ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బలయ్యాడని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా బలంగా పేర్కొనే టాపార్డర్ విఫలమైనా లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారని కితాబిచ్చాడు. ఏదేమైనా ప్రపంచకప్ ఆసాంతం మెరుగ్గా రాణించిన టీమిండియా పట్ల భారత అభిమానులు గర్వపడాలని పేర్కొన్నాడు. అదే విధంగా మ్యాచ్ చివరిదాకా పోరాడిన జడేజా, ధోనీలపై ప్రశంసలు కురిపించాడు. మెగాటోర్నీ నుంచి కోహ్లి సేన నిష్క్రమణపై పాక్ మాజీ దిగ్గజం తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు.
ఈ క్రమంలో షోయబ్ మాట్లాడుతూ...‘ ఐదుగురు టాప్ ఆటగాళ్ల బ్యాటింగ్ పూర్తిగా నిరాశ పరిచింది. రోహిత్ అద్భుత బంతికి ఔటయ్యాడు. కానీ కోహ్లి దురదృష్టవంతుడు. కోహ్లి బాదిన బంతి బెయిల్స్‌ని అలా క్లిప్ చేస్తూ వెళ్లింది. అయితే ఫీల్డ్ అంపైర్ దానిని ఔట్‌గా ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా లోయర్ ఆర్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జడేజా వచ్చేంత వరకు అసలు ఆటలో మజానే లేదు. ఇక ధోని కూడా విజయంపై ఆశలు రేకెత్తించాడు. అసలు ధోని రనౌట్ అవుతాడని ఎవరైనా ఊహించి ఉంటారా. అయినా తనెప్పటికీ లెజెండే. క్రికెట్‌కు తనో గొప్ప అంబాసిడర్. అయితే దురదృష్టవశాత్తూ ఈసారి టీమ్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లలేకపోయాడు. ఏదేమైనా ప్రపంచకప్‌లో అద్భుత విజయాలు సాధించిన తమ జట్టు ప్రదర్శన పట్ల టీమిండియా అభిమానులు గర్వపడాలి’ అని షోయబ్ చెప్పుకొచ్చాడు. కాగా మెగాటోర్నీ పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచిన కోహ్లి సేన అనూహ్యంగా కివీస్ చేతిలో ఓటమి పాలై నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన రిజర్వ్ డే మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలై ఇంటిబాట పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment