
సీమా పునియాకు కోపం వచ్చింది
న్యూఢిల్లీ: రియో డిజనిరోలో జరిగే ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిన కొద్ది గంటల్లోనే డిస్కస్ త్రో ప్రముఖ క్రీడాకారిణి, గత ఒలంపిక్ విజేత సీమా అంతిల్ పునియా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో శిక్షణ మెళకువలు నేర్చుకునేందుకు తనకు నిధులు అందించడంలో ఆ శాఖ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని చెప్పింది. డాక్యుమెంటేషన్ సరిగా లేదని మరిన్ని పత్రాలు జత చేయాలని, చూసే అధికారులు లేరని పలుసాకులతో తనను పలుమార్లు తిప్పారని చెప్పింది.
క్రీడాకారులంటే ఆ శాఖకు తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఆరోపించింది. తాను 2015 మధ్యలో తనకు శిక్షణకోసం నిధులు మంజూరు చేయాలని కేంద్ర క్రీడామంత్రిత్వశాఖను అభ్యర్థించానని, వారు నిధులు మంజూరు చేసి ఉంటే తాను అప్పుడు అర్హత సాధించే దానినని చెప్పింది. 2008లో ఆమె ఒలింపిక్ చాంపియన్గా నిలిచింది. తాజాగా ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించే క్రమంలో భాగంగా విదేశీ కోచ్కు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని నాలుగుసార్లు గుర్తు చేసినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొంది. చివరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు అధికారి దిలీప్ సింగ్ తనకు సహాయం చేసి నిధులు ఇప్పించారని, ఆయన తన ధన్యవాదాలు అని చెప్పారు.