From Living In Tents To Rs 5 Crore Apartment: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. వరుస డబుల్ సెంచరీలు బాది ఇప్పటికే తనదైన ముద్ర వేశాడీ ముంబై బ్యాటర్.
ప్రత్యర్థి జట్లు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. ఇంగ్లండ్ వ్యూహాన్ని తిప్పికొడుతూ.. ‘బజ్‌బాల్’ పగిలేలా బ్యాట్‌తో మోత మోగించాడు. కెరీర్‌పరంగా ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్న యశస్వి జైస్వాల్.. వ్యక్తిగత జీవితంలోనూ కలలను సాకారం చేసుకునే పనిలో ఉన్నాడు.
చదరపు అడుగుకే రూ. 48 వేలు
ఇందులో భాగంగా.. ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. తూర్పు బాంద్రాలో రూ. 5.38 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నట్లు మనీకంట్రోల్ నివేదించింది.
అదానీ రియల్టీకి చెందిన బిల్డర్స్ నిర్మించిన ఈ నివాస స్థలంలో చదరపు అడుగు ధర రూ. 48 వేలు అని సమాచారం. జనవరి 7న జైస్వాల్ పేరిట కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది.
టెంట్లలో నివాసం నుంచి.. బాంద్రా ఫ్లాట్ దాకా!
కాగా 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ ప్రస్తుతం భారత క్రికెట్‌లో ముఖ్యంగా టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే, అతడి జీవితం పూలపాన్పేమీ కాదు. ఉత్తరప్రదేశ్‌లో డిసెంబరు 28, 2001లో జన్మించిన యశస్వికి చిన్నతనం నుంచే క్రికెట్ మీద ఆసక్తి.
అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఇంట్లో పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. ఈ క్రమంలో 13 ఏళ్ల వయసులో యశస్వి సొంతూరు భదోయిని వీడి ముంబైకి చేరుకున్నాడు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలన్న సంకల్పంతో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చాడు.
దుకాణాల్లో పనిచేసే వాడు
ముంబైకి వచ్చిన కొత్తలో టెంట్‌లో నివసించేవాడు. పాకెట్ మనీ కోసం దుకాణాల్లో పనిచేసేవాడు. అయితే, కోచ్ జ్వాలా సింగ్ యశస్విని చేరదీశాడు. అతడి సహకారంతో తన నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్న యశస్వి ముంబై అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు.
తన అసాధారణ ప్రతిభాపాటవాలతో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడే అవకాశం దక్కించుకుని.. టీమిండియా తలుపులు తట్టాడు. గతేడాది వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి.. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ బాది సత్తా చాటాడు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ ఇరగదీస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment