న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తనకు ఎంతో గౌరవముందని భారత కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇది అర్థం చేసుకోలేని వారంతా మూర్ఖులు అని, వారి అభిప్రాయాన్ని తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. తామిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ సోషల్ మీడియా, మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ‘శాస్త్రి–గంగూలీకి చెందిన ఏ విషయమైనా మీడియాకు మాంచి మసాలాతో కూడిన భేల్‌పూరి, చాట్‌లాంటి వార్తలా అనిపిస్తోంది.
మాపై వచ్చే ఊహాగానాలకు మీడియా విపరీతంగా స్పందిస్తూ ఉంటుంది. పని పాట లేనివారే సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేస్తారు. కానీ ఇందులో వాస్తవం లేదు.గంగూలీ క్రికెట్‌కు ఎంతో చేశాడు. అతనంటే నాకు చాలా గౌరవం. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్ గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో గంగూలీ మళ్లీ భారత క్రికెట్‌లో పునరుజ్జీవం నింపాడు. మా ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉంది. ఈ విషయం అర్థం చేసుకోలేని మూర్ఖుల గురించి నేను ఆలోచించను’ అని రవిశాస్త్రి వివరించారు.
వారం క్రితం గంగూలీ కూడా ఇదే అంశంపై స్పష్టతనిచ్చాడు. ఊహాగానాలు, కల్పిత వార్తలు నమ్మొద్దని తెలిపాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా ఎన్నికవడం పట్ల రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశారు. భారత కోచ్ పదవి ఒత్తిడితో కూడినదని అన్నారు. ప్రారంభంలో భారత జట్టు నంబర్‌వన్‌గా ఎదుగుతుందని తానంటే అందరూ వింతగా చూశారని, కానీ ఇప్పుడు అదే నిజమైంది అని కోచ్‌గా తన పనితీరుని విమర్శిస్తున్న వారికి సమాధానంగా చెప్పారు. టి20 ప్రపంచకప్‌లో రిషభ్ పంత్‌తో పాటు కేఎల్ రాహుల్‌ను కూడా వికెట్ కీపర్‌గా పరీక్షిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment