ప్రపంచకప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు
పాక్ స్టార్ ఆఫ్రిది ప్రకటన
కరాచీ: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది... వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలుకనున్నాడు. టి20 కెరీర్‌పై దృష్టిపెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘వన్డేలకు గౌరవప్రదంగా, ఉన్నత పద్ధతిలో వీడ్కోలు చెప్పాలని అనుకున్నాను. టి20లపై దృష్టిపెట్టేందుకు ఇది సరైన సమయం. సరైన సమయంలో నిర్ణయం తీసుకునే సత్తా నాకుందని భావిస్తున్నా. గతంలో కొంత మంది దిగ్గజ ఆటగాళ్లు సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యారు.
కానీ నాకు ఆ సమస్య లేదు. వన్డేలకు గుడ్‌బై చెప్పిన తర్వాత టి20 కెప్టెన్సీపై ఎక్కువగా దృష్టిసారిస్తా. 2016 టి20 కప్ భారత్‌లో జరగనుంది. అక్కడ ట్రోఫీ గెలవాలన్నది నా కోరిక. ఇందుకోసం మంచి జట్టును తయారు చేసేందుకు కృషి చేస్తా’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. వీడ్కోలు నిర్ణయాన్ని జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చించానని, అయితే ఇంకా బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదన్నాడు. సరైన రీతిలో రిటైర్మెంట్‌ను ప్రకటిస్తున్న తొలి పాక్ ఆటగాడిని తానేనన్నాడు. వన్డేల్లో తాను సాధించిన దానికి సంతృప్తిగా ఉందన్నాడు. ఇప్పటి వరకు పాక్ తరఫున ఆఫ్రిది 389 వన్డేలు, 27 టెస్టులు, 77 టి20లు ఆడాడు.