సర్ఫరాజ్ అరంగేట్రం సందర్భంగా రోహిత్ శర్మతో నౌషద్ ఖాన్ (ఫైల్ ఫొటో- PC: BCCI)
తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ స్పందించాడు. తన పేరిట నకిలీ ఖాతాలు తెరిచి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు.
యువ క్రికెటర్లు ఎవరూ కూడా ఈ మోసగాళ్ల వలలో చిక్కవద్దని.. తాను ఏ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించడం లేదని నౌషద్ ఖాన్ స్పష్టం చేశాడు. కాగా తన ఇద్దరు కుమారులు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లను టీమిండియాకు ఆడించాలన్నది నౌషద్ కల.
ఇందుకోసం వారిద్దరిని చిన్ననాటి నుంచే ఆ దిశగా ప్రోత్సహించి.. అనేక కష్టనష్టాలకోర్చి కోచ్‌గా శిక్షణనిచ్చి మెంటార్‌గా మార్గదర్శనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్, ముషీర్ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తండ్రి పేరును నిలబెడుతున్నారు.
అంచెలంచెలుగా ఎదిగి.. ముషీర్ ఖాన్ ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టగా.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్‌కోట్‌లో టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో నౌషద్ ఖాన్ కూడా కొడుకు పక్కనే ఉండి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అభిమానుల మనసును మెలిపెట్టాయి.
ఈ క్రమంలో సర్ఫరాజ్‌తో పాటు నౌషద్ ఖాన్ పేరు కూడా నెట్టింట మారుమ్రోగింది. ఈ నేపథ్యంలో.. ‘‘డబ్బులు కడితే ఐపీఎల్‌లో నెట్ బౌలర్లుగా లేదంటే దేశవాళీ క్రికెట్లో ఆడే ఛాన్సులు ఇప్పిస్తాం’’ అని నౌషద్ ఖాన్ పేరిట ప్రకటనలు రాగా.. అతడు తాజాగా స్పందించాడు.
ఈ మేరకు.. ‘‘నా పేరు మీద ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక మంది నకిలీ ఖాతాలు సృష్టించి.. ఐపీఎల్ నెట్‌బౌలర్లుగా, రాష్ట్రస్థాయి క్రికెటర్లుగా, అకాడమీ సెలక్షన్ విషయంలో సాయం చేస్తామంటూ డబ్బు అడుగుతున్నారు.
దయచేసి వీటిని ఎవరూ నమ్మకండి. మీ ప్రతిభ, హార్డ్‌వర్క్‌పైనే నమ్మకం ఉంచండి. నాకు ఏ ఐపీఎల్ జట్టుతోనూ సంబంధం లేదు. అదే విధంగా నేను ఏ జట్టుకు కూడా కోచింగ్ ఇవ్వడం లేదు. నకిలీ ప్రచారాలను నమ్మకండి. థాంక్యూ’’ అని నౌషద్ ఖాన్ ఓ వీడియో విడుదల చేశాడు.
ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరుగనున్న ఆఖరిదైన నామమాత్రపు ఆఖరి టెస్టుకు సిద్ధమవుతున్నాడు. ఇక రోహిత్ సేన ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-1తో గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment