సెమీస్‌లో శరత్ కమల్‌కు షాక్
14 ఏళ్ల జపాన్ కుర్రాడి చేతిలో పరాజయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 34 ఏళ్ల శరత్ కమల్ 7–11, 11–5, 7–11, 13–11, 9–11, 9–11తో 14 ఏళ్ల తొమొకాజు హరిమోటో (జపాన్ ) చేతిలో ఓడిపోయాడు.
జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గా ఉన్న హరిమోటో అద్వితీయ ప్రదర్శనకు ‘ట్రిపుల్ ఒలింపియన్ ’ శరత్ కమల్ చేతులెత్తేశాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో శరత్ 11–4, 10–12, 9–11, 11–6, 11–9, 9–11, 13–11తో పాల్ డ్రింకాల్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో దిమిత్రిజ్ (జర్మనీ)తో హరిమోటో తలపడతాడు. తొలి సెమీఫైనల్లో దిమిత్రిజ్ 8–11, 11–2, 9–11, 12–10, 14–16, 11–2, 11–8తో నివి కోకి (జపా¯ŒS)పై విజయం సాధించాడు.