Rahul Johri
-
బీసీసీఐ తాత్కాలిక సీఈఓగా హేమంగ్ అమీన్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రోజూవారీ కార్యకలాపాల పర్యవేక్షణకు తాత్కాలిక ప్రాతిపదికన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)ను నియమించింది. హేమంగ్ అమీన్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాహుల్ జోహ్రి ఇటీవలే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సీఈఓ ఎంపిక అనివార్యమైంది. అమీన్ ఐపీఎల్‌కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేశారు. 2019 ఐపీఎల్ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దుచేసి ఆ మొత్తాన్ని ఫుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంక్షేమం కోసం ఇవ్వాలని నిర్ణయించింది ఆయనే. ‘గత రెండేళ్లుగా బీసీసీఐలో హేమంగ్ ఎంతో బాధ్యతతో పని చేస్తున్నారు. బీసీసీఐకి వ్యాపార ఒప్పందాలు కుదర్చడంలో కూడా కీలకపాత్ర పోషించారు. నిజాయితీపరుడు, సమర్థుడైన హేమంగ్ ఈ పదవికి సరైన వ్యక్తి’ అని బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. -
దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ అయిన కార్తీక్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో జెర్సీ వేసుకొని కనిపించాడు. ఈ జట్టు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌ది కావడంతో అతని యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అయిన కార్తీక్ సీపీఎల్‌లో పాల్గొనడం వివాదం రేపింది. ఈ ఫొటోలు బీసీసీఐ కంటబడటంతో సీఈఓ రాహుల్ జోహ్రి అతని కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ కోరారు. -
బీసీసీఐ ‘ఆటలు’ ఇక చెల్లవు!
మా క్రికెటర్లు మా ఇష్టం... ప్రభుత్వం మాకేమైనా నిధులిస్తోందా? మాది స్వతంత్ర సంఘం... నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు... ఏ పరీక్షలైనా మేం సొంతంగానే చేసుకుంటాం తప్ప మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు... గత 13 ఏళ్లుగా డోపింగ్‌కు సంబంధించిన అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైఖరి ఇది. కానీ ఇకపై అలాంటిది కుదరదని తేలిపోయింది. సుదీర్ఘ కాలంగా బీసీసీఐని భారత ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు తమ అధికారాన్ని చూపించింది. భారత క్రికెట్ బోర్డును ఇతర క్రీడా సమాఖ్యల్లాగే గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా క్రికెటర్లు కూడా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు హాజరు కావాల్సిందే. తాజా నిర్ణయం ఏమిటి? బీసీసీఐకి కూడా ఇకపై ఇతర క్రీడలలాగే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)గా గుర్తింపు లభించింది. ఇన్నేళ్ల పాటు మాది స్వతంత్ర సంస్థ, మాకు ఎవరితో సంబం« దం లేదు అంటూ క్రికెట్ బోర్డు చెబుతూ వచ్చింది. ఏం జరుగుతుంది? సమాచార హక్కు చట్టం (ఆర్టీఏ) సహా ప్రభుత్వ నిబంధనలు అన్నీ బీసీసీఐకీ వర్తిస్తాయి. ఆర్థికపరంగా స్వతంత్రంగా ఉన్నా... అన్ని విషయాల్లో జవాబుదారీతనం ఉంటుంది. అయితే శుక్రవారం సమావేశంలో ‘నాడా’పై మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. సమాచార హక్కు విషయంలో చర్చ జరగలేదు. ‘నాడా’ పరిధిలోకి వస్తే ఏమిటి? శుక్రవారం తీసుకున్న అతి కీలక నిర్ణయం ఇదే. ప్రభుత్వం గుర్తించిన సంఘం కాబట్టి డోపింగ్ విషయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సొంతంగా డోపింగ్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం లేదు. ఇప్పటివరకు భారత క్రికెటర్ల శాంపిల్స్‌ను స్వీడన్‌కు చెందిన ఐడీటీఎం సేకరించి జాతీయ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్)కు పంపించేది. ఇకపై ఐడీటీఎంకు ఆ అధికారం ఉండదు. నేరుగా ‘నాడా’నే పరీక్షలు నిర్వహిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా క్రికెటర్లకు ‘నాడా’ పరీక్షలు నిర్వహించవచ్చు. డోపింగ్ విషయంలో బోర్డు సరిగా వ్యవహరించడం లేదా? ఇటీవల యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యవహారం దీనికి సరైన ఉదాహరణ. షా డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడని తెలిసినా అతడిని ఐపీఎల్ ఆడించడంతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలు వాడుకునేందుకూ బీసీసీఐ అవకాశం కల్పించింది. పైగా పాత తేదీలతో అతని సస్పెన్షన్ కాలాన్ని సాధ్యమైనంత తక్కువగా చేసేందుకు ప్రయత్నించింది. బోర్డు సొంతంగా పరీక్షలు నిర్వహిస్తే ఇలాగే ఉంటుందంటూ చెప్పేందుకు ప్రభుత్వానికి చాన్స్ లభించింది. డోపింగ్ పరీక్షల తీరును ప్రశ్నిస్తూ బీసీసీఐకి ఇటీవలే ఘాటుగా లేఖ కూడా రాసింది. ఇదే అదనుగా బోర్డుపై ఒత్తిడి పెంచి తమ దారికి తెచ్చుకుంది. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందా? భారత్‌లో త్వరలో దక్షిణాఫ్రికా ‘ఎ’, మహిళా జట్ల పర్యటనలు ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం మార్చిలోనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ దానిని నిలిపివేసి తమతో చర్చలకు వచ్చేలా ఒత్తిడి తెచ్చింది. ‘నాడా’కు, దీనికి సంబంధం లేదని జోహ్రి చెప్పినా ఇది కూడా ఒక కారణం. ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే మున్ముందు కీలక సిరీస్‌లకు సందర్భంగా ఇది సమస్యగా మారవచ్చని ఒక రకమైన హెచ్చరిక ఇందులో కనిపించింది. ఇప్పటి వరకు బీసీసీఐ విధానం ఏమిటి? 2002 నుంచి డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2006లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)తో ఒప్పందం చేసుకుంది. ఐసీసీ సభ్య దేశాలన్నీ దీనికి అంగీకరించగా... ఒక్క భారత్ మాత్రం ఇందులో చేరేందుకు నిరాకరించింది. మన దేశంలో ఇతర క్రీడలకు సంబంధించి ‘వాడా’ పరిధిలోనే ‘నాడా’ కూడా పని చేస్తుంది. అయితే ‘వాడా’ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ సౌకర్యాలతో తాము సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే సామర్థ్యం తమకు ఉంది కాబట్టి కొత్తగా ‘నాడా’లో చేరాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘నాడా’లో తరచుగా శాంపిల్స్ విషయంలో వివాదాలు రేగాయి కాబట్టి దానిని తాము నమ్మమని తేల్చేసింది. ఈ విషయంలో స్వతంత్రంగా ఉండటానికే మొగ్గు చూపింది. తాజా పరిణామంపై బోర్డు స్పందన ఏమిటి? బీసీసీఐకి అక్టోబరులో ఎన్నికలున్నాయి. ఈలోగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు కార్యవర్గం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అంగీకరించే హక్కు పరిపాలకుల కమిటీ (సీఓఏ), సీఈఓలకు ఎలా ఉంటు ందని ప్రశ్నిస్తున్నారు. అయితే పదవిలో ఎవరు ఉన్నా చట్టాలు గౌరవించాల్సిందేనని, అది ఎవరి చేతుల్లోనూ ఉండదంటూ జోహ్రి ఈ వాదనను కొట్టిపారేశారు. సమావేశంలో ఏం జరిగింది? శుక్రవారం జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఝులనియా, ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్‌లతో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీమ్ సమావేశమయ్యారు. డోపింగ్‌లో ‘నాడా’ పరిధిలోకి వచ్చేందుకు తమకు ఉన్న సందేహాలను బోర్డు ప్రతినిధులు ముందుంచారు. డోపింగ్ టెస్టింగ్ కిట్ల నాణ్యత, పరీక్షలు జరిపేవారి సామర్థ్యం, శాంపిల్ తీసుకునే అధికారుల అర్హతవంటి అం శాలపై తమకు అభ్యంతరం ఉందంటూ జోహ్రి అన్నా రు. అయితే అన్ని అంశాలపై ప్రభుత్వాధికారులు స్పష్ట తనిచ్చిన తర్వాత బీసీసీఐ తరఫున జోహ్రి సంతకం చేశారు. నాణ్యత విషయంలో ఏదైనా అదనపు ఖర్చు చేయాల్సి వస్తే బీసీసీఐ దానిని భరిస్తుంది. ‘ఎవరైనా చట్టాలను గౌరవించాల్సిందే. బీసీసీఐ కూడా