మా క్రికెటర్లు మా ఇష్టం... ప్రభుత్వం మాకేమైనా నిధులిస్తోందా? మాది స్వతంత్ర సంఘం... నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు... ఏ పరీక్షలైనా మేం సొంతంగానే చేసుకుంటాం తప్ప మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు... గత 13 ఏళ్లుగా డోపింగ్‌కు సంబంధించిన అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైఖరి ఇది. కానీ ఇకపై అలాంటిది కుదరదని తేలిపోయింది. సుదీర్ఘ కాలంగా బీసీసీఐని భారత ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు తమ అధికారాన్ని చూపించింది. భారత క్రికెట్ బోర్డును ఇతర క్రీడా సమాఖ్యల్లాగే గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా క్రికెటర్లు కూడా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు హాజరు కావాల్సిందే.
తాజా నిర్ణయం ఏమిటి?
బీసీసీఐకి కూడా ఇకపై ఇతర క్రీడలలాగే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)గా గుర్తింపు లభించింది. ఇన్నేళ్ల పాటు మాది స్వతంత్ర సంస్థ, మాకు ఎవరితో సంబం« దం లేదు అంటూ క్రికెట్ బోర్డు చెబుతూ వచ్చింది.
ఏం జరుగుతుంది?
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఏ) సహా ప్రభుత్వ నిబంధనలు అన్నీ బీసీసీఐకీ వర్తిస్తాయి. ఆర్థికపరంగా స్వతంత్రంగా ఉన్నా... అన్ని విషయాల్లో జవాబుదారీతనం ఉంటుంది. అయితే శుక్రవారం సమావేశంలో ‘నాడా’పై మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. సమాచార హక్కు విషయంలో చర్చ జరగలేదు.
‘నాడా’ పరిధిలోకి వస్తే ఏమిటి?
శుక్రవారం తీసుకున్న అతి కీలక నిర్ణయం ఇదే. ప్రభుత్వం గుర్తించిన సంఘం కాబట్టి డోపింగ్ విషయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సొంతంగా డోపింగ్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం లేదు. ఇప్పటివరకు భారత క్రికెటర్ల శాంపిల్స్‌ను స్వీడన్‌కు చెందిన ఐడీటీఎం సేకరించి జాతీయ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్)కు పంపించేది. ఇకపై ఐడీటీఎంకు ఆ అధికారం ఉండదు. నేరుగా ‘నాడా’నే పరీక్షలు నిర్వహిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా క్రికెటర్లకు ‘నాడా’ పరీక్షలు నిర్వహించవచ్చు.
డోపింగ్ విషయంలో బోర్డు సరిగా వ్యవహరించడం లేదా?
ఇటీవల యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యవహారం దీనికి సరైన ఉదాహరణ. షా డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడని తెలిసినా అతడిని ఐపీఎల్ ఆడించడంతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) సౌకర్యాలు వాడుకునేందుకూ బీసీసీఐ అవకాశం కల్పించింది. పైగా పాత తేదీలతో అతని సస్పెన్షన్ కాలాన్ని సాధ్యమైనంత తక్కువగా చేసేందుకు ప్రయత్నించింది. బోర్డు సొంతంగా పరీక్షలు నిర్వహిస్తే ఇలాగే ఉంటుందంటూ చెప్పేందుకు ప్రభుత్వానికి చాన్స్ లభించింది. డోపింగ్ పరీక్షల తీరును ప్రశ్నిస్తూ బీసీసీఐకి ఇటీవలే ఘాటుగా లేఖ కూడా రాసింది. ఇదే అదనుగా బోర్డుపై ఒత్తిడి పెంచి తమ దారికి తెచ్చుకుంది.
ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందా?
భారత్‌లో త్వరలో దక్షిణాఫ్రికా ‘ఎ’, మహిళా జట్ల పర్యటనలు ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం మార్చిలోనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ దానిని నిలిపివేసి తమతో చర్చలకు వచ్చేలా ఒత్తిడి తెచ్చింది. ‘నాడా’కు, దీనికి సంబంధం లేదని జోహ్రి చెప్పినా ఇది కూడా ఒక కారణం. ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే మున్ముందు కీలక సిరీస్‌లకు సందర్భంగా ఇది సమస్యగా మారవచ్చని ఒక రకమైన హెచ్చరిక ఇందులో కనిపించింది.
ఇప్పటి వరకు బీసీసీఐ విధానం ఏమిటి?
2002 నుంచి డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2006లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)తో ఒప్పందం చేసుకుంది. ఐసీసీ సభ్య దేశాలన్నీ దీనికి అంగీకరించగా... ఒక్క భారత్ మాత్రం ఇందులో చేరేందుకు నిరాకరించింది. మన దేశంలో ఇతర క్రీడలకు సంబంధించి ‘వాడా’ పరిధిలోనే ‘నాడా’ కూడా పని చేస్తుంది. అయితే ‘వాడా’ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ సౌకర్యాలతో తాము సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే సామర్థ్యం తమకు ఉంది కాబట్టి కొత్తగా ‘నాడా’లో చేరాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘నాడా’లో తరచుగా శాంపిల్స్ విషయంలో వివాదాలు రేగాయి కాబట్టి దానిని తాము నమ్మమని తేల్చేసింది. ఈ విషయంలో స్వతంత్రంగా ఉండటానికే మొగ్గు చూపింది.
తాజా పరిణామంపై బోర్డు స్పందన ఏమిటి?
బీసీసీఐకి అక్టోబరులో ఎన్నికలున్నాయి. ఈలోగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు కార్యవర్గం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అంగీకరించే హక్కు పరిపాలకుల కమిటీ (సీఓఏ), సీఈఓలకు ఎలా ఉంటు ందని ప్రశ్నిస్తున్నారు. అయితే పదవిలో ఎవరు ఉన్నా చట్టాలు గౌరవించాల్సిందేనని, అది ఎవరి చేతుల్లోనూ ఉండదంటూ జోహ్రి ఈ వాదనను కొట్టిపారేశారు.
సమావేశంలో ఏం జరిగింది?
శుక్రవారం జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఝులనియా, ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్‌లతో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీమ్ సమావేశమయ్యారు. డోపింగ్‌లో ‘నాడా’ పరిధిలోకి వచ్చేందుకు తమకు ఉన్న సందేహాలను బోర్డు ప్రతినిధులు ముందుంచారు. డోపింగ్ టెస్టింగ్ కిట్‌ల నాణ్యత, పరీక్షలు జరిపేవారి సామర్థ్యం, శాంపిల్ తీసుకునే అధికారుల అర్హతవంటి అం శాలపై తమకు అభ్యంతరం ఉందంటూ జోహ్రి అన్నా రు. అయితే అన్ని అంశాలపై ప్రభుత్వాధికారులు స్పష్ట తనిచ్చిన తర్వాత బీసీసీఐ తరఫున జోహ్రి సంతకం చేశారు. నాణ్యత విషయంలో ఏదైనా అదనపు ఖర్చు చేయాల్సి వస్తే బీసీసీఐ దానిని భరిస్తుంది. ‘ఎవరైనా చట్టాలను గౌరవించాల్సిందే. బీసీసీఐ కూడా అందుకు సిద్ధం. ప్రభుత్వ నిబంధనలను అంగీకరిస్తున్నట్లు మేం సంతకం చేశాం’ అని జోహ్రి వెల్లడించారు.
భారత క్రికెటర్ల అభ్యంతరం ఏమిటి?
‘వాడా’లో ఉన్న ఒక ప్రధాన నిబంధన ఇప్పటి వరకు బీసీసీఐ ‘నాడా’ పరిధిలోకి రాకుండా కారణమైంది. ఆటగాళ్లు ఏడాదిలో నాలుగు సార్లు రాబోయే మూడు నెలల్లో మ్యాచ్‌లు లేని సమయంలో తాము ఎక్కడ ఉండబోతున్నామో, ఏ సమయంలో డోపింగ్ పరీక్షకు సిద్ధమవుతారో ముందే వెల్లడించాల్సి ఉంటుంది. దీనిని తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరంగా మన క్రికెటర్లు భావించారు. డోపింగ్ అధికారులకు సమయం ఇచ్చి మూడు సార్లు అందుబాటులో లేకపోతే తీవ్ర చర్యలు ఉంటాయి. విండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఇదే చేసి నిషేధానికి గురయ్యాడు. అయితే భారత్‌లాంటి దేశంలో క్రికెటర్ల కదలికలు అందరికీ తెలియడం మంచి కాదని... సచిన్, ధోనిలాంటి క్రికెటర్లు తమకు ఉగ్రవాదుల బెదిరింపులు కూడా వచ్చాయి కాబట్టి ఇది సాధ్యం కాదని చెప్పేశారు. దాంతో తమ స్టార్ క్రికెటర్ల మాటపై బీసీసీఐ ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ... ఖాళీ సమయంలో కాకుండా మ్యాచ్‌లు జరిగేటప్పుడే డోపింగ్ పరీక్షలు చేస్తామని, ఎవరో ఒకరు కాకుండా ప్రత్యేకంగా నియమించిన అధికారికే ఆటగాళ్ల సమాచారం ఇస్తామని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే మన ఆటగాళ్ల నిర్ణయం మాత్రం మారలేదు.
రాహుల్ జోహ్రి, రాధేశ్యామ్ ఝులనియా
బీసీసీఐ ‘ఆటలు’ ఇక చెల్లవు!
Published Sat, Aug 10 2019 4:44 AM | Last Updated on Sat, Aug 10 2019 5:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment