కోర్టు వివాదాలు పరిష్కరించుకోవాలి
ప్రభుత్వ విభాగాలకు ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రభుత్వ విభాగాలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు కలసి మెలసి విశాల ధృక్పథంతో పనిచేయాలన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ప్రభుత్వ విభాగాలు తీవ్ర ఇబ్బందుల మధ్యే పనిచేస్తున్నాయి. శాఖకు.. శాఖకు మధ్య సమన్వయం అనేదే కనిపించదు. అందువల్లే ఒక విభాగం ఒక నిర్ధిష్టమైన పథకం గురించి ఆలోచన చేస్తుంటే.. మరో విభాగం దీనికి పూర్తి విరుద్ధమైన ఆలోచన చేస్తుంటుంది’’అని ప్రధాని చెప్పారు. ‘‘ప్రభుత్వ విభాగాలు తమ మధ్య వివాదాల పరిష్కారానికి ఒకదానిపై మరొకటి కోర్టులను ఆశ్రయిస్తుంటాయి.
ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ఇరు పక్షాలు కూర్చుని చర్చించుకోవాలి. దీనికి విశాల దృక్ఫథం అవసరం’’అని పేర్కొన్నారు. శుక్రవారం గుజరాత్ కచ్‌లోని రణ్‌లో కేంద్ర, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా మంత్రిత్వ శాఖల సదస్సు జరిగింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోదని, వ్యవస్థాగతమైన ఏర్పాట్లతోనే పోత్సాహం లభిస్తుందన్నారు. ఈ నెల 29న ‘మన్‌కీబాత్’లో పోటీ పరీక్షలపై చర్చించనున్నట్టు ప్రధాని ట్వీట్ చేశారు.