అందుకు సిద్ధం. ప్రభుత్వ నిబంధనలను అంగీకరిస్తున్నట్లు మేం సంతకం చేశాం’ అని జోహ్రి వెల్లడించారు. భారత క్రికెటర్ల అభ్యంతరం ఏమిటి? ‘వాడా’లో ఉన్న ఒక ప్రధాన నిబంధన ఇప్పటి వరకు బీసీసీఐ ‘నాడా’ పరిధిలోకి రాకుండా కారణమైంది. ఆటగాళ్లు ఏడాదిలో నాలుగు సార్లు రాబోయే మూడు నెలల్లో మ్యాచ్‌లు లేని సమయంలో తాము ఎక్కడ ఉండబోతున్నామో, ఏ సమయంలో డోపింగ్ పరీక్షకు సిద్ధమవుతారో ముందే వెల్లడించాల్సి ఉంటుంది. దీనిని తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరంగా మన క్రికెటర్లు భావించారు. డోపింగ్ అధికారులకు సమయం ఇచ్చి మూడు సార్లు అందుబాటులో లేకపోతే తీవ్ర చర్యలు ఉంటాయి. విండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఇదే చేసి నిషేధానికి గురయ్యాడు. అయితే భారత్‌లాంటి దేశంలో క్రికెటర్ల కదలికలు అందరికీ తెలియడం మంచి కాదని... సచిన్, ధోనిలాంటి క్రికెటర్లు తమకు ఉగ్రవాదుల బెదిరింపులు కూడా వచ్చాయి కాబట్టి ఇది సాధ్యం కాదని చెప్పేశారు. దాంతో తమ స్టార్ క్రికెటర్ల మాటపై బీసీసీఐ ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ... ఖాళీ సమయంలో కాకుండా మ్యాచ్‌లు జరిగేటప్పుడే డోపింగ్ పరీక్షలు చేస్తామని, ఎవరో ఒకరు కాకుండా ప్రత్యేకంగా నియమించిన అధికారికే ఆటగాళ్ల సమాచారం ఇస్తామని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే మన ఆటగాళ్ల నిర్ణయం మాత్రం మారలేదు. రాహుల్ జోహ్రి, రాధేశ్యామ్ ఝులనియా -
నా జీతం పెంచండి: జోహ్రి
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ జోహ్రి వార్షిక వేతనం రూ. 5 కోట్ల 76 లక్షలు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు అదనం. అయినా కూడా తనకు వేతన సవరణ చేయాల్సిందేనని జోహ్రి పట్టుబడుతున్నారు. మంగళవారం పరిపాలక కమిటీ (సీఓఏ) సమావేశం కానుండటంతో కీలక అంశాలతో పాటు జోహ్రి వేతన సవరణపై కూడా చర్చించే అవకాశముంది. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్... జోహ్రి జీతం పెంపుపై సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇతర సభ్యులు డయానా ఎడుల్జీ, రవి తోడ్గేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని రాయ్ భావిస్తున్నారు. మరోవైపు బీసీసీఐ మాత్రం పెంపుపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. జోహ్రి ద్వారా బోర్డుకు వచ్చిన అదనపు ప్రయోజనం గానీ, కార్యకలాపాల్లో వైవిధ్యం గానీ ఏమీ లేవని పేరు చెప్పేందుకు నిరాకరించిన బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. అలాంటపుడు పెంపు ప్రతిపాదన ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా... ఎలాంటి పెంపుకైనా బోర్డులో నిర్దిష్ట విధానం ఉందని, ఇక ముందు అదే కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. -
విచారణ మొదలు
ముంబై: టీవీ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌ల విచారణ మొదలైంది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి మంగళవారం వారితో ఫోన్లో మాట్లాడారు. అయితే కేవలం క్రికెటర్లు చెప్పింది మాత్రమే ఆయన విన్నారని... టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యం, ఆ వ్యాఖ్యల గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదని సమాచారం. ‘ఇది విచారణ ఆరంభం మాత్రమే కాబట్టి సంక్షిప్తంగానే వారి మాటలు విన్నారు. ఇంకా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తూ రాతపూర్వకంగా ఏం రాశారో కూడా చూడాల్సి ఉంది. బుధవారం ఆయన తన నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అంబుడ్స్‌మన్ నియామకం జరిగితేనే పూర్తి స్థాయి విచారణ ఇక ముందు కొనసాగుతుంది’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. -
మిథాలీ మెయిల్ ఎలా లీకైంది?
ముంబై : జట్టు కోసం ఎంతో చేసిన తనను అడుగడుగున అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్.. బీసీసీఐకి మెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మెయిల్లో జట్టు కోచ్ రమేశ్ పొవార్, సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీలపై మిథాలీ సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ తన కెరీర్‌ని నాశనం చేయాలని, తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని చేసిన ప్రయత్నం చూస్తే దేశానికి ఇన్నేళ్ల పాటు తాను చేసిన సేవలకు ఎలాంటి విలువ లేదేమో అనిపిస్తోందని ఈ హైదరాబాదీ క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. మిథాలీ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లకు పంపిన మెయిల్ మీడియాకు ఎలా లీకైందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీనిపై బీసీసీఐ పెద్దలు గుస్సా అవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బీసీసీఐ తాత్కలిక సెక్రటరీ అమితాబ్ చౌదరి మిథాలీ మెయిల్ మీడియాకు ఎలా లీకైందో వివరిస్తూ సీఈవో రాహుల్ జోహ్రి, సబాకరీమ్లకు మెయిల్ చేశారు. ‘ ఈ రోజు నేను మీడియాలో చూసింది.. లీకుల ద్వారా బయటకు వచ్చిన మిథాలీ రాసిన మెయిల్. కానీ ఈ మెయిల్‌ను ఎవరు లీక్ చేశారో మాత్రం కచ్చితంగా చెప్పలేను. జాతీయ మహిళా సెలక్షన్ కన్వీనర్ సంతకం చేసినట్లుగా ఉన్న ఆ మెయిల్ కాపీని అందుకున్న మీడియా ప్రతినిధులు నాకు పంపించారు. ఈ లీక్స్‌తో సంబంధిత వ్యక్తులు, బీసీసీఐ ప్రతిష్ట దెబ్బతింటుంది. త్వరగా ఈ కేసు వాస్తవాలు తెలియజేయండి’ అని పేర్కొన్నారు. -
వివరణ కోరనున్న సీఓఏ
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో మిథాలీ రాజ్‌ను ఆడించకుండా తప్పించిన వివాదంపై వివరణ కోరాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. భారత జట్టు స్వదేశం తిరిగొచ్చిన తర్వాత దీనికి సంబంధించి మిథాలీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పొవార్, మేనేజర్ తృప్తి, సెలక్టర్ సుధ షాలతో సీఓఏ బృందం విడివిడిగా మాట్లాడనుంది. మరోవైపు ప్రపంచ కప్ సమయంలో మిథాలీ ఫిట్నెస్ ఎలా ఉందనే అంశంపై కూడా సీఓఏ వివరాలు కోరింది. దీనిపై జట్టు మేనేజర్ తృప్తి సోమవారం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు మిథాలీరాజ్‌ను తప్పించే క్రమంలో మ్యాచ్‌కు ముందు జరిగిన సమావేశం గురించి మీడియాలో రావడంపై కూడా సీఓఏ అసహనం వ్యక్తం చేసింది. నన్నూ తీసేశారు: గంగూలీ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో కూడా తుది జట్టు నుంచి కెప్టెన్లను తప్పించడం కొత్తేమీ కాదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గతంలో తనకూ ఈ అనుభవం ఎదురైంది కాబట్టి మిథాలీ వ్యవహారం ఆశ్చర్యపరచలేదని అతను అన్నాడు. ‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను కూడా ఇలా ఇంటికి పంపించారు. అయినా మిథాలీని తప్పించడం కంటే భారత్ ఓడటమే నన్ను ఎక్కువగా బాధించింది’ అని గంగూలీ వ్యాఖానించాడు. -
జోహ్రికి క్లీన్చిట్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమైనవని రుజువైంది. క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నియమించిన త్రిసభ్య ప్యానల్ జోహ్రికి క్లీన్చిట్ ఇచ్చింది. జోహ్రి ఎలాంటి తప్పు చేయలేదని, అతను బీసీసీఐ సీఈవోగా కొనసాగేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్యానల్ తేల్చిచెప్పింది. ఓ మహిళ ఈ మెయిల్ ఆధారంగా ఆరోపణలు చేయడంతో... సీఓఏ ఈ విషయంపై విచారణ కోసం ముగ్గురు సభ్యుల ప్యానల్‌ను నియమించింది. గత నెల 15న ఏర్పాటైన ప్యానల్ బుధవారం తుది నివేదికను సీఓఏకు సమర్పించింది. దీని ప్రతిని సుప్రీంకోర్టుకు అందజేసింది. ‘ఆరోపణలు చేసిన వారు తగిన ఆధారాలను చూపలేకపోయారు. ఆ ఆరోపణలు కూడా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. లైంగిక వేధింపులు ఎదురైన చోటును కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు’ అని త్రిసభ్య కమిటీ అధ్యక్షుడు రాకేశ్ శర్మ తెలిపారు. ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ ఆరోపణల నుంచి బయటపడతానని నాకు ముందే తెలుసు’ అని జోహ్రి అన్నారు. ఈ తీర్పుపై సీఓఏలో ఉన్న ఇద్దరు సభ్యులు భిన్నంగా స్పందించారు. సీఈవోగా జోహ్రి కొనసాగాలని చైర్మన్ వినోద్ రాయ్ కోరగా... డయానా ఎడుల్జీ మాత్రం ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
సెలవుపై బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి
ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ జోహ్రి సెలవుపై వెళ్లారు. సోషల్ మీడియాలో మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో గతవారం ఓ మహిళ జోహ్రి లైంగికంగా వేధించినట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన బోర్డు పాలక కమిటీ (సీఓఏ) వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని జోహ్రికి నోటీసులిచ్చింది. పేరు బయటపెట్టని ఆ మహిళ ఆరోపణలపై రాహుల్ జోహ్రి బహిరంగంగా స్పందించలేదు. ఖండించనూ లేదు. అయితే వారం రోజులుగా బీసీసీఐ కార్యాలయానికి ఆయన రావడం లేదు. సింగపూర్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశానికి వెళ్లడం లేదు. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే ఆయన సీఈఓగా కొనసాగే అవకాశాలు లేవనే అర్థమవుతోంది. -
జోహ్రి... వివరణ ఇవ్వండి: సీఓఏ
న్యూఢిల్లీ: సినీ, పాత్రికేయ రంగాలను కుదిపేసిన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)నీ తాకింది. ఏకంగా బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిపైనే ఆరోపణలు వచ్చాయి. ఆయన 2001 నుంచి 2016 మధ్య డిస్కవరీ చానెల్లో పని చేస్తున్నప్పుడు తనను లైంగికంగా వేధించారంటూ మాజీ సహోద్యోగిని ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు, స్క్రీన్ షాట్లను జత చేస్తూ ‘రాహుల్ జోహ్రి... నీ సమయం ముగిసింది’ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. దీంతో జోహ్రి వివరణ ఇవ్వాలని క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) కోరింది. ఆయన వారం రోజులు గడువు అడిగారని, సమాధానం వచ్చాక తదుపరి చర్యలపై ఆలోచిస్తామని సీఓఏ పేర్కొంది. -
#మీటూ: బీసీసీఐ బాస్‌పై లైంగిక ఆరోపణలు
ముంబై : మీటూ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటి వరకు సినీ, మీడియా రంగాల్లోని ప్రముఖుల చీకటి వ్యవహారాలు బయటపడగా.. ఇప్పుడు ఆ సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. రెండు రోజుల క్రితమే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, స్టార్ బౌలర్ లసిత్ మలింగాలు తమతో అసభ్యంగా ప్రవర్తించారని బాధిత మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత క్రికెట్ నియంత్ర మండలి (బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రి చీకటి కోణాన్ని ఓ మహిళా జర్నలిస్టు బయటపెట్టింది. తనను రాహుల్ జోహ్రి లైంగికంగా వేధించాడని, మంచిగా నటిస్తూ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. రాహుల్ తన మాజీ సహుద్యోగని, ఓ రోజు తమ జాబ్‌కు సంబంధించిన విషయాలకు గురించి చర్చించడానికి వెళ్తే.. దాన్ని అతను అవకాశంగా తీసుకున్నాడని ఆరోపించింది. తనతో మంచిగా నటిస్తూ ఓ రోజు అతని భార్య, పిల్లలు లేని సమయంలో తనింటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని పేర్కొంది. అతని చర్యతో తనలో తను ఎంతో కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాహుల్ జోహ్రి బీసీసీఐ సీఈవో కాకముందు డిస్కవరీ చానల్లో పనిచేశారు. had emails sent about a BUNCH of head honchos in media. survivor has asked to not put out all the names. Rahul Johari, your #timesup #metoo pic.twitter.com/L78Ihkk1u0 — hk {on a hiatus} (@PedestrianPoet) October 12, 2018 -
కోచ్‌గా ఎవరు కావాలో చెప్పండి..
ఆంటిగ్వా: మరొకొద్ది రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ రాబోతున్న సంగతి తెలిసిందే. జూలై 10వ తేదీ నాటికి టీమిండియా ప్రధాన కోచ్‌ను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడైన సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. భారత జట్టుకు కోచ్ గా పని చేసిన అనిల్ కుంబ్లే ఇటీవల ఆకస్మికంగా తప్పుకున్న నేపథ్యంలో కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తోంది. భారత్ కోచ్ కోసం రెండుసార్లు దరఖాస్తులు ఆహ్వానించి మరీ తగిన అభ్యర్ధి కోసం అన్వేషణ ప్రారంభించింది. దానిలో భాగంగా కోచ్‌గా ఎవరైతే బాగుండుందో ఆటగాళ్ల సలహా మేరకే ఎంపిక చేస్తే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. టీమిండియా కోచ్ ఎంపికపై తమను సంప్రదిస్తే మాత్రం జట్టు తరఫున సభ్యులంతా అభిప్రాయం చెబుతామని కోహ్లి పేర్కొన్నాడు. ఈ విషయంలో తమందరిదీ ఒకే మాట ఉంటుందని కోహ్లి చెప్పాడు. కోచ్ ఎంపికపై బహిరంగ చర్చ అనవసరమని అతను వ్యాఖ్యానించాడు.ఈ మేరకు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) రాహుల్ జోహ్రి జమైకాకు వెళ్లనున్నారు. అక్కడ విరాట్ కోహ్లితో పాటు ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనున్నారు. గురువారం సాయంత్రం భారత క్రికెటర్లతో సమావేశమై కోచ్ ఎంపికపై అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇప్పటికే కోచ్ అభ్యర్ధిగా రవిశాస్త్రి ముందు వరుసలో ఉన్నాడు. గతంలో టీమిండియా డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం రవిశాస్త్రికి లాభించనుంది. మరొకవైపు కోహ్లి కూడా రవిశాస్త్రి వైపే మొగ్గుచూపుతున్నారు. కాగా, కోచ్ పదవి కోసం రవిశాస్త్రికి వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీల నుంచి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కోచ్ అభ్యర్ధుల జాబితాను టీమిండియా ఆటగాళ్ల ముందుంచి అందుకు తగిన వ్యక్తి కోసం ఫీడ్ బ్యాక్‌ను తీసుకోనున్నారు. -
ఇప్పుడు ‘సూట్’ కాదు
