
మాంచెస్టర్ : టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని మరోసారి తన పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో స్లాగ్ ఓవర్లలో స్లో బ్యాటింగ్ చేయడంతో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. దీంతో ధోని బ్యాటింగ్ తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ధోని పరుగులు చేయడానికి ఇబ్బందులు పడిన మ్యాచ్‌లోనే సారథి విరాట్ కోహ్లి వందకు పైగా స్ట్రైకే రేట్‌తో అర్దసెంచరీ సాధించాడని క్రీడా విశ్లేషకులు పోలుస్తున్నారు. అయితే ఈ విషయంలో ధోనికి టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మద్దతుగా నిలుస్తున్నాడు.
‘ఒక ఆటగాడిని మరొక ఆటగాడితో ఎలా పోల్చుతారు?విరాట్ కోహ్లి ప్రస్తుతం అన్ని ఫార్మట్లలో నంబర్ వన్ బ్యాట్స్‌మన్. అతడితో ఇంకొక ఆటగాడిని పోల్చడం తప్పు. ఇక అఫ్గాన్ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ వైఫల్యంపై మీరందరూ మాలో ఎవరిని ప్రశ్నించినా తమది ఒకటే సమాధానం.. పొరపాట్లను గుర్తించాం.. మెరుగుపర్చుకుంటాం. ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన విమర్శించడం తగదు. ప్రపంచకప్ తొలి మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా భారీ స్కోర్లు సాధించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అఫ్గాన్ మ్యాచ్‌లో పరిస్థితులు, వాతావరణం, పిచ్ ఇవన్నీ చూడాలి కదా. అయితే ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా బ్యాట్స్‌మెన్ రాణించగలగాలి. కచ్చితంగా మిగతా మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన ఇస్తాం’అంటూ భరత్ అరుణ్ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్ గురువారం వెస్టిండీస్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment