
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ జోహ్రి వార్షిక వేతనం రూ. 5 కోట్ల 76 లక్షలు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు అదనం. అయినా కూడా తనకు వేతన సవరణ చేయాల్సిందేనని జోహ్రి పట్టుబడుతున్నారు. మంగళవారం పరిపాలక కమిటీ (సీఓఏ) సమావేశం కానుండటంతో కీలక అంశాలతో పాటు జోహ్రి వేతన సవరణపై కూడా చర్చించే అవకాశముంది. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్... జోహ్రి జీతం పెంపుపై సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.
అయితే ఇతర సభ్యులు డయానా ఎడుల్జీ, రవి తోడ్గేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని రాయ్ భావిస్తున్నారు. మరోవైపు బీసీసీఐ మాత్రం పెంపుపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. జోహ్రి ద్వారా బోర్డుకు వచ్చిన అదనపు ప్రయోజనం గానీ, కార్యకలాపాల్లో వైవిధ్యం గానీ ఏమీ లేవని పేరు చెప్పేందుకు నిరాకరించిన బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. అలాంటపుడు పెంపు ప్రతిపాదన ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా... ఎలాంటి పెంపుకైనా బోర్డులో నిర్దిష్ట విధానం ఉందని, ఇక ముందు అదే కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment