Indian coach
-
రూ. 2 లక్షల పరిమితి తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి ఖ్యాతితెచ్చే క్రీడాకారులను తయారుచేసే భారత కోచ్‌లకు కేంద్ర క్రీడా శాఖ శుభ వార్త చెప్పింది. భారతీయ కోచ్‌ల జీతాలను గరిష్టంగా రూ. 2 లక్షలకే పరిమితం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. స్వదేశీ కోచ్‌లు మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేలా ఈ చర్య వారిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. కోచింగ్ వైపు భారత మాజీ ఆటగాళ్లను కూడా ఆకర్షించడమే తమ లక్ష్యమని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘చాలా మంది భారత కోచ్‌లు గొప్ప ఫలితాలను అందిస్తున్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాల్సిందే. మేటి అథ్లెట్లను తయారు చేసేందుకు అత్యుత్తమ కోచ్‌లు కావాలనే మేం కోరుకుంటాం. అలాంటప్పుడు వారికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై పరిమితి విధించకూడదని భావిస్తున్నాం. ఇకనుంచి నాలుగేళ్లకుగానూ కోచ్‌లతో కాంట్రాక్టు చేసుకుంటాం’ అని రిజిజు వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ అథ్లెట్లు కోచింగ్ వైపు మొగ్గుచూపితే దేశంలో క్రీడల అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. -
మూర్ఖులు అర్థం చేసుకోలేరు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తనకు ఎంతో గౌరవముందని భారత కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇది అర్థం చేసుకోలేని వారంతా మూర్ఖులు అని, వారి అభిప్రాయాన్ని తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. తామిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ సోషల్ మీడియా, మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ‘శాస్త్రి–గంగూలీకి చెందిన ఏ విషయమైనా మీడియాకు మాంచి మసాలాతో కూడిన భేల్పూరి, చాట్‌లాంటి వార్తలా అనిపిస్తోంది. మాపై వచ్చే ఊహాగానాలకు మీడియా విపరీతంగా స్పందిస్తూ ఉంటుంది. పని పాట లేనివారే సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేస్తారు. కానీ ఇందులో వాస్తవం లేదు.గంగూలీ క్రికెట్‌కు ఎంతో చేశాడు. అతనంటే నాకు చాలా గౌరవం. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్ గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో గంగూలీ మళ్లీ భారత క్రికెట్లో పునరుజ్జీవం నింపాడు. మా ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉంది. ఈ విషయం అర్థం చేసుకోలేని మూర్ఖుల గురించి నేను ఆలోచించను’ అని రవిశాస్త్రి వివరించారు. వారం క్రితం గంగూలీ కూడా ఇదే అంశంపై స్పష్టతనిచ్చాడు. ఊహాగానాలు, కల్పిత వార్తలు నమ్మొద్దని తెలిపాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా ఎన్నికవడం పట్ల రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశారు. భారత కోచ్ పదవి ఒత్తిడితో కూడినదని అన్నారు. ప్రారంభంలో భారత జట్టు నంబర్‌వన్‌గా ఎదుగుతుందని తానంటే అందరూ వింతగా చూశారని, కానీ ఇప్పుడు అదే నిజమైంది అని కోచ్‌గా తన పనితీరుని విమర్శిస్తున్న వారికి సమాధానంగా చెప్పారు. టి20 ప్రపంచకప్‌లో రిషభ్ పంత్‌తో పాటు కేఎల్ రాహుల్‌ను కూడా వికెట్ కీపర్‌గా పరీక్షిస్తామని అన్నారు. -
పృథ్వీలో ఆ ముగ్గురు: రవిశాస్త్రి
సాక్షి, హైదరాబాద్: ఓపెనింగ్ సంచలనం పృథ్వీ షాలో దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్, సెహ్వాగ్, లారాలు కనిపిస్తున్నారని భారత కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘పృథ్వీ క్రికెట్ ఆడేందుకే పుట్టినట్లున్నాడు. ముంబైలోని మైదానాల్లో ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అతనిలో కష్టపడాలన్న తపన కనిపిస్తోంది. అతను ఆడే షాట్లలో సచిన్... ఒక్కోసారి సెహ్వాగ్, లారాలు కనిపిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే వచ్చిన కిక్కును తలకెక్కించుకోకుండా ఇలాగే కష్టపడితే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. టెస్టుల్లో 10 వికెట్లు తీసిన జాబితాలో దిగ్గజాలైన కపిల్ దేవ్, శ్రీనాథ్‌ల సరసన నిలిచిన ఉమేశ్ యాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘జట్టుకు తాను విలువైన బౌలర్‌నని ఉమేశ్ తాజా ప్రదర్శనతో చాటుకున్నాడు. ఓపెనర్ రాహుల్ టచ్‌లోకి వచ్చాడు. అతను ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మన్. కొన్నిసార్లు బాగా కష్టపడతాడు. ఈ మ్యాచ్‌లో నాకదే కనిపించింది. ఈ వరుసలో తాజాగా రిషభ్ పంత్ వచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు’ అని రవిశాస్త్రి అన్నాడు. వృద్ధిమాన్ సాహాకు పంత్ నుంచి ఏర్పడిన పోటీపై స్పందిస్తూ... ఇవన్నీ సాను కూలాంశాలన్నాడు. ఒకరు లేకపోతే ఇంకొకరు సత్తా చాటుతున్నారని చెప్పాడు. శార్దుల్ ఓ సెషన్లో దూరమైతే ఉమేశ్ ఆ స్థానాన్నీ భర్తీ చేశాడని, పది వికెట్లు తీయగలిగాడని దీంతో జట్టు ఏ ఒక్కరిమీద ఆధారపడలేదనే విషయం స్పష్టమవుతుందని కోచ్ వివరించాడు. -
'ద్రవిడ్, జహీర్ లకే నా ఓటు'
మాజీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ను భారత క్రికెట్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీలోని ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ద్రవిడ్ ను కోచ్ గా నియమించాలని పేర్కొన్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందన్నారు. ఇరువురి అనుభవంతో భారత క్రికెట్ జట్టుకు ఎంతో లాభం జరుగుతుందనేది తన వ్యక్తి అభిప్రాయం మాత్రమేనని బజ్జీ స్పష్టం చేశాడు కానీ విరాట్ కొహ్లీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ పేరును రికమెండ్ చేశారు కదా అని ప్రశ్నించగా అతనికి కూడా కోచ్ గా ఉండేందుకు అన్ని అర్హతలున్నాయని బజ్జీ తెలిపాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీపై బజ్జీ ప్రశంసలు కురిపించారు. కోహ్లి ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందచదగ్గ విషయమన్నాడు. అతనిలో గెలవాలన్న తపన ముచ్చటగొలుపు తుందన్నాడు. ఇండియాలో జరుగుతున్న టీ20 మ్యచ్ ల వల్ల ప్రపంచ టీ20 కి ఇబ్బందులుంటాయనే వార్తలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, ఆర్సీబీలు ప్లే ఆఫ్ చేరుతాయని హర్భజన్ జోస్యం చెప్పాడు.