అఫ్ఘానిస్థాన్ సంచలనం
ఫతుల్లా: ‘గతంలోనూ భారత్‌ను ఓడించాం కాబట్టి ఈసారి గెలిచినా దాన్ని సంచలనంగా చూడొద్దు. ఎందుకంటే ఆ జట్మాకు మామూలే’ బుధవారం భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ వ్యాఖ్య ఇది.
కానీ మూడు రోజుల్లోనే ఆ జట్టు సంచలన ఫలితంలో భాగమైంది. అయితే అది గెలిచి కాదు... పసికూన అఫ్ఘానిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడి. వీరోచిత బ్యాటింగ్‌కు తోడు నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న అఫ్ఘానిస్థాన్ శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తద్వారా టెస్టు హోదా ఉన్న దేశంపై ఓ గొప్ప విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. టెస్టు హోదా ఉన్న దేశాలతో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అఫ్ఘానిస్థాన్ తొలిసారి విజయం సాధించింది.
ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసింది. అస్గర్ (103 బంతుల్లో 90 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సమీయుల్లా (69 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగి ఆడారు. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఓ దశలో అఫ్ఘాన్ 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే అస్గర్, సమీయుల్లా మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి ధాటికి చివరి 10 ఓవర్లలో ఏకంగా 107 పరుగులు సమకూరాయి. అరాఫత్ 2, మోమినల్, రూబెల్ చెరో వికెట్ తీశారు.
తర్వాత బంగ్లాదేశ్ 47.5 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. మోమినల్ హక్ (72 బంతుల్లో 50; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. నాసిర్ (60 బంతుల్లో 41; 1 ఫోర్, 1 సిక్సర్), జియావుర్ రెహమాన్ (22 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఒక్క పరుగుకే ఓపెనర్లిద్దర్ని కోల్పోయిన బంగ్లాను మోమినల్, ముష్ఫికర్‌లు మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించి ఆదుకున్నారు. వీరిద్దరు అవుటైన తర్వాత బంగ్లాదేశ్ కోలుకోలేకపోయింది. సమీయుల్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.