బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
న్యూఢిల్లీ: భారత సీమర్ల సత్తా పెంచిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇప్పుడు రిజర్వ్ బెంచ్ బలగాన్ని పెంచే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్ నాటికి పటిష్ట బౌలింగ్ దళాన్ని అందుబాటులో ఉంచడమే తన లక్ష్యమని అరుణ్ చెప్పారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లిలు కూడా ప్రత్యామ్నాయాలపైనే దృష్టిపెట్టారని తెలిపారు. ప్రస్తుతం వన్డేల్లో భువనేశ్వర్, బుమ్రాలతో భారత పేస్ విభాగం పటిష్టంగానే ఉందన్నారు. అయితే ఇప్పుడు శ్రీలంకకు వెళ్లనున్న సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్‌లకు నిరూపించుకునేందుకు చక్కని అవకాశం లభించిందని భరత్ చెప్పుకొచ్చారు. శార్దుల్ దక్షిణాఫ్రికాలో ఆకట్టుకున్నాడని... ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు దేవధర్ ట్రోఫీలో ఆడుతుండటం వాళ్లకు మంచి ప్రాక్టీస్ కాగలదని తెలిపారు.
‘ఇప్పుడు సక్సెస్ అయిన వీళ్లందరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మెరుగులు దిద్దుకున్నవారే. తమ బౌలింగ్‌లో లైన్ అండ్ లెంత్‌తో పాటు నిలకడగా రాణిస్తుండటం శుభపరిణామం. ఎంత మెరుగైన ప్రదర్శన చేసినా టెస్టుల్లో తమ బౌలర్లు 20 వికెట్లు తీసినపుడే ఆ కోచ్‌కు పూర్తి సంతృప్తి కలుగుతుంది’ అని అరుణ్ అన్నారు. క్రికెట్ బాక్సింగ్ లాగే ఉంటుందని... రింగ్‌లో పంచ్‌లకు, ప్రత్యర్థులకు భయపడితే ఎప్పటికీ ఎదురీదలేమన్నారు. ‘క్రికెట్ కూడా బాక్సింగ్‌లాగే! భయాన్ని పక్కనబెట్టి విజయంపైనే దృష్టి పెడితే ముందడుగు వేస్తాం. మా కోచింగ్ బృందం నుంచి కేవలం సూచనలు, సలహాలే వెళతాయి. కానీ బరిలో వాటిని ఆచరించి విజయవంతమవడం ఆ బౌలర్ల చేతిలోనే ఉంటుంది’ అని అరుణ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment