యువరాజ్‌సింగ్
ముంబై: సీనియర్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌సింగ్‌పై మరోసారి వేటు పడింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టెస్టు సిరీస్‌లో కోసం మంగళవారం సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. వన్డే టీమ్‌లో యువరాజ్‌కు చోటు దక్కలేదు. కివీస్ పర్యటనలో భాగంగా భారత్ 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టూర్ కోసం టీమిండియా ఈ నెల 12న బయల్దేరి వెళుతుంది.
ఆరోన్ పునరాగమనం
దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత ఇటీవలే జట్టులోకి వచ్చిన యువీ ఆ తర్వాత జరిగిన మూడు వన్డే సిరీస్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. గత 8 ఇన్నింగ్స్‌లలో అతను ఒక అర్ధ సెంచరీతో కేవలం 118 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉన్నాయి.
యువీ స్థానంలో కర్ణాటక ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీని ఎంపిక చేశారు. ప్రస్తుత సెలక్టర్ రోజర్ బిన్నీ కుమారుడైన 29 ఏళ్ల స్టువర్ట్ 48 దేశవాళీ వన్డేల్లో 669 పరుగులు చేసి 37 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అతను 6 మ్యాచ్‌లలో 321 పరుగులు చేసి 11 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్ స్థానంలో మరో పేసర్ వరుణ్ ఆరోన్‌కు చోటు దక్కింది. రెండేళ్ల క్రితం ఆఖరి వన్డే ఆడిన ఆరోన్ ఫిట్‌నెస్ సమస్యలతో దూరమయ్యాడు.
పాండేకు డబుల్ చాన్స్
మరో వైపు మధ్య ప్రదేశ్ పేస్ బౌలర్ ఈశ్వర్ చంద్ పాండేకు తొలిసారి భారత జట్టులోకి పిలుపు లభించింది. టెస్టు, వన్డే జట్లు రెండింటిలోనూ పాండేకు చోటు దక్కడం విశేషం. పాండేకు అవకాశం కల్పిస్తూ వన్డే జట్టునుంచి మోహిత్ శర్మను, టెస్టు జట్టునుంచి హైదరాబాదీ ప్రజ్ఞాన్ ఓజాను తప్పించారు. ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓజాకు రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పాండే 131 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్‌లో 48 వికెట్లతో టాపర్‌గా నిలిచిన పాండే, ఈ ఏడాది కూడా 8 మ్యాచ్‌లలో 30 వికెట్లు పడగొట్టడం విశేషం.
జట్ల వివరాలు:
వన్డే జట్టు: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రాయుడు, రైనా, అశ్విన్, జడేజా, భువనేశ్వర్, షమీ, ఇషాంత్, మిశ్రా, ఆరోన్, బిన్నీ, పాండే.
టెస్టు జట్టు: ధోని (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, కోహ్లి, రోహిత్, రహానే, జడేజా, జహీర్, షమీ, ఇషాంత్, రాయుడు, భువనేశ్వర్, అశ్విన్, సాహా, ఉమేశ్, పాండే.
2000వ సంవత్సరంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన స్టువర్ట్ బిన్నీకి దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత జట్టు పిలుపు రావడం విశేషం. అదే జట్టులో సభ్యుడైన యువరాజ్ సింగ్ స్థానంలోనే ఇప్పుడు బిన్నీకి చోటు దక్కింది. టీమిండియాకు ఎంపిక కావడం పట్ల బిన్నీ సంతోషం వ్యక్తం చేశాడు.
కానీ ఈ ఎంపికపై ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. దేశవాళీ క్రికెట్‌లో అతనికంటే బాగా ఆడిన క్రికెటర్లు ఉన్నా... అతడి తండ్రి రోజర్ బిన్నీ సెలక్టర్ కావడం వల్లే అవకాశం దక్కిందని మాజీలు విమర్శిస్తున్నారు.
భారత్-న్యూజిలాండ్ టూర్ షెడ్యూల్
జనవరి 19 తొలి వన్డే నేపియర్
22 రెండో వన్డే హామిల్టన్
25 మూడో వన్డే ఆక్లాండ్
28 నాలుగో వన్డే హామిల్టన్
31 ఐదో వన్డే వెల్లింగ్టన్
ఫిబ్రవరి 6-10 తొలి టెస్టు ఆక్లాండ్
14-18 రెండో టెస్టు వెల్లింగ్టన్