పేలవ ఫామ్‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. తొలి టెస్టులోనే సత్తా చాటాడు. పెర్త్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగి జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, తాను మునుపటి లయ అందుకోవడానికి కారణం పేస్ దళ నాయకుడు, ఆసీస్‌తో మొదటి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన జస్‌ప్రీత్ బుమ్రానే అంటున్నాడు సిరాజ్.
అప్పటికీ వికెట్లు లభించకపోతే
‘నేను తరచుగా నా బౌలింగ్ గురించి బుమ్రాతో చర్చిస్తూనే ఉంటా. తొలి టెస్టుకు ముందు కూడా నా పరిస్థితి గురించి అతడికి వివరించా. బుమ్రా నాకు ఒకటే విషయం చెప్పాడు. ఎలాగైనా వికెట్ సాధించాలనే లక్ష్యంతో దాని గురించే అతిగా ప్రయత్నించవద్దు.
నిలకడగా ఒకే చోట బంతులు వేస్తూ బౌలింగ్‌ను ఆస్వాదించు. అప్పటికీ వికెట్లు లభించకపోతే నన్ను అడుగు అని బుమ్రా చెప్పాడు. అతడు చెప్పిన మాటలను పాటించా. వికెట్లు కూడా దక్కాయి’ అని సిరాజ్ తన సీనియర్ పేసర్ పాత్ర గురించి చెప్పాడు.
మోర్నీ మోర్కెల్ కూడా
ఇక భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా తనతో దాదాపు ఇవే మాటలు చెప్పి ప్రోత్సహించాడని కూడా సిరాజ్ పేర్కొన్నాడు. ఆరంభంలో సిరాజ్ కెరీర్‌ను తీర్చిదిద్దడంతో భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అరుణ్‌ను సంప్రదించడం సిరాజ్‌కు అలవాటు.
అరుణ్ సర్‌ను అడిగా
ఈ విషయం గురించి సిరాజ్ మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కాలంగా నా బౌలింగ్ గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే నాకు ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ అరుణ్ సర్‌ను అడిగా. ఆయన కూడా వికెట్లు తీయడంకంటే ఒక బౌలర్ తన బౌలింగ్‌ను ఆస్వాదించడం ఎంతో కీలకమో, ఫలితాలు ఎలా వస్తాయో చెప్పారు’ అని వెల్లడించాడు.
ఇక ఆస్ట్రేలియాకు బయలుదేరడానికి ముందు భారత ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్‌కే చెందిన దిలీప్‌తో కలిసి సాధన చేసిన విషయాన్ని కూడా సిరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. మరోవైపు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు కోసం ‘పింక్ బాల్’తో సిద్ధమవుతున్నట్లు సిరాజ్ చెప్పాడు.
అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు
‘గులాబీ బంతి సింథటిక్ బంతి తరహాలో అనిపిస్తోంది. ఎరుపు బంతితో పోలిస్తే భిన్నంగా, గట్టి సీమ్‌తో ఉంది. నా దృష్టిలో ఈ బాల్‌తో షార్ట్ ఆఫ్ లెంగ్త్ తరహాలో బంతులు వేస్తే బాగుంటుంది.
దీంతో ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత పట్టు చిక్కుతుంది. అయితే లైట్లు ఉన్నప్పుడు ఎక్కువగా స్వింగ్ అవుతుందని విన్నా. నేను అలాంటి స్థితిలో ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు. అడిలైడ్‌లో అలాంటి వాతావరణంలో ప్రాక్టీస్ చేస్తా’ అని సిరాజ్ వివరించాడు.
కాగా స్వదేశంలో భారత జట్టు ఆడిన గత ఐదు టెస్టుల్లో నాలుగింటిలో హైదరాబాద్ పేసర్ సిరాజ్ బరిలోకి దిగాడు. వీటన్నింటిలో కలిపి అతడు మొత్తం కేవలం ఆరు వికెట్లే పడగొట్టగలిగాడు. అయితే, ఆస్ట్రేలియాలో అతడు తిరిగి ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. ఇక భారత్- ఆసీస్ మధ్య డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.
చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు
Comments
Please login to add a commentAdd a comment