ఎలా ఆడాలో ధోనికి తెలుసు: కోహ్లి | Virat Kohli One Off Day And Everyone Starts Talking | Sakshi
Sakshi News home page

ఎలా ఆడాలో ధోనికి తెలుసు: కోహ్లి

Published Fri, Jun 28 2019 9:43 AM | Last Updated on Fri, Jun 28 2019 9:43 AM

Virat Kohli One Off Day And Everyone Starts Talking - Sakshi

ఎమ్మెస్‌ ధోని, విరాట్‌ కోహ్లి

మాంచెస్టర్‌: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ఎలా ఆడాలో తెలుసని విమర్శకులకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చురకలంటించాడు. ప్రతి ఒక్కరికి చెడురోజులు ఉంటాయని, ధోనికి కూడా ఆరోజు కలిసిరాలేదన్నాడు. అతని చెడు రోజును అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కడు మాట్లాడుడేనని అసహనం వ్యక్తం చేశాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా ధోని-జాదవ్‌ నెమ్మదైన ఇన్నింగ్స్‌పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని (61 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ.. ధోని ప్రదర్శనను కొనియాడాడు. ‘ ధోనికి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసు. అతనికి ఒక్కరోజు కలిసిరాకపోతే ప్రతి ఒక్కడు నోరు పారేసుకుంటాడు. కానీ మేం అతనికి మద్దతుగా నిలుస్తాం. గొప్ప విషయం ఏంటంటే..క్లిష్ట పరిస్థితిల్లో కావాల్సిన పరుగులను ధోని అలవోకగా సాధిస్తాడు. ఆ సమయంలో ఎలా ఆడాలో అతనికి బాగా తెలుసు. అతని అనుభవంలో ఇలాంటి పది సందర్భాల్లో 8సార్లు విజయవంతమయ్యాడు. పిచ్‌ను అంచనా వేయడంలో అతనికిసాటి లేరు. సహజంగా ఆడే మాలోని కొంతమంది ఆటగాళ్లకు.. పిచ్‌ పరిస్థితులను బట్టి 265 పరుగులు మంచి స్కోర్‌ అని ధోని చెబితే.. మేం 230కే పరిమితమవుతాం. అతను మాకు దిగ్గజం. తను ఇలానే రాణిస్తాడని ఆశిస్తున్నాను. గత రెండు మ్యాచ్‌ల్లో మా వ్యూహాలు సరిగ్గా అమలు కాలేదు. కానీ మేం గెలుపు దిశగా పయనించాం. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలుస్తామని ఫీలవుతున్నాం. అఫ్గాన్‌ మ్యాచ్‌ పరిస్థితులు ఈ మ్యాచ్‌లో ఎదురయ్యాయి. కానీ హార్దిక్‌ పాండ్యా, ధోని అద్భుతంగా ఆడారు. 270 పరుగుల చేయడం ఈ పిచ్‌పై చాలా కష్టం‌. ఇక పరిస్థితులను ఆకలింపుచేసుకోవడం నా బలం. నా ఇన్నింగ్స్‌లో 70 శాతం పరుగులు సింగిల్స్‌ ద్వారానే చేసాను. ఇలాంటి పిచ్‌లపై పరుగుల చేయాలంటే అదే మంచి మార్గం.’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన విరాట్‌ కోహ్లి (82 బంతుల్లో 72; 8 ఫోర్లు) ఈ మ్యాచ్‌ ద్వారా అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లలో కలిపి) వేగవంతంగా 20 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. కోహ్లి ఈ మైలురాయిని 417 ఇన్నింగ్స్‌లో చేరుకున్నాడు. సచిన్, లారా (453 ఇన్నింగ్స్‌ చొప్పున) పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.

ధోనిపై మళ్లీ విమర్శలు..
61 బంతుల్లో 56 నాటౌట్‌... ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇది మంచి స్కోరే. అయినా సరే ధోని ఆటతీరుపై మళ్లీ విమర్శలు వినిపించాయి. చివరి ఓవర్‌ మెరుపులను మినహాయిస్తే వన్డే క్రికెట్‌కు ఎంతో అవసరమైన ‘స్ట్రయిక్‌ రొటేటింగ్‌’ విషయంలో ధోని బాగా ఇబ్బంది పడటమే అందుకు కారణం. తొలి 40 బంతుల్లో ధోని 20 పరుగులే చేయగా.. 37 వద్ద థామస్‌ రిటర్న్‌ క్యాచ్‌ వదిలేశాడు. అప్పటి వరకు 55 బంతుల్లో 40 పరుగుల వద్ద ఉన్న ఎమ్మెస్‌... థామస్‌ వేసిన ఆఖరి ఓవర్లో మాత్రం చెలరేగాడు. 2 భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌ బాది 16 పరుగులు రాబట్టాడు. తొలి 5 ఓవర్లలో 34 పరుగులిచ్చిన అలెన్‌... తర్వాతి 5 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చాడు. ఇందులో ధోనినే 19 బంతులు ఎదుర్కొన్నాడు. ఇదే విషయాన్ని సెహ్వాగ్‌ ప్రస్తావిస్తూ విమర్శించాడు. ఇక అప్గాన్‌ మ్యాచ్‌ అనంతరం సచిన్‌ కూడా ధోని నెమ్మదైన బ్యాటింగ్‌ను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
చదవండి : విండీస్‌నూ ఊదేశారు
‘సచిన్‌ కంటే ధోనీనే ఎన్నో రెట్లు గొప్ప ఆటగాడు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement