నాకు పద్మభూషణ్ ఎందుకివ్వరు?
ఒలింపిక్స్లో కాంస్యపతకం సాధించినా.. దేశం తరఫున మంచి ప్రదర్శనలు చూపించినా తన పేరును పద్మభూషణ్ అవార్డుకు ఎందుకు పంపలేదని సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత సంవత్సరం ఆగస్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సైనా పేరును క్రీడా మంత్రిత్వశాఖకు పంపింది. కానీ, క్రీడా శాఖ మాత్రం సైనా పేరును పక్కన పెట్టి.. ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును హోం శాఖకు ప్రతిపాదించింది.
దీనిపైనే సైనా స్పందించింది. ''సుశీల్ కుమార్ పేరును ప్రత్యేకంగా పద్మ అవార్డుకు పంపినట్లు తెలిసింద.ఇ నా పేరు మాత్రం పంపలేదు. రెండు పద్మ అవార్డుల మధ్య రెండేళ్ల తేడా ఉండాలన్నది మంత్రిత్వశాఖ నిబంధన అని చెబుతున్నారు. అయినా అతడి పేరు పంపారు గానీ, నా పేరు మాత్రం పంపలేదు. నాకు ఐదేళ్ల తేడా ఉన్నా పంపనందుకు చాలా బాధగా ఉంది" అని సైనా చెప్పింది. గత సంవత్సరం కూడా ఇవే కారణాలతో తన దరఖాస్తు తిరస్కరించారని.. ఈసారి దరఖాస్తు చేసినా ఫలితం లేదని అంటోంది. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడానని, వాళ్లు మాత్రం ఇప్పటికే సుశీల్ పేరు వెళ్లిపోయినట్లు చెప్పారని సైనా తెలిపింది. తామిద్దరికీ ఒలింపిక్స్లో పతకాలు వచ్చాయని, అలాంటప్పుడు తనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించింది. ఆమెకు ఇంతకుముందు 2010లో రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. 2009లో అర్జున అవార్డు కూడా వచ్చింది.