న్యూఢిల్లీ: దేశానికి ఖ్యాతితెచ్చే క్రీడాకారులను తయారుచేసే భారత కోచ్‌లకు కేంద్ర క్రీడా శాఖ శుభ వార్త చెప్పింది. భారతీయ కోచ్‌ల జీతాలను గరిష్టంగా రూ. 2 లక్షలకే పరిమితం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. స్వదేశీ కోచ్‌లు మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేలా ఈ చర్య వారిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. కోచింగ్ వైపు భారత మాజీ ఆటగాళ్లను కూడా ఆకర్షించడమే తమ లక్ష్యమని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
‘చాలా మంది భారత కోచ్‌లు గొప్ప ఫలితాలను అందిస్తున్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాల్సిందే. మేటి అథ్లెట్లను తయారు చేసేందుకు అత్యుత్తమ కోచ్‌లు కావాలనే మేం కోరుకుంటాం. అలాంటప్పుడు వారికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై పరిమితి విధించకూడదని భావిస్తున్నాం. ఇకనుంచి నాలుగేళ్లకుగానూ కోచ్‌లతో కాంట్రాక్టు చేసుకుంటాం’ అని రిజిజు వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ అథ్లెట్లు కోచింగ్ వైపు మొగ్గుచూపితే దేశంలో క్రీడల అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment