధిష్టమైన పథకం గురించి ఆలోచన చేస్తుంటే.. మరో విభాగం దీనికి పూర్తి విరుద్ధమైన ఆలోచన చేస్తుంటుంది’’అని ప్రధాని చెప్పారు. ‘‘ప్రభుత్వ విభాగాలు తమ మధ్య వివాదాల పరిష్కారానికి ఒకదానిపై మరొకటి కోర్టులను ఆశ్రయిస్తుంటాయి. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ఇరు పక్షాలు కూర్చుని చర్చించుకోవాలి. దీనికి విశాల దృక్ఫథం అవసరం’’అని పేర్కొన్నారు. శుక్రవారం గుజరాత్ కచ్‌లోని రణ్‌లో కేంద్ర, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా మంత్రిత్వ శాఖల సదస్సు జరిగింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోదని, వ్యవస్థాగతమైన ఏర్పాట్లతోనే పోత్సాహం లభిస్తుందన్నారు. ఈ నెల 29న ‘మన్‌కీబాత్’లో పోటీ పరీక్షలపై చర్చించనున్నట్టు ప్రధాని ట్వీట్ చేశారు. -
సస్పెండ్ చేసి మంచి పని చేశారు!
న్యూఢిల్లీ:ఇండియన్ ఒలింపిక్స్ సంఘం(ఐఓఏ)ను సస్పెండ్ చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని భారత షూటర్ అభినవ్ బింద్రా సమర్ధించాడు. క్రీడల్లో పారదర్శకత ఉండాలంటే ఇటువంటి మంచి నిర్ణయాలు ఎంతైనా అవసరమని పేర్కొన్నాడు. ఐఓఏ పట్ల క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయం మంచి పరిణామానికి సంకేతమని బింద్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ వేసిన ముందడుగు కొన్ని విలువల్ని కాపాడటానికి దోహదం చేస్తుందన్నాడు. ఎక్కడైనా అవినీతి కూడిన పరిపాలన ఎంతోకాలం సాగదనడానికి ఇదే ఉదాహరణనని బింద్రా తెలిపాడు. ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వేల కోట్ల అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఇటీవల ఐఓఏ తమ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్రీడా శాఖ డిమాండ్ చేసినా దాన్ని ఐఓఏ పక్కన పెట్టేసింది. దాంతో తాత్కాలికంగా ఐఓఏపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖ నిర్ణయం తీసుకుంది. -
'ఆ ఇద్దరి'పై ఐఓఏకి కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాల వ్యవహారంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ)పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడి, చౌతాలాలకు ప్రతిష్టాత్మక సంస్థలో చోటు కల్పించరాదని, తక్షణమే వారు రాజీనామా చేయడమో, లేదంటే తొలగించడమో జరగాలని ఒలింపిక్ సంఘానికి(ఐఓఏకి) కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఒకవేళ మాట వినకుంటే ఐఓఏకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించింది. క్రీడల మంత్రి విజయ్ గోయల్ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ క్రీడారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యావశ్యకాలని, వాటికి విరుద్ధంగా ఆ ఇద్దరి(కల్మాడీ, చౌతాల) ఎంపిక జరగడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఒలింపిక్ సంఘం సర్వసభ్య సమావేశంలో కల్మాడీ, చౌతాలలను జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఒలింపిక్ సంఘానికి కేంద్రం షోకాజ్ నోటీసు నేపథ్యంలో సురేశ్ కల్మాడి కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిసింది. 'జీవితకాల అధ్యక్ష' పదవి చేపట్టేందుకు కల్మాడీ సుముఖంగా లేరని పలు జాతీయ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. అయితే కల్మాడీగానీ, చౌతాలాగానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కల్మాడీ, చౌతాలాల నియామకానికి సంబంధించి తాము ఎవ్వరి సూచనను పాటించాల్సిన అవసరం లేదని భారత ఒలింపిక్ సంఘం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే బుధవారం నాటి షోకాజ్ నోటీసుపై ఆ సంస్థ స్పందన వెలువడాల్సిఉంది. (చదవండి: భారత ఒలింపిక్ సంఘం సంచలన ప్రకటన)