ప్రపంచంలోనే బెస్ట్‌ బౌలర్‌ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ | I Will Tell My Grandkids I Faced Him: Travis Head Praises Jasprit Bumrah | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే బెస్ట్‌ బౌలర్‌ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్‌ విధ్వంసకర వీరుడు

Published Mon, Dec 2 2024 4:55 PM | Last Updated on Mon, Dec 2 2024 5:39 PM

I Will Tell My Grandkids I Faced Him: Travis Head Praises Jasprit Bumrah

టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.  ప్రపంచంలోని అత్యుత్తమ, గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకడని కొనియాడాడు. అతడి బౌలింగ్‌లో ఆడటం తనకు దక్కిన గౌరవమని.. తన మనవళ్లకు కూడా ఈ విషయం గురించి గర్వంగా చెప్పగలనంటూ బుమ్రాను ఆకాశానికెత్తాడు.

భారత జట్టు బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించి.. కంగారూ గడ్డపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఇటు కెప్టెన్‌గా.. అటు బౌలర్‌గానూ
ఫలితంగా పెర్త్‌ వేదికగా తొలి టెస్టులో ఇటు కెప్టెన్‌గా.. అటు బౌలర్‌గానూ బుమ్రాకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో రైటార్మ్‌ పేసర్‌ బుమ్రా మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి.. ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలుచేశాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

 బుమ్రా వంటి గొప్ప బౌలర్‌ను ఎదుర్కొన్నానని
ఈ నేపథ్యంలో బుమ్రా నైపుణ్యాలను కొనియాడిన ఆసీస్‌ టెస్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ, గొప్పనైన ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా బుమ్రా ఎదుగుతాడు. మన కెరీర్‌ ముగిసిన తర్వాత.. వెనక్కి తిరిగి చూసుకుంటే.. బుమ్రా వంటి గొప్ప బౌలర్‌ను ఎదుర్కొన్నానని మనవలు, మనవరాళ్లకు చెప్పడం ఎంతో బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు.

89 పరుగులతో ఆసీస్‌ టాప్‌ స్కోరర్‌గా
కాగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసి.. భారత అరంగేట్ర పేసర్‌ హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో హెడ్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో ఆసీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ విధ్వంసకర ఓపెనర్‌గా హెడ్‌ ఆరెంజ్‌ ఆర్మీకి ఫేవరెట్‌ ప్లేయర్‌గా మారిపోయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. భారత్‌- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. డిసెంబరు 6- 10 వరకు పింక్‌ బాల్‌తో ఈ మ్యాచ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక తొలి టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. రెండో టెస్టు ఎన్నిరోజుల పాటు సాగనుందనే అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గిల్‌ అర్ధ శతకం
కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి టెస్టుకు దూరంగా ఉన్న భారత జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దీంతో బుమ్రా రోహిత్‌ సారథ్యంలో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

మరోవైపు.. గాయం నుంచి కోలుకున్న భారత యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా తిరిగి జట్టుతో చేరాడు. గులాబీ బంతితో ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్‌ అర్ధ శతకం(50- రిటైర్డ్‌ హర్ట్‌)తో చెలరేగాడు. రోహిత్‌ మాత్రం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు.  ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.

చదవండి: SMAT 2024 PUN Vs HYD: తిలక్‌ వర్మ విఫలం.. అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ విధ్వంసం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement