
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమైనవని రుజువైంది. క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నియమించిన త్రిసభ్య ప్యానల్ జోహ్రికి క్లీన్‌చిట్ ఇచ్చింది. జోహ్రి ఎలాంటి తప్పు చేయలేదని, అతను బీసీసీఐ సీఈవోగా కొనసాగేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్యానల్ తేల్చిచెప్పింది. ఓ మహిళ ఈ మెయిల్ ఆధారంగా ఆరోపణలు చేయడంతో... సీఓఏ ఈ విషయంపై విచారణ కోసం ముగ్గురు సభ్యుల ప్యానల్‌ను నియమించింది.
గత నెల 15న ఏర్పాటైన ప్యానల్ బుధవారం తుది నివేదికను సీఓఏకు సమర్పించింది. దీని ప్రతిని సుప్రీంకోర్టుకు అందజేసింది. ‘ఆరోపణలు చేసిన వారు తగిన ఆధారాలను చూపలేకపోయారు. ఆ ఆరోపణలు కూడా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. లైంగిక వేధింపులు ఎదురైన చోటును కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు’ అని త్రిసభ్య కమిటీ అధ్యక్షుడు రాకేశ్ శర్మ తెలిపారు. ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ ఆరోపణల నుంచి బయటపడతానని నాకు ముందే తెలుసు’ అని జోహ్రి అన్నారు. ఈ తీర్పుపై సీఓఏలో ఉన్న ఇద్దరు సభ్యులు భిన్నంగా స్పందించారు. సీఈవోగా జోహ్రి కొనసాగాలని చైర్మన్ వినోద్ రాయ్ కోరగా... డయానా ఎడుల్జీ మాత్రం ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment