
సౌత్ జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికైన స్టీఫెన్
క్రికెట్‌లో రాణిస్తున్న పేదింటి కుసుమం
లెప్ట్ హ్యాండ్ బౌలర్‌గా ప్రతిభ
కాకినాడ స్పోర్ట్స్ : అతడు పుట్టింది నిరుపేద కుటుంబంలోనే. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. చిన్నతనం నుంచీ క్రికెట్ అంటే అతడికి ప్రాణం. కృషి, పట్టుదల ఉంటే క్రికెట్‌లో రాణించవచ్చని నిరూపించాడు. వసీం అక్రం, జహీర్‌ఖాన్ తన ఆదర్శ బౌలర్లు. ఎడమ చేతి బౌలరుగా అంచెలంచెలుగా రాణిస్తూ దాదాపు 30 ఏళ్ల తరువాత జిల్లా నుంచి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై రికార్డు సృష్టించాడు. పెద్దాపురానికి చెందిన సీహెచ్ వీరరాఘవులు, మణిల కుమారుడు స్టీఫెన్. పెద్దాపురం ఏఆర్ కళాశాలలో ఇంటర్ చదివిన స్టీఫెన్ ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చేస్తున్నాడు. ఈ నెల 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లో జరిగిన సుబ్బయ్య పిళ్ళై ట్రోఫీలో స్టీఫెన్ ఆంధ్రా తరఫున ఆడి హైదరాబాద్‌పై 3, కేరళపై 4, గోవాపై 3, కర్నాటకపై 1 చొప్పున వికెట్లు తీశాడు. తద్వారా ముంబైలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3 వరకూ జరగనున్న సౌత్‌జోన్ దియాధర ట్రోఫీకి ఎంపికయ్యాడు.
ఎంపిక పత్రాలను జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి కె.బాపిరాజుకు ఏసీఏ ఆపరేషన్స్ డెరైక్టర్, మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్, కార్యదర్శి గోకరాజు గంగరాజు శనివారం అందజేశారు. స్టీఫెన్ 2010-11లో బీసీసీఐ బౌలింగ్ శిక్షణకు హాజరయ్యాడు. గతంలో అండర్-16, 19, 22, 25, రంజీ పోటీలకు జిల్లా నుంచి ఎంపికై ప్రతిభ చూపాడు. స్టీఫెన్‌ను జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు డాక్టర్ కేటీ మ్యాథ్యూస్, కార్యదర్శి కె.బాపిరాజు, కోశాధికారి సత్యనారాయణ, కోచ్ డి.రవికుమార్ అభినందించారు.