* విజయ్ హజారే ట్రోఫీ రౌండప్
* క్వార్టర్స్‌లో పంజాబ్, ఢిల్లీ
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటకకు.. విజయ్ హజారే ట్రోఫీలో షాక్ తగిలింది. గ్రూప్-బిలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా... నాకౌట్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 207 పరుగుల భారీ తేడాతో జమ్మూ అండ్ కాశ్మీర్‌పై నెగ్గింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 50 ఓవర్లలో 5 వికెట్లకు 349 పరుగులు చేసింది. సీఎం గౌతమ్ (109 నాటౌట్) సెంచరీ చేశాడు.
కర్ణాటక కెప్టెన్ వినయ్ 20 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేయడం విశేషం. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ 27.3 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. ఈ గ్రూప్‌లో 20 పాయింట్లతో జార్ఖండ్, గుజరాత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి.
తమిళనాడు ముందంజ
గ్రూప్-ఎలో తమిళనాడు, పంజాబ్ చెరో 20 పాయింట్లతో క్వార్టర్స్‌కు చేరాయి. రాజస్తాన్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు 252 పరుగుల తేడాతో గెలిచింది. సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇదే గ్రూప్‌లో ముంబై తమ ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గెలిచినా 16 పాయింట్లతో నాకౌట్‌కు చేరలేకపోయింది. మరోవైపు గ్రూప్-సిలో ఆంధ్రతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ.. క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ఆంధ్ర 183 పరుగులకు ఆలౌటైతే.. ఢిల్లీ 184 పరుగులు సాధించింది. ఉన్ముక్త్ చంద్ (118 నాటౌట్) సెంచరీ చేశాడు. ఈ గ్రూప్‌లో విదర్భ, ఢిల్లీ 20 పాయింట్ల చొప్పున సాధించి క్వార్టర్స్‌కు చేరాయి. గ్రూప్-డిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లు నాకౌట్ బెర్త్‌లను సాధించాయి. రెండు జట్లు 16 పాయింట్ల చొప్పున సాధించి ముందుకు వెళ్లాయి. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ 41 పరుగులతో మధ్యప్రదేశ్‌పై నెగ్గింది. ముందుగా హిమాచల్ 295 పరుగులు చేసింది. రిషీ ధావన్ (117 నాటౌట్) సెంచరీ చేయగా, రాబిన్ బిస్త్ (84) రాణించాడు. తర్వాత మధ్యప్రదేశ్ 254 పరుగులకే పరిమితమైంది.
కర్ణాటక, ముంబైలకు షాక్
Published Sat, Dec 19 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM
Advertisement
Advertisement