బీసీసీఐ సీఈవో రాహుల్ జొహ్రి ఇటాలియన్ సూట్ల ప్రతిపాదన తిరస్కరణ ముంబై: భారత క్రికెటర్లకు ఖరీదైన ఇటాలియన్ సూట్లను తెప్పించాలనే బీసీసీఐ సీఈవో రాహుల్ జొహ్రి ప్రతిపాదనకు చుక్కెదురైంది. ఒక్కోటి రూ.2.5 లక్షల విలువ చేసే వీటి కొనుగోలును బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. బీసీసీఐది కార్పోరెట్ కల్చర్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఆటగాళ్లతో పాటు బోర్డు ఉన్నతాధికారుల కోసమని 50 కొత్త ఇటాలియన్ డిజైన్ సూట్లను తెప్పించాలని ఠాకూర్‌తో పాటు కార్యదర్శి అజయ్ షిర్కే, ఇతర సభ్యులకు జొహ్రి నవంబర్ 19న ఈ-మెయిల్ చేశారు. బీసీసీఐ చేసే ఖర్చుల విషయంలోనూ సుప్రీం కోర్టు పర్యవేక్షణ ఉండడం కూడా ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లడానికి ఓ కారణం. బోర్డుతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాలు లోధా కమిటీ కొత్త ప్రతిపాదనలను అమలు చేసేవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వీల్లేదు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం ఎలాంటి కొత్త ఒప్పందాలను చేసుకోలేము’ అని షిర్కే ఆయనకు సమాధానమిచ్చారు. -
బీసీసీఐ సీఈఓగా రాహుల్ జోహ్రి
ముంబై: బీసీసీఐ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా మీడియా ప్రొఫెషనల్ రాహుల్ జోహ్రి నియమితులయ్యారు. బోర్డులో జవాబుదారితనం పెరగాలంటే నాన్ క్రికెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఓ వ్యక్తి ఉండాలని జస్టిస్ లోథా కమిటీ చేసిన ప్రతిపాదనల్లో భాగంగా బీసీసీఐ ఈ నియామకం చేపట్టింది. మీడియా పరిశ్రమలో 20 ఏళ్ల అనుభవం ఉన్న జోహ్రి... డిస్కవరి నెట్‌వర్క్స్‌లో 15 ఏళ్లుగా వివిధ హోదాలలో పని చేశారు. ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించడంతో పాటు గత ఎనిమిదేళ్లుగా దక్షిణాసియా విభాగానికి జనరల్ మేనేజర్‌గా పని చేశారు. జూన్ 1న కొత్త బాధ్యతలు స్వీకరించే జోహ్రి... తన నివేదికలను బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు అందజేస్తారని బీసీసీఐ వెల్లడించింది. సీఈఓగా తీసుకునే వ్యక్తితో ఐదేళ్ల పాటు ఒప్పందం ఉండాలని లోథా కమిటీ సూచించినా... బోర్డు మాత్రం జోహ్రి పదవీకాలం ఎంతనేది చెప్పలేదు. గతంలో బీసీసీఐ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏఓ)గా, క్రికెట్ అభివృద్ధి జనరల్ మేనేజర్‌గా వ్యవహరించిన రత్నాకర్ శెట్టి.. ప్రస్తుతం ఐపీఎల్ సీఈఓగా పని చేస్తున్నారు. -
బీసీసీఐకి కొత్త సీఈవో
ముంబై: బీసీసీఐ నూతన సీఈవోగా రాహుల్ జోహ్రీని నియమిస్తున్నట్టు భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం రాహుల్ డిస్కవరీ నెట్ వర్క్స్ ఏసియా, ఫసిఫక్ కి ఉపాధ్యక్షునిగా, జనరల్ మేనేజర్ ఆఫ్ సౌత్ ఏషియాగా సేవలందిస్తున్నారు. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మాట్లాడుతూ.. రాహుల్ కి ఉన్న అపారమైన అనుభవం బీసీసీఐకి ఎంతగానో ఉపమోగపడుతుందని అన్నారు. రాహుల్ జోహ్రీ నియామకం పట్ల ఎంతో గర్వంగా ఉన్నమని ఆయన పేర్కొన్నారు. రాహుల్ ను సాదరంగా బోర్డులోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. బీసీసీఐ సీఈవోగా నియామకంపై రాహుల్ స్పందిస్తూ.. ఇది తనకు లభించిన గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషకరమన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బోర్డు అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.