నా కెరీర్ ఏమవుతుందో : సుశీల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తనకు అవకాశం కల్పించక పోవడంపై భారత రెజ్లర్ సుశీల్ కుమార్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ లో భారత్కు పతకాలు అందించిన ఏకైక ప్లేయర్ సుశీల్. రియో వివాదం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు. రియోలో పాల్గొనక పోవడం తన కెరీర్ పై ఎంతో ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. రియో ఒలింపిక్స్ కోసం ఎంతగానో శ్రమించానని చెప్పాడు. వరుసగా మూడో ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి తన వంతుగా మూడో పతకం సాధించాలన్న తన ఆకాంక్షను నెరవేరలేదని వాపోయాడు.
దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) తన పేరును ప్రతిపాదించడంపై హర్షం వ్యక్తం చేశాడు. డబ్ల్యూఎఫ్ఐ ఇప్పటికైనా తన విజయాలను గుర్తించిందన్నాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ డోపీగా తేలడంతో లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ దత్ రజతానికి అప్ డేట్ అవడంపై సుశీల్ స్పందించాడు. యోగేశ్వర్ కు అభినందనలు తెలిపాడు. ఆ పతకం కుదుకోవ్ కుటుంబం వద్ద ఉంటడమే కరెక్ట్ అని చెప్పి యోగేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నాడని ప్రశంసించాడు. 74 కేజీల విభాగంలో భారత్ నుంచి నర్సింగ్ యాదవ్ ను రియోకు పంపించగా నాటకీయ రీతిలో డోపింగ్ కారణాలతో అవకాశం ఇవ్వకపోగా, నిషేధం విధించిన విషయం తెలిసిందే.