టీమిండియా నయా సంచలనాలు... | Sakshi
Sakshi News home page

Ind vs Eng 2024: ఉరుములా ఒకరు.. మెరుపులా ఇంకొకరు!

Published Mon, Mar 11 2024 11:58 AM

Ind vs Eng 2024 Tests: 5 Bright New Talents Include Sarfaraz Jurel Emerging Stars - Sakshi

India vs England Test Series 2024: ఒకరు ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు.

అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌, ఆకాశ్‌ దీప్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ గురించే ఈ పరిచయ వాక్యాలు.

స్వదేశంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్‌ రజత్‌ పాటిదార్‌(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, ఉత్తరప్రదేశ్‌ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌, నాలుగో టెస్టులో బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌.. ఐదో టెస్టులో దేవ్‌దత్‌ పడిక్కల్‌ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.

వీరిలో 30 ఏళ్ల రజత్‌ పాటిదార్‌ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్‌లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం!

సర్ఫరాజ్‌ ఖాన్‌(Sarfaraz Khan).. సంచలనం
రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్‌కోట్‌ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్‌ ఖాన్‌, భార్య రొమానా జహూర్‌ సమక్షంలో.. స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు.

తన తొలి మ్యాచ్‌లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్‌లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.

తదుపరి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్‌ ఖాన్‌ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం.

ధ్రువ్‌ జురెల్‌(Dhruv Jurel).. మెరుపులు
రాజ్‌కోట్‌ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్‌ జురెల్‌. ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు  ఈ 23 ఏళ్ల బ్యాటర్‌.

టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. 

మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా  ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్‌ కీపర్‌గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు.

ఆకాశ్‌ దీప్‌(Akash Deep).. ఆకాశమే హద్దుగా
రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌ దీప్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేతుల మీదుగా   క్యాప్‌ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్‌ స్టార్లు బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్‌ క్రాలేను కూడా అవుట్‌ చేసి ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

దేవ్‌దత్‌ పడిక్కల్‌(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా
ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. 

ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్‌.. ఈ సిరీస్‌లో వరుస డబుల్‌ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్‌లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 712 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

ఉపఖండ పిచ్‌లపై తాము సైతం అంటూ..
ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్‌ సందర్భంగా అరంగేట్రం చేసిన  ఇంగ్లండ్‌ స్పిన్నర్లు టామ్‌ హార్లే, షోయబ్‌ బషీర్‌ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్‌ బషీర్‌ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్‌ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు.

Advertisement
Advertisement