యువరాజ్ ‘హాట్’!
ముంబై: పుణే వారియర్స్ జట్టు రద్దు కావడంతో భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రస్తుతం వేలంలో అందరికీ అందుబాటులో ఉన్నాడు. దాంతో అతడిని సొంతం చేసుకునేందుకు ఐపీఎల్‌లోని నాలుగు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో అతను ఆడిన పంజాబ్‌తో పాటు కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు కూడా యువీ కోసం ప్రయత్నిస్తున్నాయి.
తాజా కబురు: బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ (ఆర్‌సీబీ) జట్టు మాత్రం యువీ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇందుకోసం చొరవ ప్రదర్శిస్తున్నాడు. ఆర్‌సీబీలో చేరే విధంగా అతను ఇప్పటికే యువరాజ్‌తో మాట్లాడినట్లు సమాచారం. యువీ రాకతో తమ జట్టు బ్యాటింగ్ మరింత బలంగా మారుతుందని బెంగళూరు భావిస్తోంది.
ఎందుకీ ఆసక్తి: భారత వన్డే జట్టులో చోటు లేకపోయినా యువీ టి20ల్లో ఇప్పటికీ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ఈ ఫార్మాట్‌లో అతని లెఫ్టార్మ్ స్పిన్, చురుకైన ఫీల్డింగ్ ఏ జట్టుకైనా బలమే.
పాత రికార్డు: ఐపీఎల్‌లో యువరాజ్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్, పుణే వారియర్స్ జట్ల తరఫున ఆడాడు. మొత్తం 68 ఇన్నింగ్స్‌లలో 25.00 సగటుతో 1475 పరుగులు చేశాడు. 130.76 స్ట్రైక్ రేట్ ఉన్న యువీ...లీగ్‌లో ఇప్పటి వరకు 82 సిక్సర్లు బాదాడు.
తాజా ఫామ్: శనివారంనుంచి కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగితే వేలంలో యువీకి తిరుగుండదు. యువీ తాను ఆడిన ఆఖరి రెండు టి20ల్లో అద్భుత ఇన్నింగ్స్ (పాక్‌పై 36 బంతుల్లో 72, ఆస్ట్రేలియాపై 35 బంతుల్లో 77 నాటౌట్) ఆడటం గమనార్హం.
వేలంలో భారీ విలువ: వచ్చే నెల 12, 13 తేదీలలో ఐపీఎల్ వేలం జరగనుంది. చెన్నై, ముంబై మినహా అందరి దగ్గరా భారీగా డబ్బు ఉంది. కాబట్టి యువీ జాక్‌పాట్ కొట్టొచ్చు.