మాకూ క్రికెట్ ఆడటం వచ్చు | about to come to play cricket | Sakshi
Sakshi News home page

మాకూ క్రికెట్ ఆడటం వచ్చు

Published Fri, Oct 30 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

మాకూ క్రికెట్  ఆడటం వచ్చు

మాకూ క్రికెట్ ఆడటం వచ్చు

దానిని నిరూపించగలిగాం
స్ఫూర్తిగా నిలవడం ఆనందమే
తగినన్ని అవకాశాలు దక్కడం లేదు
 ‘సాక్షి’తో పర్వేజ్ రసూల్

 
కశ్మీర్‌లో 1993లో ఒక దర్గాకు సంబంధించి బిజ్ బెహరా గ్రామంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 51 మంది మరణించారు. అప్పుడు పర్వేజ్ రసూల్ వయసు నాలుగేళ్లు... అతను పెరిగిన వాతావరణం అలాంటిది. 2003లో అండర్-14  క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళితే అతని జట్టులో అందరూ కలిసి చేసిన పరుగులు కేవలం 20.  వాళ్లు ఆట నేర్చుకోవడానికి ఉన్న సౌకర్యాలు అలాంటివి.

2013లో ఐపీఎల్... 2014లో భారత జట్టు తరఫున అరంగేట్రం... కశ్మీర్ లాంటి రాష్ట్రం నుంచి ఓ క్రికెటర్ భారత జట్టుకు ఆడతాడని కలలో కూడా ఊహించలేని అద్భుతాన్ని సుసాధ్యం చేశాడు పర్వేజ్ రసూల్.  నిత్యం తుపాకుల మోతలో... బంద్‌లు... అల్లకల్లోల పరిస్థితులు... ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఓ కుర్రాడు భారత క్రికెటర్‌గా ఎదగాలంటే ఎంతో  అంకితభావం ఉండాలి. ఆ ఘనత సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు పర్వేజ్. ఇప్పటివరకూ  ఒక్క వన్డేకే పరిమితమైనా... భవిష్యత్‌లో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారతానని అంటున్న రసూల్ చెప్పిన విశేషాలు అతడి మాటల్లోనే...
 
 కశ్మీర్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడం
 దేశంలోని ఇతర క్రికెటర్లతో పోలిస్తే నేను రెట్టింపు శ్రమించాల్సి వచ్చింది. సరైన మైదానాలు, పిచ్‌లు లేవు. నేర్పించేందుకు తగిన కోచ్‌లు, మార్గదర్శనం చేసేందుకు మాజీ క్రికెటర్లు ఎవరూ లేరు. మంచు కురిస్తే, వాన వస్తే ప్రాక్టీస్ బంద్. వీటికి తోడు కర్ఫ్యూలు. చాలా మంది ఆసక్తి ఉన్నవారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. కానీ ‘కశ్మీరీలు కూడా క్రికెట్ ఆడగలరు’ అని నిరూపించేందుకు నేను పట్టుదలగా శ్రమించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట ఆపవద్దని మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను నడిపించింది. నా నేపథ్యాన్ని బట్టి చూస్తే ఇప్పుడు నేను ఉన్న స్థితి మా కశ్మీర్‌లో అందరికీ పెద్ద ఘనతగానే కనిపిస్తోంది. నేరుగా నా పాత్ర లేకపోయినా చాలా మంది చిన్నారులు దీనిని స్ఫూర్తిగా తీసుకొని సీరియస్‌గా క్రికెట్‌పై దృష్టి పెడుతున్నారు. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది.

అంతర్జాతీయ కెరీర్
ఇప్పటి వరకు ఒక్క వన్డేలోనే ఆడే అవకాశం లభించింది. దీంతో ఏం నిరూపించుకోగలను? అంతకు ముందు జింబాబ్వే సిరీస్‌కు వెళ్లినా మ్యాచ్ దక్కలేదు. నాలాంటి కొత్త ఆటగాళ్లకు మరీ ఒకటి రెండు మ్యాచ్‌లతోనే సరిపెట్టకుండా చెప్పుకోదగ్గ మ్యాచ్‌లు ఇస్తే బాగుంటుంది. ఇండియా ‘ఎ’ జట్టులో కూడా ఒక మ్యాచ్ దక్కితే, అంతకు ముందు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ సీజన్ మొత్తంలో రెండు మ్యాచ్‌లే ఆడించింది. తగినన్ని మ్యాచ్‌లు లేకపోవడమే నాకు బాధ కలిగిస్తోంది. ఆయా టీమ్ మేనేజ్‌మెంట్‌లు, సెలక్టర్ల ప్రాధాన్యాలు వేరుగా ఉండవచ్చు. కానీ దేశవాళీలో నిలకడగా ఆడుతున్నప్పుడు ఏ ఆటగాడైనా భారత జట్టు గురించే ఆలోచిస్తాడు కదా. అయితే ఆల్‌రౌండర్‌గా నాకు మంచి అవకాశం ఉందని నమ్ముతున్నా. మున్ముందు భారత్ తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడతాననే విశ్వాసం ఉంది.
 
ఆటతీరు మెరుగు పర్చుకోవడం
 మా వద్ద చెప్పుకోదగ్గ కోచ్‌లు లేరు కాబట్టి ఎక్కడ పెద్దవాళ్లు ఎవరు కలిసినా వీలైనంత ఎక్కువ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా. ఇటీవల ఇండియా ‘ఎ’ తరఫున ఆడినప్పుడు ద్రవిడ్ నా బ్యాటింగ్ గురించి చాలా సూచనలు ఇచ్చారు. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం. ఇక ఐపీఎల్‌లో అయితే సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్ మురళీధరన్ వద్ద ఆఫ్‌స్పిన్ గురించి ఎంతో నేర్చుకున్నా. ఆయన చాలా మంచి మనిషి. సరిగ్గా చెప్పాలంటే గంటలు గంటలు ఆయనను ఒక రకంగా వేధించాను. దాంతో ఆ 45 రోజుల్లో చాలా సార్లు ‘ఈ రోజుకు ఇది చాలు, రేపు నేర్చుకుందాం’ అని మురళీనే అనేవారు.

 ఇప్పటి వరకు దక్కిన గుర్తింపు
 కశ్మీర్ క్రికెటర్‌గా నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. దిగ్గజం బిషన్‌సింగ్ బేడి ప్రోత్సాహంతో ఇక్కడి దాకా రాగలిగాను. కానీ నేను ఇంకా ఎదగాలని భావిస్తున్నా. దురదృష్టవశాత్తూ మా టీమ్ గ్రూప్ ‘సి’లో ఉండటంతో నా ప్రదర్శనకు పెద్దగా గుర్తింపు లభించడం లేదు. పైగా అసోసియేషన్ రాజకీయాలు ఆటగాళ్లపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. మధ్యలో రెండేళ్ల పాటు మా టీమ్‌కు మ్యాచ్ ఫీజులే రాలేదు! గత ఏడాది ఆ బాకీల్లో కొంత ఇచ్చారు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా ఏడేళ్ల కెరీర్ పూర్తయింది. కానీ నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థ ఆ అవకాశం ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా నాతో ఆడే దాదాపు అందరు క్రికెటర్లకు ఉద్యోగాలున్నాయి. ఆటకు సంబంధించిన సౌకర్యాలే కాదు ప్రోత్సాహకాలూ లేవు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది మరో జట్టు తరఫున ఆడే విషయం గురించి ఆలోచిస్తా.

 (హైదరాబాద్‌తో రంజీట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు నగరానికి వచ్చిన సందర్భంగా సాక్షితో రసూల్ ప్రత్యేకంగా ముచ్చటించాడు)
 -సాక్షి, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement