అశ్విన్‌ను ఉద్దేశించి యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు (PC: BCCI)
Ravichandran Ashwin Doesn't Deserve Place: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఉద్దేశించి భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెన్నై బౌలర్‌కు పరిమిత ఓవర్ల జట్టులో స్థానం పొందే అర్హతే లేదన్నాడు.
ఆధునికతరం భారత మేటి స్పిన్నర్లలో ఒకడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు అశ్విన్. టెస్టుల్లో బంతి, బ్యాట్‌తో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
500 వికెట్ల మైలురాయికి చేరువగా
ముఖ్యంగా సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుందంటే అశూ జట్టులో ఉండాల్సిందే. ఇప్పటికే సంప్రదాయ క్రికెట్‌లో 490 వికెట్లు తీసిన అశూ.. ఇంగ్లండ్‌తో జనవరి 25 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరే దిశగా పయనిస్తున్నాడు.
5 శతకాలతో సత్తా చాటి
బ్యాటర్‌గానూ ఇప్పటిదాకా 95 టెస్టుల్లో అశూ 3193 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు, 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇలా ఆల్‌రౌండర్‌గా భారత టెస్టు జట్టులో పాతుకుపోయిన అశూకు.. వన్డే, టీ20 జట్టులో మాత్రం ఉండే అర్హత లేదంటున్నాడు యువీ.
అశూకు ఆ అర్హత లేదు
టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో భాగంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అశ్విన్ గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘అశ్విన్ గొప్ప బౌలరే... కానీ వన్డే, టీ20 జట్టులో ఉండే అర్హత అతడికి లేదు.
టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా అతడు బెస్ట్.. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా తను ఏం చేయగలడు? అందుకే టెస్టుల్లో తను కచ్చితంగా ఉండాలి. కానీ వైట్‌బాల్ క్రికెట్ జట్టులో అతడికి చోటు అవసరం లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు.
37 ఏళ్ల అశూ వైట్‌బాల్ జట్టులో అనవసరం!
కాగా ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో అశ్విన్ 116 వన్డేల్లో 156.. అదే విధంగా 65 టీ20లలో 72 వికెట్లు తీశాడు. అయితే, వన్డే, టీ20లలో యువ బౌలర్లు ప్రతిభ నిరూపించుకుంటున్నప్పటికీ 2011 మొదలు తాజాగా ముగిసిన 2023 వరల్డ్‌కప్ జట్లలో 37 ఏళ్ల అశూకు స్థానం లభించింది. ఈ నేపథ్యంలోనే యువరాజ్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్! భరత్ ఫిఫ్టీ..
Comments
Please login to add a commentAdd a comment