యువరాజ్ సింగ్ జోరు
బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో శతకం
ముంబై: ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికిన డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన మునుపటి జోరును ప్రదర్శిస్తున్నాడు. బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో యువీ 74 బంతుల్లోనే 105 పరుగుల (12 ఫోర్లు; 5 సిక్స్‌లు)తో చెలరేగాడు.
యువరాజ్ జోరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం)తో జరిగిన మ్యాచ్‌లో ఎయిర్ ఇండియా (ఏఐ) 102 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. గ్రూప్ ‘డి’లో భాగంగా వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఏఐ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 327 పరుగులు చేసింది. 99 పరుగుల వద్ద ఓ భారీ సిక్స్‌తో యువీ తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
మూడో వికెట్‌కు నమన్ ఓజా (41 బంతుల్లో 60; 7 ఫోర్లు; 2 సిక్స్‌లు)తో కలిసి 131 పరుగులు జోడించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌బీఎంను పేసర్ పంకజ్ సింగ్ (12/3) వణికించాడు. దీంతో 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 225 పరుగులు మాత్రమే చేసింది. అనిరుద్ధ జోషి (85 బంతుల్లో 72; 5 ఫోర్లు; 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.